బంగ్లాదేశ్ గతం, వర్తమానం

స్వాతంత్ర్యం రాకముందు నుంచి తూర్పు బెంగాల్ భారతదేశంతో సాంస్కృతికంగా, రాజకీయంగా ఎంతో సంబంధం కలిగి ఉంది. ఎందరో స్వాతంత్ర్య  సమరయోధులు బంగ్లాదేశ్ ప్రాంతంలో జన్మించారు. నాగమహాశయ వంటి ఆధ్యాత్మికవేత్త  అక్కడే జన్మించారు. నిజానికి బంగ్లాదేశ్ ఉర్దూ భాషను విభేదించి ఓ కొత్త దేశంగా పాకిస్తాన్ నుంచి విడిపోవడంలో భారతదేశం పాత్ర చాలా ఉంది. 

ఈ ఆపరేషన్​లో నాటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ వ్యవహరించిన తీరు ఆమెని ఈ దేశంలో చాలామంది గౌరవించేటట్టు చేసింది. బంగ్లాదేశ్​లో ప్రధాని షేక్ హసీనా పడకగదిలోకి కూడా వెళ్లి ఆందోళనకారులు బీభత్సం సృష్టించారు. హసీనా తండ్రి షేక్​ ముజిబుర్​ రెహమాన్​ విగ్రహాలను తాళ్లతో ఉరేసి, సుత్తిలతో కొట్టి వికృతానందం పొందారు. అలాగే అవామీలీగ్​ నేతల ఇండ్లపై, అక్కడి హిందువుల ఇండ్లపై దాడిచేసి వాళ్ళ మానప్రాణాలు హరించారు.

బంగ్లాదేశ్ ఏర్పడకముందు పాకిస్తాన్ సైన్యం చేసిన అరాచకాలు ప్రపంచంలోని అతిపెద్ద వరుసలో జరిగిన నరమేధంగా చెప్తారు. సరిగ్గా అలాంటి అకృత్యాలే ఇప్పుడు బంగ్లాదేశ్ వీధుల్లో దర్శనమిస్తున్నాయి. ప్రపంచంలోనే శక్తిమంతమైన మానవ హక్కుల సంస్థలు కనీసం నోరు కూడా మెదపడం లేదు. మన దేశ మీడియా కూడా ఇదొక సంక్షోభంగా,  తిరుగుబాటుగా చూపిస్తుంది తప్ప వాళ్ల  అకృత్యాలకు అరాచకాలకు బలి అవుతున్న వ్యక్తులపై ఫోకస్​ చేయడంలేదు. 

హసీనా కూడా పురుషుడై ఉంటే ఉరితీసే వాళ్లేమో! బంగ్లాలో తిరుగుబాటు వెనకాల  చైనా ఉందని కొందరు, పాకిస్తాన్ ఉందని మరికొందరు, అమెరికా ఉందని ఇంకొందరు రకరకాల విశ్లేషణలు చేస్తున్నారు. మతోన్మాదంతో విర్రవీగుతున్న పాకిస్తాన్ శక్తులు ఇందులోకి చొరబడి ఉంటాయని చాలా మంది విశ్లేషకుల భావన. బంగ్లాదేశ్ చైనాతో చేసిన అప్పులు తడిసి మోపిడైపోయాయి. షేక్ హసీనా ముందు నుంచి భారత్ ఫ్రెండ్లీ నేచర్​తో  ప్రభుత్వం నడుపుతున్నది. ఇది అక్కడి మతవాద శక్తులకు ఇష్టం లేదు. 

జిన్నా బతికుండగానే రాజకీయ స్పర్ధలు

నిన్న మొన్న జరిగిన పరిణామాలతో  బంగ్లా ప్రధాని షేక్ హసీనా రాజీనామాచేసి లండన్ వెళ్లాలనుకుంటే అక్కడ లేబర్ పార్టీ ఆమెకు అనుమతి ఇవ్వకపోవడం, వెంటనే జైల్లో ఉన్న మాజీ ప్రధాని ఖలీదా జియా విడుదల కావడం, ప్రభుత్వం రద్దు కావడం అనేక అనుమానాలకు తావిస్తోంది. మరోవైపు మయన్మార్  బంగ్లాదేశ్ సరిహద్దులో అమెరికా తమ రక్షణదళాల స్థావరం కోసం  బంగ్లాదేశ్​ను  కోరితే నిరాకరించడమే ఈ విధ్వంసానికి కారణమని షేక్ హసీనా చెప్పడం అనేక అనుమానాలకు తావిస్తోంది. జిన్నా అనేక కుట్రలు చేసి పాకిస్తాన్ ఏర్పరిచాడు. దేశ విభజన వల్ల వేల మంది మరణించగా ఎందరో నిరాశ్రయులయ్యారు.1946 ఆగస్టు 16వ తేదీన జరిగిన ప్రత్యక్ష చర్య వల్ల కలకత్తాలో  పదివేల మంది హిందువులు మరణించారు.  దీన్ని గ్రేట్ కలకత్తా కిల్లింగ్స్ అని పిలుస్తారు. 

