హైడ్రా.. హైడ్రా.. హైడ్రా.. అసలు దీని పనేంటి?

‘హైడ్రా.. హైడ్రా.. హైడ్రా’  రాష్ట్రంలో ఇప్పుడు హైడ్రానే హై ఓల్టేజ్ సబ్జెక్ట్. అసలు దీని పనేంటి? కబ్జాదారుల  కోరల్లోంచి  చెరువుల్ని రక్షించగలదా?  పర్యావరణాన్ని కాపాడగలదా?  ప్రకృతి ప్రకోపాన్ని నిలువరించగలదా?  హైడ్రావల్ల  ఆక్రమణదారుల గుండెల్లో ఎందుకు రైళ్లు పరుగెడుతున్నాయి?  హైదరాబాద్  ని ఆరోగ్యకరంగా మార్చే లక్ష్యాన్ని  ప్రభుత్వం చేరుకుంటుందా?  ఇలా ఎన్నో  ప్రశ్నల మధ్య జులై  నుంచి హైడ్రా తన పనిని ప్రారంభించింది. ఈ మూడు నెలలుగా  ప్రతిరోజూ వార్తల్లో నిలుస్తూనే ఉంది.  హైడ్రాను వ్యతిరేకించేవారు, మద్దతిచ్చేవారు ఎవరి వాదనను వారు వినిపిస్తూనే ఉన్నారు. ఈ సందర్భంగా జరుగుతున్న చర్చలు రకరకాలుగా కొనసాగుతున్నాయి.

ఒకనాడు 600 గొలుసుకట్టు  చెరువులతో  ‘బాగ్​ల నగరం’గా వెలుగొందిన మన భాగ్యనగరం నేడు సగానికి పైగా ఆక్రమణలతో  కనీసం 200 చెరువులు సైతం మిగలని దుస్థితిలో ఉంది. ఇదిలాగే కొనసాగితే అంతరించిపోయిన మహా నాగరికతల మాదిరే మన హైదరాబాద్  సైతం గడ్డు పరిస్థితిని ఎదుర్కోక తప్పదు.  ఇలా జరగకుండా ఉండాలనే ప్రభుత్వలక్ష్యం హైడ్రా ఏర్పాటు వెనకాల ఉంది అనేది స్థూలంగా మనకు అర్థమౌతున్న సత్యం.  అయితే,  ఈ చెరువులకు  ప్రాణాధారమైన మూసీ నది పేరు చెపితేనే  సగటు హైదరాబాదీ  ముఖంలో కనబడే  భావాలతోనే  ఆ మూసీకి పట్టిన దుర్గతి ఏంటో అర్థమౌతుంది.  రోజుకు  దాదాపు 1500 మిలియన్ లీటర్ల మురుగు,  దాదాపు 100 మిలియన్ లీటర్ల  పరిశ్రమల నుంచి వెలువడే  హానికారక రసాయనాల ద్వారా కలుషితం అవుతూనే ఉంది. 

మూసీ పరీవాహక ప్రజల్లో అనారోగ్యం
ఆరోగ్యమే  మహాభాగ్యం.  ఇది అత్యంత ప్రధానమైన సూత్రం.  అయితే, ఇప్పటికే  కుంచించుకుపోయి తీవ్రస్థాయిలో  కలుషితమైన  మూసీ పరీవాహక ప్రాంతాల్లో జీవిస్తున్న ప్రజలు ఆరోగ్యకరమైన జీవనాన్ని గడుపుతున్నారా?  దాదాపు అర్ధశతాబ్దంగా రెండు తరాలు తమ జీవన గమనంలో ఎన్ని రకాల ఆరోగ్య ఇబ్బందులను ఎదుర్కొన్నారు.  మూసీ పరీవాహకాలపై  చేసిన అన్ని సర్వేలు చెప్తున్న సమాధానం ఒక్కటే... మిగతా ప్రాంతాలతో పోల్చితే 50శాతం అనారోగ్యాలతో  వీరు జీవనాన్ని వెళ్లదీస్తున్నారు అని.  వరదల వల్ల ప్రతి ఏటా ఎంతో  కొంత పోగొట్టుకొని కట్టుబట్టలతోనే మిగులుతున్నారు.  ఇలా ప్రతి ఏటా పెద్ద ఎత్తున నష్టపోతూనే ఉన్నారు, ఇది తాత్కాలిక సమస్య ఐతే... శాశ్వతంగా అనారోగ్యాలకు తమ శరీరాలను అప్పగించి  పెద్ద మోరీగా మారిన మూసీ పరీవాహకంలోని మురికి కూపాలతో  కూడిన ఈ ప్రాంతాల్లో ప్రజలు నిత్యం ఏదో రకమైన రుగ్మతతో  ఇబ్బందులు పడుతూనే ఉన్నారు.  గత  ప్రభుత్వాలు చేసిన ఆరోగ్య సర్వేల్లోనూ మూసీ పరీవాహకంలోని ప్రజలకు ప్రాణాంతకమైన ఆస్తమా, క్యాన్సర్​,  స్కిన్ అలర్జీలు,  కంటి వ్యాధులు, చర్మ వ్యాధులు,  జాండీస్ వంటివి చాలా ఎక్కువ సంఖ్యలో ఉన్నాయనే చేదు నిజాన్ని చెబుతూనే ఉన్నాయి.   ఈ పాపంలో భాగమెవరిది?  దీన్ని అరికట్టే బాధ్యత ఎవరిది?

