బీఆర్ఎస్ నేతల కాంటాల్లో ఇసుక లారీల తూకం

  • కొల్లూరు క్వారీల్లో పనిచేయని సర్కారు కాంటాలు
  • ప్రైవేట్​ వేబ్రిడ్జిల్లో లారీలను తూకం వేస్తున్న వైనం
  • ఒక్కో లారీకి  రూ.200 చొప్పున వసూళ్లు
  • రోజుకు రూ.50వేలు, నెలకు రూ.15లక్షలకు పైగా కలెక్షన్ 
  • టీజీఎండీసీ అధికారుల తీరుపై విమర్శలు

మంచిర్యాల/చెన్నూర్, వెలుగు: మంచిర్యాల జిల్లాలోని కొల్లూరు ఇసుక క్వారీల్లో టీజీఎండీసీ ఏర్పాటు చేసిన కాంటాలు(వే బ్రిడ్జిలు) పనిచేయడం లేదు. దీంతో క్వారీలకు సమీపంలో బీఆర్​ఎస్​ లీడర్లకు చెందిన ప్రైవేట్ ​కాంటాల్లో ఇసుక లారీలను తూకం వేస్తున్నారు. అక్కడ ఒక్కో లారీకి రూ.200 చొప్పున రోజుకు సుమారు రూ.50 వేలు, నెలకు రూ.15 లక్షల వరకు కలెక్షన్​ చేస్తున్నారు. సర్కారు కాంటాలు నిజంగానే పనిచేయడం లేదా? ఒకవేళ ఖరాబైతే రిపేర్లు ఎందుకు చేయించడం లేదు అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. బీఆర్​ఎస్ ​లీడర్లకు దోచిపెట్టడానికే అధికారులు పట్టించుకోవడం లేదా? అన్న అనుమానాలను వ్యక్తమవుతున్నాయి.
  
బీఆర్​ఎస్​ ప్రభుత్వంలో మొదలైన దోపిడీ..

బీఆర్ఎస్​ సర్కారు హయాంలోనే కొల్లూరు గోదావరిలో ఇసుక రీచ్​లకు పర్మిషన్లు ఇచ్చారు. 40 లక్షల క్యూబిక్ ​మీటర్ల ఇసుక తీయడానికి అనుమతులుచ్చి 5 లక్షల క్యూబిక్​ మీటర్లకు ఒకటి చొప్పున 8 రీచ్​లుగా విభజించారు. వీటి నిర్వహణను అప్పటి టీఎస్ఎండీసీకి అప్పగించారు. గోదావరిలో ఇసుక తోడి స్టాక్​ యార్డుకు తరలించి లారీల్లో లోడింగ్​ చేయడానికి టెండర్ల ద్వారా కాంట్రాక్టర్లకు కట్టబెట్టారు.

ఆన్​లైన్​లో​ ఇసుక బుకింగ్​ చేసుకున్న లారీలు స్టాక్ యార్డులో లోడ్​ చేసుకున్న తర్వాత అక్కడే ఏర్పాటు చేసిన కాంటాల్లో తూకం వేసి తరలించాలి. లారీ టైర్ల సంఖ్యను బట్టి నిర్ణీత లోడ్​ మాత్రమే రవాణా చేయాలి. ఇదే అదునుగా బీఆర్ఎస్ ​లీడర్లు గత ప్రభుత్వ హయాంలో ఇసుక రీచ్​లకు సమీపంలో ప్రైవేట్​కాంటాలు ఏర్పాటు చేసి దోపిడీకి తెరలేపారు. రాష్ట్రంలో ప్రభుత్వం మారినప్పటికీ ప్రైవేట్ తూకం దందా నేటికీ అలాగే కొనసాగుతోంది. దీంతో టీజీఎండీసీ అధికారుల తీరుపై విమర్శలు వస్తున్నాయి. 

లారీకి రూ.200 వసూలు

ఇసుక క్వారీల్లోని కాంటాలు పనిచేయడం లేదన్న సాకుతో అధికారులు ప్రైవేట్ కాంటాల్లో లారీలను తూకం వేస్తున్నారు. ప్రస్తుతం కొల్లూరులో మూడు రీచ్​లు నడుస్తున్నాయి. రోజుకు దాదాపు 250 నుంచి 300 లారీలు ఆన్​లైన్ ​బుకింగ్​అవుతున్నాయి. పలుగుల–4 క్వారీలోని కాంటా పనిచేయడం లేదని అక్కడే ఉన్న  ప్రైవేట్​ కాంటాలో తూకం వేస్తున్నారు.

ఎర్రాయిపేట వద్ద ఉన్న 3, 4 నంబర్​క్వారీల్లో రెండు వేర్వేరు కాంటాలు ఉన్నప్పటికీ అవి కూడా పనిచేయడం లేదు. దీంతో సమీపంలోని చింతలపల్లి వద్ద బీఆర్ఎస్ లీడర్​కు చెందిన కాంటాలో తూకం వేస్తున్నారు. ఒక్కో లారీకి రూ.200 చొప్పున రోజుకు సుమారు రూ.5వేలు, నెలకు రూ.15 లక్షల వరకు కలెక్షన్​ చేస్తున్నారు. ఇందులో సంబంధిత అధికారులు, సిబ్బందికి సైతం వాటాలు ముడుతున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.  

ఓవర్​ లోడ్​ ఉన్నా రైట్ ​రైట్

ఇసుక క్వారీల్లోని కాంటాల దగ్గర సీసీ కెమెరాలు ఉండగా, ప్రైవేట్​ కాంటాల్లో ఏర్పాటు చేయలేదు. రీచ్​లు ఒకచోట దగ్గర, కాంటాలు మరో దగ్గర ఉండడంతో లారీల్లో ఓవర్​ లోడ్​ ఉన్నప్పటికీ పట్టించుకోవడం లేదు. రీచ్​లలోని కాంటాల్లో తూకం వేసినట్లయితే ఓవర్​ లోడ్​ ఉంటే అక్కడే తొలగించే అవకాశం ఉంటుంది. ప్రైవేట్​ కాంటాల దగ్గర ఆ చాన్స్​లేదు.

ఇదంతా కాంట్రాక్టర్లు, అధికారులు, ప్రైవేట్​ కాంటాల యజమానులు కుమ్మకై చేస్తున్నారని ఆరోపణలున్నాయి. ఇసుక క్వారీల ద్వారా వందల కోట్ల ఆదాయం వస్తున్నా కాంటాలను రిపేర్​ చేయించేందుకు టీజీఎండీసీ దగ్గర పైసల్లేవా? లేక అధికారులు కావాలనే కాంటా యజమానులకు దోచిపెడుతున్నారా? వారికే తెలియాలి. ఇప్పటికైనా ఇసుక క్వారీల్లోని కాంటాలను రిపేర్ ​చేయించి ప్రైవేట్ కాంటాల దోపిడీని అరికట్టాలని కోరుతున్నారు.