‘విమోచన పోరాట రోజులు’ అనుభవాలు

అపుడు  నా వయస్సు14 –15 సంవత్సరాలు ఉండొచ్చు.  కరీంనగర్​  హైస్కూలులో 7వ తరగతి విద్యార్థిని.  అదే స్కూల్లో  గౌతమరావు,   సి.నారాయణరెడ్డి,  సి. ఆనందరావు,   సిహెచ్‌‌‌‌. హన్మంతరావు తదితరులు కూడా చదువుతుండేవారు.  నేను, సినారె ఇరువురం క్లాస్‌‌‌‌మేట్స్,  ఒకే  బెంచిపై కూర్చుండేవాళ్లం.   ఆ స్కూల్లోనే కాకుండా  అప్పటి అన్ని గవర్నమెంటు స్కూళ్లల్లో కూడా ఒక ప్రార్థన గేయం చదవడం పరిపాటిగా ఉండేది. దాని పేరు ‘తాబద్‌‌‌‌ ఖాలఖ్‌‌‌‌ ఆలమ్‌‌‌‌’ అంటే 'మన రాజు ఎల్లకాలం కుశలంగా ఉండుగాక!  అంటూ రాజు గుణగణాలను పొగిడేలా ఉండేది.  చదవగా.. చదవగా నాకు ఆ ప్రార్థనా గీతానికి బదులు 'వందేమాతరం’ చదవాలని అనిపించింది.  దానికి కారణం నేను అప్పటికే  ఎన్నో దేశభక్తికి చెందిన పుస్తకాలు,  వివేకానందుని పుస్తకాలు కూడా చదవడమే..

అపుడు కొంతమంది సీనియర్‌‌‌‌ విద్యార్థులు హైదరాబాద్​ నుంచి కరీంనగర్​కు వచ్చి విద్యార్థులను ఉద్దేశించి ఇచ్చే ఎన్నో ఉత్సాహ ఉత్తేజపూరిత ఉపన్యాసాలను వినేవాడిని. రాష్ట్ర విమోచనం గురించి,  ఎందుకు ఇండియన్‌‌‌‌  యూనియన్లో  కలపాలో దాని గురించి మాట్లాడడం,  విద్యార్థులను గుంపులు గుంపులుగా ఏర్పరచి విమోచనం గురించి చర్చించడం జరిగింది.  ఆనాటి ఆ మీటింగులకు హైదరాబాదు నుంచి ఎంతోమంది గొప్ప వక్తలు వచ్చి మాట్లాడేవారు. వాటివలన మాకు చాలా ఉత్సాహం కలిగేది. ఆ స్ఫూర్తితో  ఒకనాడు  ప్రేయర్‌‌‌‌ మీటింగులో  నేను ‘తాబద్‌‌‌‌ ఖాలఖ్‌‌‌‌ ఆలమ్‌‌‌‌’కు బదులు 'వందేమాతరం’ అని గొంతెత్తాను.  అది నన్ను స్కూలు నుంచి బహిష్కరణకు లోను చేసింది.  ఆనాటి హెడ్మాస్టరు నన్ను పిలిచి చివాట్లుపెట్టి నిన్ను వెంటనే స్కూలు నుంచి తీసేస్తున్నానని చెప్పి,  చెప్పినంత పనిచేశారు.  అది నా ‘విమోచన పోరాటం’  రోజుల్లోని మొదటి అనుభవం. అది నన్ను కరీంనగర్​ నుంచి హైదరాబాద్ కు తీసుకువచ్చింది. 

