ఫణిగిరిలో దొరికిన నాణేల పరిశీలన

తుంగతుర్తి, వెలుగు : సూర్యాపేట జిల్లా నాగారం మండల పరిధిలోని ఫణిగిరిలో దొరికిన బౌద్ధ శిల్పాలు, నాణేలతో ఈ గ్రామం ప్రపంచ పటంలో నిలిచిందని పురావస్తు శాఖ ముఖ్య కార్యదర్శి శైలజా రామయ్యర్‌‌‌‌‌‌‌‌ చెప్పారు. ఫణిగిరి కొండపై జరుగుతున్న తవ్వకాల్లో బయటపడిన నాణేలను గురువారం ఆమె పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఏపీలోని అమరావతి, నాగార్జునకొండలో లభించిన బౌద్ధ చారిత్రక ఆనవాళ్లను మించినవి ఫణిగిరిలో దొరికాయన్నారు. 

ఇంత పెద్ద సంఖ్యలో నాణేలు ఎక్కడా దొరకలేదని, ఫణిగిరి బౌద్ధ క్షేత్రంలోనే 3,730 నాణేలు లభించాయన్నారు. నాణేలపై ఓ వైపు ఏనుగు, మరో వైపు ఉజ్జయిని గుర్తు ఉన్నాయని, ఇవి ఇక్ష్వాకుల కాలం నాటి నాణేలుగా గుర్తించామని చెప్పారు. తెలంగాణ వారసత్వ శాఖ డైరెక్టర్ భారతీ హోలికేరి మాట్లాడుతూ ఆర్కియాలజీ ఆఫ్ ఇండియా అనుమతితో తవ్వకాలు మొదలు పెట్టామని, ఇప్పటికే ఏడు సార్లు తవ్వకాలు జరిపామని, ఇంకో రెండు సార్లు తవ్వకాలకు పర్మిషన్‌‌‌‌‌‌‌‌ అడగనున్నట్లు చెప్పారు. 

ఫణిగిరిలో ఎన్నో చారిత్రక ఆధారాలు ఉన్నాయని, ఇక్కడ గాజు, రాతి పూసలు, విరిగిన సున్నపు రాయి విగ్రహాలు ఎంతో ముఖ్యమైనవన్నారు. ఇక్కడ దొరికిన కొన్ని స్థూపాలను న్యూయార్క్‌‌‌‌‌‌‌‌ మ్యూజియంలో కూడా ప్రదర్శనకు ఉంచినట్లు చెప్పారు. వారి వెంట అడిషనల్‌‌‌‌‌‌‌‌ కలెక్టర్‌‌‌‌‌‌‌‌ బీఎస్‌‌‌‌‌‌‌‌.లత, అడిషనల్‌‌‌‌‌‌‌‌ డైరెక్టర్‌‌‌‌‌‌‌‌ నారాయణ మల్లునాయక్, తహసీల్దార్‌‌‌‌‌‌‌‌ బ్రహ్మయ్య ఉన్నారు.