చింతలపాలెం మండలంలో ఎక్సైజ్ అధికారుల దాడులు

  • 450 కేజీల బెల్లం, 350 కేజీల పటిక, 36 లీటర్ల నాటుసారా స్వాధీనం  

హుజూర్ నగర్, వెలుగు : హుజూర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఎక్సైజ్ అధికారులు రెండు రోజులుగా ముమ్మరంగా దాడులు నిర్వహించారు. మంగళవారం ఎక్సైజ్ సీఐ జిన్నా నాగార్జునరెడ్డి విలేకరుల మావేశంలో వివరాలు వెల్లడించారు. చింతలపాలెం మండలం ఎర్రకుంట తండాకు చెందిన పద్య నరసింహ, నందిగామ వ్యాపారి రామకృష్ణ వద్ద 450 కేజీల బెల్లం కొనుగోలు చేసి నాగరాజు అతడి భార్య సుజాత ద్వారా ఆటోలో తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. 

అదే మండలంలో గుర్తుతెలియని వ్యక్తి బైక్​పై ఆరు లీటర్ల నాటు సారా, కొత్త తండాకు చెందిన మాలోతు శీను వద్ద నుంచి ఏడు లీటర్ల సారాను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అదే తండాకు చెందిన భూక్య పీకా, భూక్య చంటి, భూక్య తేజ, భూక్య వినోద్, భానోత్ లచ్చి రామ్ 3 బైకులపై 350 కిలోల పటికను తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. 

మఠంపల్లి మండలం కొత్త తండాకు చెందిన బానోతు రవీందర్ బైక్ పై 8 లీటర్ల నాటు సారాను తరలిస్తుండగా స్వాధీనం చేసుకున్నారు. బెల్లం, పటిక, నాటు సారాను తరలిస్తున్న వారిని పోలీసులు అదుపులో తీసుకొని కేసులు నమోదు చేశారు. వారి వద్ద నుంచి ఒక ఆటో, ఆరు ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు సీఐ తెలిపారు. ఈ దాడుల్లో ఎస్ఐ జగన్మోహన్ రెడ్డి, దివ్య, వెన్నెల  పాల్గొన్నారు.