 స్టూడెంట్స్​ యూనియన్​ ఆఫీసులో వసతి

ఆ రోజుల్లో  సుల్తాన్‌‌‌‌ బజార్లో  హైదరాబాద్​ స్టూడెంట్స్​యూనియన్‌‌‌‌ ఆఫీసు ఉండేది. ఆ సంస్థకు చెందిన కొంతమంది సీనియర్‌‌‌‌ విద్యార్థులు నాకు దానిలో వసతి ఏర్పరిచారు. పైపెచ్చు నన్ను ఆఫీసు సెక్రటరీగా నియమిస్తూ ‘కేశవ మెమోరియల్‌‌‌‌’ స్కూల్లో చేర్చించారు.  ఆ స్కూలు అప్పట్లోనే  'దేశభక్తుల స్కూలు’ అని ప్రసిద్ధి చెందింది. అక్కడి దేశభక్తి వాతావరణం నన్ను మరింత ప్రభావితం చేసింది. అలాగే, సుల్తాన్‌‌‌‌ బజార్లోని స్టూడెంట్స్‌‌‌‌ యూనియన్‌‌‌‌ ఆఫీసు వాతావరణం కూడా.  ఆ ఆఫీసుకు అప్పట్లోనే  పెద్ద పెద్ద నాయకులు వస్తుండేవారు.  డా.మర్రి చెన్నారెడ్డి,  హెగ్డే,  డా. జి.ఎస్‌‌‌‌. మెల్కోటే లాంటివారు వచ్చేవారు.  వారంతా బాగా రాజకీయాలు తెలిసినవారే కాక రాజకీయ సాహిత్యం కూడా చదివినవారు. వారి వలన నేను చాలా ప్రభావితుణ్నయ్యాను.  తత్ఫలితంగా నాకు రాజకీయ చైతన్యం మరింత పెరిగింది.  

నాయకులతో పరిచయాలు

విమోచన పోరాటంలో  పాల్గొనాలన్న అభిలాష.  నేనప్పటికే  రెడ్డి హాస్టల్లో ఉంటూ ఎందరో సీనియర్‌‌‌‌ రాజకీయవేత్తలను చూశాను.  వారి ఉపన్యాసాలు విన్నాను.  బాగారెడ్డి,  పి.రామచంద్రారెడ్డి, ఎం.నారాయణరెడ్డి,  సీతారామరెడ్డి,  జి.రామ్‌‌‌‌రెడ్డి మున్నగువారెందరితోనో నాకు పరిచయమే కాక చొరవ కూడా లభించింది.  వారితో కలిసి అప్పుడప్పుడు మాట్లాడేవాడిని.  దానికితోడు రాజకీయ సాహిత్యం కూడా చదువుతుండేవాడిని.  

సత్యాగ్రహంలో పాల్గొన్నందుకు జైలుశిక్ష

ఆ కాలంలోనే 7 ఆగస్టు 1947 రోజున డా.జి.ఎస్‌‌‌‌.మెల్కోటే  సత్యాగ్రహం చేస్తారని నేను విని నా ఉత్సాహాన్ని ఆపుకోలేక అక్కడికి వెంటనేపోయి సత్యాగ్రహం చేసేవారిలో ఒకనిగా ఆ సమూహంలో చేరిపోయాను.  వారందరితోపాటు ఆ రోజు నన్ను కూడా అరెస్టు చేసి మెజిస్ట్రేట్​ ముందు నిలబెట్టారు. చిన్నపిల్లవానిలాంటి  నన్ను చూసి అతడు ఆశ్చర్యపోయి ‘క్యా కర్తే హై’ అని అడిగాడు.  నేను దానికి ‘యహీ కర్తాహు’ అని జవాబిచ్చాను.  దానికి అతడు చకితుడై  ‘బచ్చే హో... మాఫీనామా దేవ్‌‌‌‌... చోడ్‌‌‌‌దేంగే’ అని అన్నాడు.  నేను దానికి ‘నహీ’ అని జవాబిచ్చాను.  దానికి అతడు నా వయసును దృష్టిలో పెట్టుకొని వారం రోజులు జైలు శిక్ష విధించాడు. 

జైలు జీవితం

నా నాల్గోదశ విమోచన పోరాట ప్రస్థానం నేను  'చాందా క్యాంపులో పనిచేస్తుండగా జరిగింది.  ఆ క్యాంపు నుంచి నేను కొన్నిసార్లు ఆదిలాబాద్,  ఆసిఫాబాద్​ ప్రాంతాలలో ఉన్న కొన్ని గ్రామాలకు వెళ్లి కొంత సమాచారం సంపాదించి,  కొందరి నుంచి ‘చందాలు’ కూడా పోగుచేసేవాడిని.  ఒకసారి నేను కొన్ని గ్రామాలకు వెళ్లివస్తున్నప్పుడు  ‘జన్నారం’ అనే బస్సు స్టేజి వద్ద నన్ను ఒక పోలీసు ఆఫీసరు అనుమానించి ఆజమాయిషీ చేసి నన్ను తనతో సహా పోలీసుస్టేషనుకు తీసుకెళ్లాడు. నేను రాజకీయాలలో చురుకుగా పనిచేస్తున్నానని నిర్ధారణ చేసుకున్నాక తనతోపాటు  నన్ను మెజిస్ట్రేట్​ ముందు ఉంచడానికి లక్సెట్టిపేటకు తీసుకెళ్లాడు.  