బాధితులకు అండగా నిలవాలి
సమాజ శ్రేయస్సును కాంక్షించే వ్యక్తులుగా మనందరం ఆలోచించాల్సిన అతి ముఖ్యమైన సమస్య ఇదే కదా? మూసీ పరీవాహకంలో నివసిస్తున్నవారిలో నూటికి తొంబై శాతం తెలంగాణ ప్రాంతానికి చెందినవారే, వీరిలో బీద మద్యతరగతి వర్గం వారే ఎక్కువ. రెక్కలు ముక్కలు చేసుకుని సంపాదించిన దాంతోనే  తెలిసో,  తెలియకో, రివర్ బెడ్లోనో,  మూసీ నది ఎఫ్టీఎల్ పరిధిలోనో, బఫర్ జోన్లోనో  ఆవాసం ఏర్పరుచుకొని బతుకుతున్నవారే. ఇప్పుడు హైడ్రా చేపట్టిన చర్యలతో వీరు ఇబ్బందులను ఎదుర్కోవచ్చు, ఆ సమయంలో వీరి ఆక్రందనను కొంత తీవ్ర రూపంలోనే  వెల్లడి చేయొచ్చు.  అయితే, ఇందుకోసం సోదర సమాజంగా మనమంతా వారికి అండగా ఉండాలి.  కానీ, అది ఏ రూపంలో నిలవాలన్నది తేల్చుకోవాల్సిన సమయం కూడా ఇదే.  వారికి ఖచ్చితంగా ప్రత్యామ్నాయం చూపించాలని ప్రభుత్వాన్ని మనందరం అడగాల్సిందే. అంతేకాని ఇదే అదనుగా వారి ఆక్రందనలను సైతం రాజకీయంగా వాడుకోవాలని చూసే వారి పట్ల జాగరూకతతో ఉండాలి.  ప్రభుత్వం హామీనిచ్చినవిధంగా వారికి డబుల్ బెడ్రూంలు, మంచి విద్యావకాశాలు ఇవ్వాల్సిందే అని మనం నినదించాలి.  అంతేగాని వారిని రెచ్చగొట్టి, మంటలు పుట్టించి అందులో చలికాచుకోవాలనే దుష్ట పన్నాగాలను మాత్రం ఖచ్చితంగా ఎండగట్టాలి. 

Also Read :- గాంధీ జ‌‌‌‌యంతి స్పెషల్

అప్పట్లో కేసీఆరే ఆ నిర్మాణాలను తొలగించాలన్నాడు. దాదాపు 30 లక్షలకు పైగా ఆవాసాలతో  కోటికిపైగా ప్రజలు నివాసం ఉంటున్న మహానగరం మనది, ఇందులో మూసీ నదీగర్భంతో పాటు పరీవాహకంలో 12వేల నిర్మాణాలున్నాయని నాటి బీఆర్ఎస్​ ప్రభుత్వమే తేల్చింది.  మాజీ సీఎం కేసీఆర్​ సైతం నాడు ఈ నిర్మాణాల వల్ల హైదరాబాద్ సమగ్రతకే ప్రమాదం ఉన్నదని, వాటిని తీసేయడమే పరిష్కారమని ఒప్పుకున్నాడు. అంతేకాదు 1908లో  చరిత్రలో కనీవినీ ఎరగని వరదలు హైదరాబాద్​ను  ముంచేస్తే  ఎన్నో  కట్టడాలు కూలిపోవడంతోపాటు ఎంతోమంది చనిపోయారు.  వీటిని అరికట్టడానికి ఏర్పడ్డవే  జంట జలాశయాలు. అయినా1970లో ఉస్మాన్ సాగర్ గేట్లెత్తయడంతో వరద ముంచెత్తి ఎంతోమంది హైదరాబాదీలను  కోల్పోయాం.  ఇక నేటి గ్లోబల్ వార్మింగ్ పరిస్థితుల్లో ఎన్నో శత్రు దుర్భేద్యమైన  దేశాలు సైతం ప్రకృతి  విపత్తులకులోనై  అపార ఆస్తి,  ప్రాణ నష్టాల్ని ఎదుర్కొంటున్నాయి. యుద్ధాల కన్నా ఎక్కువ మంది విపత్తులతో  మరణిస్తున్నారు. 

