కరవు తీరా వాన .. అలుగు పోస్తున్న చెరువులు, కుంటలు, చెక్​డ్యామ్​లు

  • ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఎక్సెస్​ వర్షపాతం నమోదు
  • స్కీముల నుంచి నీటిని ఎత్తిపోయకుండానే ఫుల్​ కెపాసిటీలోకి నీటి వనరులు
  • రెండేళ్ల పాటు సాగునీటిని తప్పనున్న ఇబ్బందులు

మహబూబ్​నగర్, వెలుగు: ఉమ్మడి పాలమూరు జిల్లాలో  కరువు తీర వాన కురిసింది. రెండేళ్లుగా వానలు లేక ఎండిన చెరువులు..  శుక్రవారం రాత్రి నుంచి కురిసిన భారీ వర్షాలకు అలుగు పోస్తున్నాయి.  వీటి కింద ఉన్న కుంటలు నిండుకుండలా మారాయి.  చెక్​ డ్యామ్‌లు కళకళలాడుతున్నాయి.  అన్ని నీటి వనరులు ఫుల్​ కెపాసిటీకి చేరుకోవడంతో  రానున్న రెండేళ్ల వరకు సాగునీటికి భరోసా ఏర్పడింది.

డెడ్​ స్టోరేజీ నుంచి ఫుల్ కెపాసిటీకి 

ఉమ్మడి జిల్లాలో 5,161 చెరువులు, 1,257 కుంటలు ఉన్నాయి.  రెండేళ్లుగా ఇవి నిండ లేదు. 2023లో వర్షాలు పూర్తిగా ముఖం చాటేశాయి. గత సెప్టెంబరు, అక్టోబరులో వర్షాలు కురిసినా చెరువుల్లోకి నీరు చేరలేదు. కుంటలూ నిండలేదు.  జూరాల, శ్రీశైలం ప్రాజెక్టులకు ఆశించిన మేర వరద రాలేదు.  దీంతో వీటి పరిధిలో ఉన్న నెట్టెంపాడు, కోయిల్​సాగర్​, బీమా, ఎంజీకేఎల్​ఐ స్కీముల ద్వారా పెద్ద మొత్తంలో చెరువులు, కుంటలకు నీటిని ఎత్తిపోయలేదు.

ఈ క్రమంలో గతేడాది నవంబరు నుంచే  చెరువుల్లో నీటి నిల్వలు పడిపోతూ వచ్చాయి. జనవరి, ఫిబ్రవరిలోపే దాదాపు అన్ని ఖాళీ అయ్యాయి.  వారం కిందటి వరకు దాదాపు చెరువులన్నీ డెడ్​ స్టోరేజీలోనే ఉన్నాయి.  శుక్రవారం అర్ధరాత్రి నుంచి ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురిశాయి.  శని, ఆదివారాలు వరకు ఏకధాటిగా వానలు దంచికొట్టాయి. దీంతో ఒక్కసారిగా చెరువులు, కుంటలకు వరద పోటెత్తింది.  చెక్​ డ్యామ్​లకు పెద్ద మొత్తంలో నీరు చేరింది.  దీంతో మూడు రోజులుగా చెరువులు, కుంటలు, చెక్​ డ్యామ్​లు అలుగు పోస్తున్నాయి. ఎక్కడ చూసినా అన్ని జల వనరులు నిండు కుండను తలపిస్తున్నాయి.

గతేడాది సాగుకు కష్టకాలం

గతేడాది ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పంటల సాగుకు రైతులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.  వర్షాలు లేక పంటలకు నీటి వినియోగం బాగా పెరిగింది.  వానాకాలం పంటలను కాపాడుకునేందుకు కూడా బోర్లను వినియోగించాల్సి వచ్చింది.  రిజర్వాయర్లలో నీటి నిల్వల ఆధారంగా స్కీం కెనాల్స్​ ద్వారా వానాకాలం పంటలను కాపాడుకునేందుకు నీటిని అందించాల్సిన పరిస్థితి ఏర్పడింది.  ఇదే సమయంలో ఉన్న నీటిని చెరువులకు ఎత్తిపోయడంతో అటు రిజర్వాయర్లలో నీరు పూర్తిగా అడుగంటిపోయింది. గత యాసంగిలో నీటి వినియోగం మరింత పెరగడంతో చాలా మంది రైతులు సాగుకు బ్రేక్​ ఇచ్చారు.  బోర్లు ఉన్న రైతులు మాత్రమే సాగుకు ముందుకు వచ్చారు.  కెనాల్స్​కింద క్రాప్​ హాలిడే  ప్రకటించారు. అక్కడక్కడా కొన్ని స్కీముల కింద ఉన్న  కెనాల్స్​ద్వారా వారబందీ పద్ధతిన నీటిని విడుదల చేసినా..  అవి ఏ మూలకు సరిపోలేదు.  చివరి దశలో చాలా పంటలు ఎండిపోయాయి.

రెండేళ్ల వరకు సాగుకు భరోసా..

ఇటీవల కురిసిన వర్షాలకు చెరువులు, కుంటలు, చెక్ డ్యాములు అలుగు పోస్తున్నాయి.  స్కీముల నుంచి కృష్ణానది జలాలను ఎత్తిపోయాల్సిన అవసరం లేకుండానే ఫుల్ కెపాసిటీకి చేరుకున్నాయి.  ప్రస్తుతం చేరిన నీటి నిల్వల వల్ల వచ్చే యాసంగితో పాటు మరో ఏడాది పాటు సాగునీటికి ఎలాంటి ఇబ్బంది ఉండదు.  దీనికితోడు గతేడాది బోర్లను ఎక్కువగా వినియోగించడంతో గ్రౌండ్​ వాటర్​​పాతాళానికి పడిపోయింది.  చెరువులు, వాగులు, కుంటలు ఫుల్​ కెపాసిటీకి చేరుకోవడంతో వీటి కింద ఉన్న బోర్లు రీచార్జ్​ అయ్యే అవకాశం ఉంది.