ఎగ్జిట్ పోల్స్ ఎందుకు తప్పవుతాయి?

ఓటర్లు  కొత్త వ్యక్తికి  తాము ఎవరికి ఓటు వేశారనేది చెప్పడం ఎగ్జిట్ పోల్స్ లోని కీలకాంశం.  ఈ ఒక్క అంశం అనేక  సంక్లిష్ట కారణాలపై ఆధారపడి ఉంటుంది.  ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు, వాస్తవ ఫలితాల మధ్య వ్యత్యాసాన్ని చూసి  చాలామంది ఆశ్చర్యపోయారు.మొత్తం తొమ్మిది ఎగ్జిట్ పోల్స్  బీజేపీ  నాలుగు వందల సీట్లకు దగ్గరగా ఉంటుందని జోస్యం చెప్పినాయి తప్ప,  ఏ ఒక్క సర్వే కూడా  కాంగ్రెస్ కూటమికి 233 సీట్లు వస్తాయని ఎక్కడా ప్రస్తావించలేదు.

ఎన్నికల ముందు జరిపిన సర్వేలు మాత్రం బీజేపీ  ప్రతిపక్షాల కన్నా  మెరుగ్గా ఉంటుందని, అయితే లోక్​సభలో  మెజారిటీ సాధించబోదని తేల్చి చెప్పాయి.  బీజేపీ పట్ల ప్రజల్లో అసంతృప్తి లేదని కూడా స్పష్టం చేశాయి.  వ్యవసాయ  సంక్షోభం  మూలంగా  రైతులలో,   నిరుద్యోగం వల్ల యువతలో  నిరాశ నెలకొంది.  పారిశ్రామిక ప్రగతి దెబ్బతినడం, పెద్దనోట్ల రద్దు,  జీఎస్టీ మొదలైన కారణాల వల్ల చిన్నతరహా ఉత్పత్తిదారులో  అసంతృప్తి  నెలకొన్నదనే  వార్తలు వచ్చినా అవేవి లేవని ఎన్నికల ముందు ఒపీనియన్ పోల్స్ స్పష్టం చేశాయి. ఎగ్జిట్ పోల్స్  మంద మనస్తత్వాన్ని ప్రదర్శించాయని రాజకీయ శాస్త్రవేత్త బల్వీర్ అరోరా అన్నారు, వారు బీజేపీని తక్కువ చేసి చూపించాలని అనుకోలేదు.  ఈ ప్రక్రియలో  కాస్తో,  కూస్తో  ఉన్న విశ్వసనీయతను కోల్పోయి, సర్వే సంస్థలు బోల్తాపడ్డాయి.

మోదీ జైత్రయాత్రకు బ్రేక్​

భారీ ప్రజా సమూహంలో భాగంగా ఓటరు  ధైర్యంగా ఉంటాడు.  2014 ఎన్నికలకు ముందు  ఇటువంటి  నిర్భయమైన పరిస్థితులు ఉండేవి.  ఉద్యోగాలు, ఆర్థికాభివృద్ధిని  వేగవంతం చేస్తా మంటే  మోదీకి ఓటు వేశామని గతంలో నిరుద్యోగులు, ప్రజలు చెప్పగలిగారు.  నమ్మి 303 సీట్లు ఇచ్చిన తర్వాత కానీ అసలు రూపం తెలియలేదు.  17వ  లోక్​సభలో తీసుకున్న నిర్ణయాల్లో  ప్రతిపక్షాలను మోదీ విశ్వాసంలోకి తీసుకోలేదనేది ప్రజలు గమనించారు. దీంతో మోదీ  జైత్ర యాత్రకు  బ్రేక్ వేశారు.  నరేంద్ర మోదీ పార్లమెంట్​లో  ప్రతిపక్షాలను  గౌరవించే విధంగా తీర్పునిచ్చారు.  పుల్వామా ఘటనపై అఖిలపక్ష సమావేశంలో కూడా పాల్గొనని మోదీ,  370 ఆర్టికల్ రద్దు,  పౌరసత్వ సవరణ చట్టం,  ట్రిపుల్ తలాక్, ఈడబ్ల్యూఎస్ కోటా ఆమోదంలో విపక్షాల గొంతు నొక్కారు.  ఎగ్జిట్ పోల్ సర్వేలో ఆన్​లైన్ సర్వే, పేపర్ సర్వే,  టెలిఫోనిక్ సర్వే, ముఖాముఖి సర్వే  ప్రధాన పాత్ర పోషించినా మోదీకి ఓటేశామని చెప్పారు తప్ప,  ప్రజలు తమ అంతరంగాన్ని బయట పెట్టలేదు. ప్రజలు ధైర్యంగా చెప్పలేని పరిస్థితి దాపురించడం బీజేపీ అప్రజాస్వామిక పాలనకు నిలువెత్తు నిదర్శనం.  ఎగ్జిట్ పోల్స్  తప్పు అని రుజువు కావడం ఇది మొదటిసారి కాదు. ఇది చివరిది కూడా కాదు.  గోబెల్స్ ప్రచారాలు  ఎల్లకాలం  సత్యాన్ని దాచలేవన్న విషయం ఈ ఫలితాలు రుజువు చేశాయి.  

బీజేపీ మెజారిటీకి పెద్ద రాష్ట్రాలు చెక్​

సామాజిక శాస్త్రవేత్త బద్రీ నారాయణ్ అనేక రాష్ట్రాల్లో ఎగ్జిట్ పోల్స్ బాగా ఉన్నాయని,  అయితే  మూడు పెద్ద రాష్ట్రాల్లో  చాలా అసంబద్ధంగా ఉన్నాయని అంగీకరించారు. ఆయా సంస్థలు బహుశా లోపభూయిష్ట పద్ధతి దీనికి కారణమని చెప్పాడు. పోల్ స్టర్​లు కనిపించే ప్రజల మాటలను విన్నారని,  నిశ్శబ్ద  ఓటరుతో మాట్లాడలేదని తెలుస్తోంది.   ఒక ఎన్యుమరేటర్  హావభావాలు,  కళ్లు, భుజాలు, చూపులను క్యాప్చర్ చేసి  బాక్సులను  టిక్ చేయడానికి మార్గం దొరకలేదని సామాజిక శాస్త్రవేత్త దీపాంకర్ గుప్తా  చెప్పారు. ఎన్డీయే  కలలుకన్న 'అబ్ కి బార్.. చార్ సౌ పార్'కు   గండికొట్టిన రాష్ట్రాలైన ఉత్తరప్రదేశ్,  పశ్చిమబెంగాల్,  మహారాష్ట్ర,  రాజస్థాన్,  కర్నాటక  ఫలితాలను ఈ తొమ్మిది సర్వే సంస్థలు పసిగట్టలేకపోయినాయి  ఆంధ్రప్రదేశ్​లో  ప్రజల అభిప్రాయం అసాధారణమైనదని ఫలితాలను బట్టి తెల్లముఖాలు వేసుకునే పరిస్థితి సెఫాలజిస్ట్​లకు వచ్చింది.

డాక్టర్ సంగని మల్లేశ్వర్, విభాగాధిపతి, జర్నలిజం శాఖ,
కాకతీయ విశ్వవిద్యాలయం