ఓయూ ఇంజినీరింగ్ కాలేజీల్లో ఎగ్జామ్ ఫీజుల మోత

  • అనుబంధ కాలేజీల్లో భారీ మొత్తంలో ఫీజులు
  • ఇతర వర్సిటీలతో పోలిస్తే రెండింతలకుపైనే వసూలు

హైదరాబాద్, వెలుగు : ఉస్మానియా యూనివర్సిటీ (ఓయూ) అనుబంధ ప్రైవేటు ఇంజినీరింగ్ కాలేజీల్లో చదివే విద్యార్థులకు ఎగ్జామ్ ఫీజులు భారంగా మారాయి. ఇతర వర్సిటీలతో పోలిస్తే ఫీజు డబుల్ ఉండటంతో, విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. తగ్గించాలని కోరుతూ స్టూడెంట్లు వర్సిటీ అధికారులను, హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ అధికారులను కలిసి విజ్ఞప్తులు చేసినా ఫలితం లేకుండా పోయింది.

జేఎన్టీయూలో 955, ఓయూలో 2,660..

ఓయూ పరిధిలోని అనుబంధ ఇంజినీరింగ్ కాలేజీల్లో రెగ్యులర్ సెమిస్టర్ ఎగ్జామ్ ఫీజు రూ.2,660,  బ్యాక్ లాగ్ సెమిస్టర్ ఫీజు 4 పేపర్లలోపు రూ.1,620 ఉంది. జేఎన్టీయూహెచ్​ పరిధిలోని కాలేజీల్లో మాత్రం రెగ్యులర్ సెమిస్టర్ ఎగ్జామ్ ఫీజు రూ.955 ఉండగా, బ్యాక్ లాగ్ సెమిస్టర్ ఫీజు ఒక్క సబ్జెక్టు కు రూ.365, రెండు సబ్జెక్టులకు రూ.615, మూడు సబ్జెక్టులకు రూ.840, నాలుగు ఆపై సబ్జెక్టులకు రూ.955 ఎగ్జామ్ ఫీజు ఉంది. ఓయూలో ఒక్క సబ్జెక్టు బ్యాక్ లాగ్ ఉన్నా, నాలుగు పేపర్లున్నా ఫీజు మాత్రం ఒకేమొత్తంలో చెల్లించాల్సి వస్తోంది.

అలాగే, కాకతీయ వర్సిటీలో రెగ్యులర్ సెమిస్టర్ ఫీజు రూ.1,200 ఉండగా, బ్యాక్ లాగ్ సెమిస్టర్ ఫీజు 3 పేపర్ల వరకు రూ.1,100, రెండు పేపర్ల వరకైతే రూ.600 ఉంది. మహాత్మాగాంధీ వర్సిటీ పరిధిలోని కాలేజీలో రెగ్యులర్ ఫీజు రూ.1,300 ఉండగా, బ్యాక్ లాగ్​లో 3 పేపర్ల వరకూ రూ.760, ఆ పై పేపర్లకు ఫీజు రూ.1,300గా ఉంది. అన్నింటితో పోలిస్తే ఓయూ పరిధిలోనే ఫీజులు భారీగా ఉండటంతో విద్యార్థులు ఆయా కాలేజీల్లో చేరేందుకు ఇబ్బంది పడే అవకాశం ఉందని కాలేజీల మేనేజ్మెంట్లు చెప్తున్నాయి. ప్రభుత్వం స్పందించి, ఎగ్జామ్ ఫీజులను తగ్గించాలని కోరుతున్నాయి. 

ప్రతి బ్యాక్ లాగ్ పేపర్​కు వెయ్యి!

ఓయూ పరిధిలోని అన్ని ఇంజినీరింగ్ బ్యాక్ లాగ్ పేపర్ల ఫీజులను వర్సిటీ పెంచిందని స్టూడెంట్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎగ్జామ్ ఫీజుతో పాటు ఫెయిలైన ప్రతి సబ్జెక్టుకు రూ.వెయ్యి కట్టాలని ఉత్తర్వులిచ్చినట్టు వారు పేర్కొంటున్నారు. దీన్ని వ్యతిరేకిస్తూ ఇటీవల ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థులు ఎగ్జామినేషన్ ఆఫీస్ ముందు ధర్నా నిర్వహించారు. షెడ్యూల్ ప్రకటించినప్పుడు ఒక ఫీజు.. ప్రస్తుతం మరో ఫీజు వసూలు చేసుడేందని పలువురు స్టూడెంట్లు ప్రశ్నిస్తున్నారు.