ఎటువంటి ఖర్చు లేకుండా కాలరీలు మాత్రమే ఖర్చు చేయించే వర్కవుట్ వాకింగ్. వాకింగ్ రెగ్యులర్‌గా చేయడం వల్ల హెల్త్ బెనిఫిట్స్ బోలెడు. అదే ‘బ్యాక్ వాకింగ్ చేస్తే... మామూలు వాకింగ్ చేసిన దానికంటే ఎక్కువ హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి’ అంటున్నారు హెల్త్ ఎక్స్పర్ట్స్.
బ్యాక్ వాకింగ్ అనేది ఒకరకంగా బ్రెయిన్‌కు ఛాలెంజ్ లాంటిది. డైరెక్షన్ మార్చి వెనక్కి నడవడం వల్ల అటెన్షన్ ఎక్కువ పెట్టాల్సి వస్తుంది. ఇదొక్కటే కాదు బ్యాక్ వాకింగ్ వల్ల అదనంగా ఆరోగ్య లాభాలు చాలానే ఉన్నాయి అంటున్నారు ఎక్స్పర్ట్స్.
వారానికి రెండున్నర గంటలు
రెగ్యులర్‌గా యాక్టివ్‌గా ఉన్నా, లేకున్నా ప్రతిరోజూ 10 నిమిషాలు బ్రిస్క్‌వాకింగ్ చేస్తే చాలు ఆరోగ్యం సొంతం అవుతుందని చెప్తారు ఎక్స్పర్ట్స్. ప్రపంచ ఆరోగ్య సంస్థ లెక్కల ప్రకారం వారానికి 150 నిమిషాలు అంటే... రెండున్నరగంటలు ఏరోబిక్ యాక్టివిటీ చేస్తే చాలని ఈ మధ్యనే ఒక రిపోర్టు చెప్పింది.
నడక క్లిష్టమైనదే!
వాకింగ్ కాంప్లికేటెడ్ విషయం కానే కాదనేవాళ్లు ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి. వాకింగ్ అనేది కాంప్లికేటెడ్ విషయమే. అదెలాగంటే వాకింగ్ చేసేటప్పుడు దృష్టి, శరీరం కదలికలో వేగం వంటి వాటిని గమనిస్తూ చేయాలి. ఇదంతా మామూలు వాకింగ్‌కి అవసరం. మరి వెనక్కి నడిస్తే... ఆ ప్రాసెస్‌లో శరీర వ్యవస్థను కో–ఆర్డినేట్ చేయడంకోసం బ్రెయిన్ మీద అదనపు డిమాండ్ పడుతుంది.
చిన్న అడుగులతో...
వెనక్కి నడవడం వల్ల బాడీ స్టెబిలిటీ, బ్యాలెన్స్ మెరుగుపడతాయి. ముందుకు వేసే అడుగులు కూడా బెటర్ అవుతాయి. వయసులో పెద్దవాళ్లకు బాడీ బ్యాలెన్స్ వస్తుంది. ఆస్టియోఆర్థరైటిస్ సమస్య వల్ల మోకాళ్ల నొప్పులతో ఇబ్బందిపడుతున్న వాళ్లకి వెనక్కి నడవడం అనేది మేలు చేస్తుంది.
వెనక్కి నడవడం వల్ల చిన్న అడుగులు పడతాయి. ఆ అడుగులు కూడా వెంటవెంటనే పడుతుంటాయి. దానివల్ల కాలి కింది ప్రాంతంలో కండరాల బలం పెరుగుతుంది. కీళ్ల మీద భారం పడదు.
మడమ నొప్పికి మందు
ఈ మధ్య ఎక్కువ మంది ఇబ్బంది పడుతున్న మడమ నొప్పి నుంచి ఉపశమనం ఉంటుంది. కీళ్లు, కండరాల కదలికలో మార్పు వస్తుంది. అలాగే వెనక్కి నడవడం వల్ల శరీర భంగిమ(పోశ్చర్) మెరుగుపడుతుంది. బ్యాక్ వాకింగ్‌లో లుంబార్ స్పైన్‌కి సపోర్టుగా ఉండే కండరాలు వాడతారు. దీర్ఘకాలంగా లోయర్ బ్యాక్ పెయిన్‌తో బాధపడుతున్న వాళ్లు బ్యాక్ వాకింగ్ చేయడం చాలా మేలు.