ఏ సిద్ధాంతం లేకుండా ఏర్పడ్డ పాకిస్తాన్​లో  జిన్నా బతికుండగానే రాజకీయంగా అనేక స్పర్ధలు ఏర్పడ్డాయి. దేశ విభజన తర్వాత జిన్నా బతికింది కేవలం 12 నెలలే. 1948 మార్చి 21న  ప్రస్తుతం బంగ్లాదేశ్​గా పిలవబడే నాటి తూర్పు పాకిస్తాన్ ఢాకాలో మూడు లక్షల మందితో సభ జరిగింది. 
ఆ సభలో జిన్నా మాట్లాడుతూ ఉర్దూకు సమానంగా ఏ భాష రాదని అది జాతీయ భాషగా ప్రకటించగానే గొడవ మొదలైంది. అక్కడి ప్రజలు జిన్నాను వ్యతిరేకిస్తూ తిరగబడ్డారు.1952లోనే తూర్పు పాకిస్తాన్​లో జరిగిన ఉర్దూ వ్యతిరేక ఉద్యమంలో విద్యార్థులు మరణించారు. 

పాక్ సైన్యం అరాచకం

1970 నాటి ఎన్నికల్లో బంగబంధుగా పేరొందిన షేక్​ ముజిబుర్​ రెహమాన్ నేతృత్వంలోని  పార్టీ ఎక్కువ సీట్లు గెలిచింది. 25 మార్చి 1971 నాడు ముజిబుర్​ రెహమాన్​ను అరెస్టు చేశారు. రెహమాన్ గెలవడం పాకిస్తాన్  సైన్యానికి  ఇష్టం లేదు.  ఆ తర్వాత పాకిస్తాన్ సైన్యం తూర్పుబెంగాల్ ప్రజలపై భయంకరమైన అరాచకం చేసింది. 1971 మార్చిలో ప్రారంభమైన ఈ విధ్వంసం  ప్రపంచ చరిత్రలో ఒక మాయని మచ్చ.  హత్యలు, అత్యాచారాలు, గృహ దహనాలు, దోపిడీలు, ఎన్నో ఆధ్యాత్మిక వారసత్వపు కట్టడాల విధ్వంసం జరిగింది. బంగ్లాదేశ్ ప్రభుత్వ లెక్కల ప్రకారం లక్షలాది  మంది  ప్రాణాలు కోల్పోయారు. ఈ హత్యాకాండను పాకిస్తాన్ కొనసాగించింది. బంగ్లాదేశ్ ప్రజలు ముక్తివాహిని పేరుతో ఓ సంస్థ ఏర్పరచుకొని పాకిస్తాన్ సైన్యంపై పోరాటం చేశారు. చివరకు భారత సైన్యం కూడా వాళ్లకు మద్దతుగా నిలిచింది.1971 డిసెంబర్ 16న పాకిస్తాన్ సైన్యం లొంగిపోయింది. బంగ్లా ప్రాంతం కొత్త దేశంగా ఏర్పడింది.  

భారత్ చుట్టూ అలజడులే

పాకిస్తాన్ తినే తిండి మొదలుకొని నిత్యావసర వస్తువులకు చైనాపై ఎక్కువగా ఆధారపడుతోంది.  లక్షల కోట్ల పెట్టుబడుల పేరుతో ఆర్థికంగా అమెరికా, చైనాలు  పాకిస్తాన్​ను ఒక ఆట ఆడిస్తున్నాయి. ఇమ్రాన్ ఖాన్ ఇప్పటికే కేసుల్లో ఉన్నాడు. నవాజ్ షరీఫ్ పరిస్థితి రాజకీయంగా అంత బాగాలేదు.  పరోక్షంగా సైన్యమే ప్రభుత్వాన్ని నడిపిస్తోంది.  మరోవైపు శ్రీలంక ఘోరమైన ఆర్థిక, రాజకీయ సంక్షోభంలో కొట్టుమిట్టాడుతోంది. మయన్మార్ లో రోహింగ్యాల సమస్య ఎక్కువైపోయి ఆ దేశం బిక్కుబిక్కుమంటుంది. నేపాల్​లో మావోయిస్టులు, పాతకాలపు రాజులకు మధ్య వివాదం నడుస్తూనే ఉంది. మరోవైపు  దక్షిణాసియాలో  ఇరాన్,  ఇజ్రాయెల్ మధ్య యుద్ధమేఘాలు కమ్ముకుంటున్నాయి.  ఉక్రెయిన్, రష్యా మధ్య యుద్ధం కొనసాగుతోంది. తాజాగా బంగ్లాదేశ్ విపత్కర పరిస్థితిలో చిక్కుకుంది. 

