ప్రచారంలో పొద్దంతా తిరిగిన నాయకులు, కార్యకర్తలు చీకటి పడగానే మందుతో విందు చేసుకుంటారు. బిర్యానీతో కడుపు నింపుకుంటున్నారు. ఈ దావత్‌ల ఖర్చు కూడా పోటీచేస్తున్న అభ్యర్థులదే. కొన్ని ప్రాంతాల్లో అయితే.. ఓటర్లకు కూడా మందు, మటన్ పంచుతున్నారు. ముఖ్యంగా ఎన్నికల ముందు పండుగలు వస్తే చాలా చోట్ల ఇంటికి కిలో మటన్, ఒక మందు బాటిల్ పంచిపెట్టినట్టు వార్తలు వచ్చాయి. కొన్ని చోట్ల డివిజన్లు, వార్డుల వారీగా కుల సంఘాలకు లిక్కర్ పంపిణీ చేస్తున్నారు.
జెండాలు.. కండువాలు
ఎన్నికల ప్రచారంలో భాగంగా.. పెట్టే సభలు, సమావేశాలకు వచ్చే కార్యకర్తలకు జెండాలు, కండువాలు, టీషర్ట్‌లు, టోపీలు, కరపత్రాలు పంచుతుంటారు అభ్యర్థులు. వాటన్నింటికీ లక్షల్లో ఖర్చు చేయాల్సి వస్తుంది. పార్టీల తరఫున పోటీ చేసే నాయకుల నుంచి ఇండిపెండెంట్ అభ్యర్థుల వరకు అందరూ తమ గుర్తును ప్రమోట్ చేసుకునేందుకు ఇలాంటివి ఇస్తుంటారు. ఒక్కో కరపత్రానికి మూడు నుంచి ఐదు రూపాయల వరకు ఖర్చవుతుంది. ఇక టీషర్ట్‌ల విషయానికి వస్తే.. కాస్త క్వాలిటీ టీషర్ట్‌ల కోసం 150 రూపాయల వరకు ఖర్చు చేయాల్సి వస్తోంది.
సభకు ఖర్చు
ఒక చోట సభ పెట్టాలంటే మామూలు విషయం కాదు.. అందుకు పెద్ద ఎత్తున ప్లానింగ్‌తోపాటు భారీగా డబ్బు కూడా ఖర్చవుతుంది. సభకు కావాల్సిన లైటింగ్ నుంచి సౌండ్ సిస్టమ్, ఫ్లవర్ డెకరేషన్, కుర్చీలు, టెంట్లు అన్నీ అద్దెకు తీసుకురావాలి. చిన్న సభ పెట్టినా లక్షల్లోనే ఖర్చు చేయాలి. 30 నుంచి 40 వేల మందితో భారీ సభ పెట్టాలంటే 3 నుంచి 5 కోట్ల రూపాయల వరకు ఖర్చవుతుంది.