శాశ్వత పరిష్కారం చూపే మార్గాలు కావాలి
ఇప్పటికే హైదరాబాద్ వాతావరణ పరిస్థితుల్లో ఆశించకూడని మార్పులు సంభవించి  అకాల వరదలు, విపరీతమైన ఎండలు,  భరించలేని చలి పరిస్థితులను మనమే చూస్తున్నాం.  ఇదిలాగే కొనసాగితే  నేడు పునారావాసం పొందుతున్న 15వేల మంది కాదు  కోటిన్నర మంది బతుకులు ప్రశ్నార్థకంలో  పడతాయి. అందుకే ఎప్పటికప్పుడు ఏవో కంటి తుడుపు చర్యలు తీసుకుంటూ సంతుష్టీకరణ రాజకీయాలు కాకుండా వీరి అనారోగ్యాన్ని పారదోలే శాశ్వత పరిష్కారం చూపే  సర్వశ్రేష్ట మార్గాలు కావాలి.   కాంగ్రెస్​ ప్రభుత్వం చేస్తున్న చర్యలు ఆ దిశగానే ఉన్నాయనేది మనకు కనిపిస్తూనే ఉన్నాయి.  ఇప్పుడు తీసుకుంటున్న ఈ చర్యలు భవిష్యత్తు తరాలకు భరోసా కల్పించేవిధంగా ఉండాలనేదే  ప్రతి ఒక్కరూ ఆశించేది.  అదే సమయంలో  మన సోదరులైన మూసీ పరీవాహక ప్రజల పట్ల సానుభూతిని చూపించాలి, వారికి ప్రభుత్వం ఇస్తానన్న డబుల్ బెడ్రూంలు, విద్యాలయాల్లో  ప్రవేశాలు, ఇతరత్రా ప్రయోజనాలు సత్వరమే అందేవిధంగా కృషి చేయాలి.

మురికి కూపంలోనే మగ్గిపోవాలా?
మూసీ పరీవాహకంలోని నూటికి తొంబై  శాతం మురికివాడల్లో ప్రజల ఆరోగ్య  జీవనం కుంటుపడిందనేది వాస్తవం.  ఇన్నేండ్లుగా ఇదే మహానగరంలో మనతోపాటు ఉంటూ మనం అందుకుంటున్న సౌకర్యాలకు ఆమడ దూరంలో నిలిచిపోయారనేది కూడా వాస్తవం.  ఈ గమనంలో ఇప్పటికే  గత తరాలు ఎంతో  పోగొట్టుకున్నారు.  ఇక వారి భవిష్యత్తు తరం సైతం అదే మురికి కూపంలోనే మగ్గిపోవాలా?  అనారోగ్యంతో  ఒళ్లు గుల్ల చేసుకోవాలా? సామాజిక, సాంస్కృతిక వికాసానికి దూరంగానే ఉండాలా?  ఏమాత్రం మానవత్వం ఉన్న వ్యక్తైనా ఖచ్చితంగా కాదనే అంటారు.  లాభమో, నష్టమో... వారికి ఈ రూపంలోనైనా  మూసీ మురికికి దూరం జరిగే అవకాశం దక్కింది.  ప్రభుత్వం ప్రత్యామ్నాయం కల్పిస్తోంది.  దీన్ని వాడుకుని వారి భవిష్యత్తరాలనైనా ఆరోగ్యకరమైన సమాజంలో  జీవించే అవకాశాల గురించి వారికి మనందరం వివరించాలి.  ఒక నూతన వికాసంలో వారి కలలకు ప్రతిరూపాలైన రేపటి తరం ఎట్లా అభివృద్ధి చెందవచ్చో వారికి చెప్పాలి.  మహానగరంలో ప్రభుత్వం అందించే  పక్కా  గృహాల్లోకి  వెళ్లితే అక్కడి పరిస్థితులు,  అవకాశాలు,  విద్య,  వైద్యం, ఉపాధిపరంగా  దొరికే  మెరుగైన జీవనం గురించి తెలియజేయాలి. ఇది వారి బాగుకోసం మనం చేయాల్సిన మొదటి పని.  కానీ,  బాధ్యతాయుతమైన ప్రతిపక్షం మొదలు ద్వేషంతో ఆలోచనలు నిండినవాళ్లు అగ్నికి ఆజ్యం పోసే ప్రయత్నం చేస్తున్నారు. దీనికి మీడియా వంత పాడకపోవడంలోనే  వారి ఔచిత్యం సైతం  బయటపడుతోంది.

బోదనపల్లి వేణుగోపాల్ రెడ్డి, సీఈవో, టీశాట్ నెట్​వర్క్