లక్సెట్టిపేటలో  మెజిస్ట్రేట్​ నన్ను కొన్నాళ్లు డిటెన్షనులో ఉంచమని ఆజ్ఞాపించాడు.  దాని పర్యవసానంగా నా చేతులకు బేడీలు పెట్టి పగ్గాలతో పట్టుకొని మంచిర్యాల,  బెల్లంపల్లి,  ఆసిఫాబాద్​.. పోలీసు స్టేషన్లలో ఉంచుతూ చాలా కష్టాలపాలు చేశారు. తుదకు మెజిస్ట్రేట్​నన్ను ‘ప్రభువు ఆజ్ఞాపించేంతవరకు జైల్లో పెట్టమని’ తీర్పునిచ్చారు. అలా నన్ను ఆసిఫాబాద్​ జైల్లో ఆరుమాసాలు  ఉంచారు.   12, 18 సెప్టెంబర్‌‌‌‌ రోజుల్లో ఎపుడైతే  'పోలీస్‌‌‌‌ యాక్షన్‌‌‌‌’ జరిగిందో అప్పుడు విడిచిపెట్టారు. అపుడు నాకర్థం కాలేదు, ఎందుకు విడిచిపెట్టారో!  ఇప్పుడర్థమౌతోంది. 

విమోచన దినం

సెప్టెంబర్‌‌‌‌ 12, 18 రోజులు హైదరాబాద్​  రాష్ట్రానికి విమోచనం లభించిన రోజులు.  మరి నాకు లభించిన విమోచన రోజులు  అవే... తక్కిన వారందరికీ  అంటే, వాస్తవానికి ఆ రోజులనే ఈ రాష్ట్రవాసులంతా ‘విమోచనదినం’గా  భావించి సంబురాలు జరుపుకోవాలి.  కాకపోతే,  నిజాం రాజు ‘విలీనం’ చేస్తున్నానని ఒక విలీనపత్రంపై  సంతకం పెట్టిన రోజు 17 సెప్టెంబరు అందుకే..  అసలు సిసలైన రోజు అదే!

నా చేతికి స్టెన్‌‌‌‌ గన్‌‌‌‌ ఇచ్చి..

నేను రెండోసారి విమోచన పోరాటంలో పాల్గొంటూ శిక్షకు గురయ్యాను. చంచల్‌‌‌‌గూడ జైల్లో వారం రోజులు ఉంచారు. నా మూడోదశ విమోచన పోరాటంలో నేను విజయవాడ క్యాంపులో ఉంటూ ఆ చుట్టుపక్కల  ప్రదేశాలన్నీ తిరుగుతూ అపుడపుడు  తెలంగాణ ప్రాంతంలో అడుగిడుతూ దళాలలో కూడా పాల్గొంటూ ఒకసారి ఎస్‌‌‌‌.బి.గిరి ఆధ్వర్యంలో ‘ఎర్రుపాలెం’  రైల్వేస్టేషన్​పై  దాడి చేసినవారిలో ఉన్నాను.  ఆయుధమంటే  ఏమిటో నాకు అప్పుడు  తెలిసొచ్చింది.  అప్పుడే ఒకసారి నా చేతికి స్టెన్‌‌‌‌ గన్‌‌‌‌ ఇచ్చి, దానిని తెలంగాణ ప్రాంతం గుండా బల్హార్షాకు చేరవేయాలని ఆదేశించారు. అది ఎంత ప్రమాదమైన కార్యమో, 
దాని వలన నేను చస్తానో,  బతుకుతానో కూడా తెలియక సరేనని ఆ పనిని నిర్భయంగా నిర్వహించి అందరి మన్ననలు అందుకొన్నాను.  

- డా. వెల్చాల కొండలరావు,
పూర్వ సంచాలకులు, తెలుగు అకాడమీ