ఇన్సులిన్ నిరోధకత పెరగడానికి కారణమేంటి ..HBA1C లెవల్స్ అంటే ఏంటి..ఎంత ఉండాలి.?

దేశ ప్రజల్లో ఇన్సులిన్ నిరోధకత పెరుగుతున్నదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. జన్యు కారణాలతో పాటు ఇన్సులిన్ రెసిస్టెన్స్ పెరుగుతుండడం వల్ల కూడా దేశంలో డయాబెటిస్ బాధితుల సంఖ్య అధికమవుతోందని చెబుతున్నారు. ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటే.. రక్తంలోని చక్కెర స్థాయిలను కంట్రోల్ చేసే ఇన్సులిన్ హార్మోన్ కు మన శరీరంలోని కణాలు సరిగ్గా స్పందించకపోవడం. ఇటీవలి కాలంలో ఈ ట్రెండ్ ఎక్కువగా కనిపిస్తున్నట్టు నిపుణులు హెచ్చరిస్తున్నారు. మధుమేహ బాధితులు మరింతగా పెరిగితే దేశ ఆరోగ్య రంగంపై పెను ప్రభావం పడుతుందని, ప్రజల ఆర్థిక స్థితిగతులూ ప్రమాదంలో పడతాయని రిపోర్ట్​లో హెచ్చరించారు.  

హెచ్​బీఏ1సీ అంటే..

మన రక్తంలోని చక్కెర స్థాయిల మూడు నెలల సగటును తెలుసుకునేందుకు చేసే టెస్టే హెచ్​బీఏ1సీ. సాధారణంగా రక్తంలోని హీమోగ్లోబిన్​కు చక్కెర (గ్లూకోజ్ అణువు) అతుక్కుపోతుంది. దానినే గ్లైకేషన్ అంటారు. శరీరంలో చక్కెర స్థాయిలు ఎంత ఎక్కువుంటే అంత ఎక్కువగా హీమోగ్లోబిన్​కు అది అతుక్కుంటుంది. దాదాపు మూడు నెలలపాటు అలాగే ఉండిపోతుంది. దాని సగటును తెలుసుకునేందుకు చేసే టెస్టునే హెచ్​బీఏ1సీ అంటారు. దీనినే గ్లైకేషన్ హీమోగ్లోబిన్ టెస్ట్ అని కూడా పిలుస్తారు. సాధారణంగా రక్తపు చుక్కతో చేసే టెస్టుతో ఆ టైంకు ఎంత బ్లడ్ షుగర్ ఉందో మాత్రమే తెలుసుకునేందుకు వీలవుతుంది. కానీ హెచ్​బీఏ1సీ ద్వారా మూడు నెలల కాలంలో మన ఒంట్లో ఎంత స్థాయిలో షుగర్ ఉందో తెలుసుకోవచ్చు. ఈ స్టడీలో ఈ టెస్టుల ద్వారానే థైరోకేర్ సంస్థ రిపోర్ట్ ను సిద్ధం చేసింది. 

హెచ్​బీఏ1సీ లెవల్స్ ఎంతుండాలంటే..

రక్తంలో హెచ్​బీఏ1సీ స్థాయిలు 5.7 శాతం కన్నా తక్కువగా ఉంటే వారు డయాబెటిస్ కు దూరంగా ఉన్నట్టు భావిస్తారు. ఒకవేళ 5.7 నుంచి 6.5 శాతం మధ్య (117 నుంచి 137 ఎంజీ/డీఎల్​) ఉంటే ప్రిడయాబెటిస్ దశలో ఉన్నారని అర్థం. అంటే దాదాపు మధుమేహానికి దగ్గరయ్యారన్నట్టే. ఇక హెచ్​బీఏ1సీ స్థాయిలు 6.5 శాతం కన్నా లేదా 137 ఎంజీ/డీఎల్ కన్నా ఎక్కువగా ఉన్నట్టైతే షుగర్ బారిన పడ్డట్టు చెప్తారు.