నా షాపింగ్ మాల్ జీఎస్టీ ఎప్పుడో కట్టిన: బీఆర్ఎస్​ నేత జీవన్​రెడ్డి

  •     ఆ సొమ్మును కేంద్రానికి పంపకుండా సజ్జనార్ ఫ్రాడ్ చేశారు
  •     నాపై బురదజల్లే కుట్ర
  •     ఆర్మూర్  మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి
  •     ఆర్టీసీ ఎండీ క్రిమినల్ మైండ్ సెట్ తో పనిచేస్తున్నారు
  •     సీపీగా రూ.3 వేల కోట్లు సంపాదించారని ఆరోపణ

నిజామాబాద్, వెలుగు :  నిజామాబాద్ జిల్లా  ఆర్మూర్​ బస్టాండ్​లోని తన షాపింగ్  మాల్​కు చెందిన జీఎస్టీని ఎప్పుడో కట్టానని బీఆర్ఎస్​ నేత  జీవన్​రెడ్డి తెలి పారు. ఆ సొమ్మును కేంద్ర ప్రభుత్వానికి పంపకుండా ఆర్టీసీ ఎండీ సజ్జనార్​ ఫ్రాడ్​ చేశారని ఆయన ఆరోపించారు. సజ్జనార్  రూ.వందల కోట్ల అవినీతికి పాల్పడ్డారని ఆయన అన్నారు. శుక్రవారం జిల్లా పార్టీ ఆఫీసులో మీడియాతో జీవన్  రెడ్డి మాట్లాడారు. 

రిటైర్మెంట్​ తర్వాత రాజ్యసభకు నామినేట్​ కావాలనే ప్లాన్​తో  కాంగ్రెస్​కు సజ్జనార్  అనుకూలంగా పనిచేస్తున్నారని చెప్పారు. సరిగ్గా లోక్ సభ ఎన్నికల టైంలోనే తనపై బురదజల్లి ప్రజల్లో చులకన చేసేందుకు కుట్రచేస్తున్నారని మండిపడ్డారు. ‘‘ఈ నెల 8న ఆర్మూర్​ కార్నర్​ మీటింగ్​లో సీఎం రేవంత్​ రెడ్డి నా షాపింగ్​ మాల్​ పేరు ప్రస్తావించిన మరుసటి రోజే సజ్జనార్​ జిల్లాకు రావడం, ఆర్టీసీ ఆఫీసర్లు షాపింగ్​ మాల్​కు నోటీస్​ ఇవ్వడం అంతా కుట్రపూరితంగా జరిగింది. 

క్రిమినల్​ మైండ్​సెట్ తో డ్యూటీ చేసే సజ్జనార్..​ సైబరాబాద్​ పోలీస్​ కమిషనర్​గా రూ.3 వేల కోట్లు అక్రమంగా సంపాదించారు. సుప్రీంకోర్టులో ఆయనపై కేసులు నడుస్తున్నాయి. ఆర్టీసీ డీజిల్, స్ర్కాప్, టైర్లు, కొత్త బస్సుల కొనుగోళ్లలో కమీషన్లు వసూలు చేశారు’’అని ఆరోపించారు.