బంగ్లా పరిణామాలు ఆందోళన కలిగించేవే

బంగ్లాదేశ్  విపక్ష నేతగా బీఎన్​పీ అగ్రనేత ఖలీదా జియా గృహం నిర్బంధం నుంచి బయటకు రావడం,   ఆమె ముందు నుంచి భారత వ్యతిరేకి కావడంవల్ల జరగబోయే పరిణామాలు ఊహించవచ్చు.  భారతదేశానికి అనుకూలంగా ఉంటున్న షేక్ హసీనాను గద్దె దింపి బేగం ఖలీదా జియాను గద్దెనెక్కించేందుకు పాకిస్తాన్  చైనాతో చేతులు కలిపి లండన్​లో ఖలీదా జియా కుమారుడైన తారీఖ్ రెహమాన్​తో చర్చలు జరిగినట్టుగా తెలుస్తోంది. 

భారత్​లో బలమైన ప్రభుత్వం ఉండటం వల్ల ఉగ్రవాద చర్యలు బంగ్లాదేశ్ నుంచి జరపాలని ఐఎస్ఐ కుట్రపన్నినట్టు విశ్లేషకులు చెబుతున్నారు. బంగ్లా అధికార పార్టీ నాయకుని హోటల్ తగలబెట్టడం వల్ల 24 మంది సజీవ దహనం కావడం ఘోరం. ఈ పరిణామాలను నిశితంగా పరిశీలిస్తున్న భారత్ అఖిలపక్ష సమావేశం జరపడమేగాక, అక్కడ చిక్కుకున్న పంతొమ్మిది వేల మందిని వెనక్కి రప్పించే ప్రయత్నం చేస్తోంది. బంగ్లాదేశ్​లో జరుగుతున్న రాజకీయ విపరిణామాలు భారత్​కు  కచ్చితంగా ఆందోళన కలిగించేవే. 

బంగ్లాలో మైనారిటీల రక్షణ ఎలా?

అమానవీయంగా హిందువులపై జరుగుతున్న దాడులకు వ్యతిరేకంగా ప్రపంచవ్యాప్తంగా హిందువుల నిరసనలు వ్యక్తమవుతున్నాయి.  వరుసగా మూడు, నాలుగు రోజులు భయంకరమైన అత్యాచారాన్ని అనుభవించిన బంగ్లాదేశ్ హిందువులు ఒకేసారి ఢాకా ... చట్టాగ్రం నగరాలలో నిరసనకు దిగడం ప్రపంచవ్యాప్త చర్చగా మారింది.  కొత్త ప్రభుత్వానికి శుభాకాంక్షలు తెలుపుతూనే ప్రధాని నరేంద్ర మోదీ సుతిమెత్తగా హెచ్చరించారు. 

ఆ దేశ తాత్కాలిక పాలకుడిగా  ప్రమాణం స్వీకారం చేసిన యూనస్ శాంతియుతంగా ఉండాలని ప్రజలను కోరారు. అక్కడి హిందూ మైనార్టీలను వేధిస్తున్నవారిపై చర్యలకు ప్రత్యేక ట్రిబ్యునల్స్​ ఏర్పాటు చేయాలని, 10% మైనార్టీ హిందువులకు, బౌద్ధులకు మిగతా మతాలవారికి సీట్లు కేటాయించాలని కోరుతూ ఢాకా నగరం మూడు గంటల పాటు  స్తంభించే విధంగా ఆందోళన జరిగింది.  బంగ్లాపై  అమెరికా,  చైనా తమ చట్రాలు బిగిస్తున్నయా అనే అనుమానం మాత్రం కలుగుతున్నది. ‘ఒక దళారి పశ్చాతాపం’ లో  చెప్పినట్టుగా కొందరు  హిట్ మాన్లు దేశ దేశాలను ధ్వంసం చేస్తూ వస్తున్నారు. గతంలో జార్జ్ సారోస్ కన్ను మన దేశంపై కూడా పడింది.

డా. పి. భాస్కర యోగి,సోషల్, పొలిటికల్ ​ఎనలిస్ట్​