హెల్దీ వెయిట్
స్ట్రోక్ లేదా న్యూరలాజికల్ కండిషన్స్ వల్ల కొందరు బ్యాలెన్స్ తప్పి పడిపోతుంటారు. వెనక్కి నడవడం వల్ల ఈ సమస్యను ముందుగానే గుర్తించే అవకాశం ఉందట! నడక డైరెక్షన్ మార్చడం వల్ల చికిత్సాపరమైన లాభమే కాకుండా రీసెర్చర్లకు ఇంకా బోలెడన్ని లాభాలు కనిపించాయి. రెగ్యులర్‌గా చేసే వాకింగ్ హెల్దీ వెయిట్‌ను మెయింటెయిన్ చేస్తుంది. అదే బ్యాక్ వాకింగ్ చేస్తే ఆ రిజల్ట్ మరింత ఎఫెక్టివ్‌గా ఉంటుంది. మామూలుగా ముందుకు ఎంత వేగంతో నడుస్తారో వెనక్కి కూడా అంతే వేగంతో నడిస్తే 40 శాతం ఎక్కువ ఎనర్జీ ఖర్చవుతుంది అని తేల్చారు రీసెర్చర్లు. శరీరంలో కొవ్వు తగ్గడం గమనించారు.
రన్నర్స్‌కు అవసరం
వెనక్కి నడవడం బాగా ప్రాక్టీస్ అయ్యి కాన్ఫిడెన్స్ వచ్చాక రన్నింగ్ చేయడం అలవాటు చేసుకోవాలి. వెనక్కి పరిగెత్తడం వల్ల మోకాలిని స్ట్రెయిటెన్ చేసే కండరాల శక్తి పెరుగుతుంది. దీనివల్ల గాయాలు కావు. శక్తి ప్రొడ్యూస్ అవుతుంది. ముందుకు పరిగెత్తేటప్పుడు వాడేంత శక్తి.. వెనక్కి పరిగెత్తినప్పుడు వాడం. రన్నర్స్‌కి బ్యాక్ వాకింగ్ అనేది మేలు చేస్తుంది.
బరువులతో ప్రాక్టీస్
ఇదంతా చదివాక ‘అదేముంది వెనక్కి నడుద్దాం’ అనుకుంటున్నారా. వెనక్కి అడుగులు వేయడం ఈజీనే కావచ్చు. కానీ అందుకు కొన్ని పరిమితులు ఉన్నాయి. ముఖ్యంగా అనుకూలంగా ఉండే స్థలం కావాలి. అడుగులు వేయడమే ఇబ్బందిగా ఉన్నప్పుడు వెనక్కి పరిగెత్తడం ఎలా వీలవుతుంది. బ్యాక్ వాకింగ్ ఇంప్రూవ్ చేసుకునేందుకు మొదట్లో బరువైన వాటిని లాగుతూ నడవాలి. అప్పుడు కూడా ఒక్కసారిగా ఎక్కువ బరువులు కాకుండా నెమ్మదిగా బరువు పెంచాలి. అలాగైతేనే మోకాళ్ల కండరాలు సాగుతాయి.
ఇలా మొదలుపెట్టాలి
వెనక్కి నడవడం అనుకున్నంత ఈజీ కాదు. రెగ్యులర్ ఎక్సర్సైజ్ ప్రోగ్రామ్‌లో బ్యాక్ వాకింగ్ యాడ్ చేసుకోవాలి. వెనక్కి నడిచేటప్పుడు సేఫ్టీని దృష్టిలో పెట్టుకుని, మొదట ఇంట్లో నడక అలవాటు చేసుకోవాలి. ఇంట్లో కుదరకపోతే ఓపెన్ ఏరియాల్లో నడవాలి.
వెనక్కి నడిచేటప్పుడు శరీరం వంగిపోతుందేమో గమనించాలి. భుజాల మీదుగా చూసుకుంటే ఆ విషయం తెలుస్తుంది. తల, ఛాతి నిటారుగా ఉండాలి. వెనక్కి అడుగు వేసేటప్పుడు బొటనవేలు ముందు నేలకి ఆనిన తరువాత పాదం నేలకు ఆనాలి. ప్రతీ స్టెప్ ఇలానే ఉండాలి. బొటనవేలి నుంచి మడమ వరకు పాదం ఎలా పడుతుందనేది జాగ్రత్తగా గమనించాలి.
- వెనక్కి నడవడం బాగా అలవాటైతే వేగం పెంచొచ్చు. ట్రెడ్మిల్ మీద కూడా బ్యాక్ వాకింగ్ చేయొచ్చు.
- బరువులతో ప్రాక్టీస్ చేస్తుంటే కనుక మొదట తక్కువ బరువులతో మొదలుపెట్టాలి.
- ఒకేసారి ఎక్కువ దూరం వెనక్కి నడవడం కంటే కూడా మల్టిపుల్ సెట్స్ చేయాలి. ఈ వాకింగ్ ప్రాక్టీస్ చేసేవాళ్లు 20మీటర్ల కంటే ఎక్కువ దూరం పెట్టుకోవద్దు. నెమ్మదిగా మొదలుపెట్టి అందులో సులువు దొరికాక వెనక్కి స్పీడ్‌గా నడవొచ్చు. పరిగెత్తొచ్చు అంటున్నారు క్లినికల్ ఎక్సర్సైజ్ సైకాలజిస్ట్‌లు.