ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో నిమజ్జనానికి సర్వం సిద్ధం

  • ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో నేడు గణేశ్ శోభాయాత్ర
  •  దాదాపు 5 వేల విగ్రహాల నిమజ్జనం
  •  భారీ పోలీసు బందోబస్తుతో పాటు, సీసీ కెమెరాలతో నిఘా
  •  వాగులు, చెరువుల వద్ద క్రేన్ల ఏర్పాటు

ఆదిలాబాద్, వెలుగు : నవరాత్రులు పూజలందుకున్న గణనాథుడి నిమజ్జనానికి సర్వం సిద్ధమైంది. కొన్ని ప్రాంతాలు మినహాఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా మంగళవారం ఉదయం నుంచి వినాయకుడి శోభయాత్ర జరగ నుంది. జిల్లా కేంద్రాలు, పట్టణాల్లో పెద్ద ఎత్తున వినాయకుడి విగ్రహాలు ఉండటంతో శోభయాత్ర సమయంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆయా శాఖల అధికారులు చర్యలు చేపట్టారు. గళ్లీ రోడ్లతో పాటు ప్రధాన కూడళ్లలో గుంతలు పూడ్చడం, విద్యుత్ వైర్లు సరిచేయడం, పారిశుధ్య నిర్వహణపై దృష్టి పెట్టారు. జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు నిమజ్జన ఏర్పాట్లపై అధికాకులకు  సూచనలు చేశారు. టపాకులు పేల్చేందుకు అనుమతి లేదని, డీజే నిర్వాహకులు పరిమితికి మించి సౌండ్ పెట్టకూడదని పోలీసులు ఆదేశించారు. 

ఆదిలాబాద్​ జిల్లా కేంద్రంలో మంగళవారం ఒక్కరోజే 300 గణేశ్ విగ్రహాలు నిమజ్జనానికి తరలించనున్నారు. శోభాయాత్రను తిలకించేందుకు పట్టణంతోపాటు గ్రామీణ ప్రాంతాల నుంచి  ప్రజలు పెద్దఎత్తున తరలివస్తారు. వారికి ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా, శాంతిభద్రతలకు విఘాతం కలుకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. జిలా వ్యాప్తంగా దాదాపు వెయ్యి మంది పోలీసులు భద్రతా ఏర్పాట్లకు నియమించగా వారిలో 600 మంది పట్టణంలోనే విధులు నిర్వహించనున్నారు. 200 సీసీ కెమెరాలతో పాటు డ్రోన్ ద్వారా నిఘా ఏర్పాటు చేశారు. జిల్లా కేంద్రంలోని పలు రూట్లను మల్టీ జోన్ 1 ఐజీ చంద్రశేఖర్ రెడ్డి, కలెక్టర్ రాజర్షి షా, ఎస్పీ గౌస్ ఆలం పరిశీలించారు. నిమజ్జనం చేసే పెన్ గంగా నది, చాందా బ్రిడ్జి ప్రాంతాన్ని పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. 

మంచిర్యాల జోన్ పరిధిలో మొత్తం 2307 వినాయక విగ్రహాలు నిమజ్జనం కానుండగా 842 మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు. రాయపట్నం బ్రిడ్జి గూడెం, గోదావరి పుష్కర ఘాట్, లక్సెట్టిపేట, మంచిర్యాలలోని గౌతమేశ్వర టెంపుల్ సమీపంలో, సీతారాంపల్లి ఇంటెక్ వెల్, ఇందారం, గోదావరి బ్రిడ్జి, చెన్నూర్ లో పెద్ద చెరువు, పోచమ్మ చెరువులో నిమజ్జనం ఏర్పాట్లు చేశారు. పోలీసు పికెట్లు, ఇతర ప్రభుత్వ శాఖల సమన్వయంతో రోడ్ల రిపేర్లతోపాటు ప్లడ్ లైట్లు, క్రేన్లు, ఫ్లాట్ ఫామ్స్, మంచినీటి సదుపాయం కల్పించారు.

ఆసిఫాబాద్ జిల్లా వ్యాప్తంగా 837 విగ్రహాలు నిమజ్జనం కానున్నాయి. 950 మందితో పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. 1200 సీసీ కెమెరాలతో నిఘా పెట్టారు. జిల్లాలో కేంద్రంలోని పెద్ద వాగు వద్ద భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. నిర్మల్​లో 500 గణేశ్ విగ్రహాలు నిమజ్జనం కానున్నాయి.

మొత్తం 500 మంది పోలీసులతో భద్రతా ఏర్పాటు చేశారు. 100 సీసీ కెమెరాలు, డ్రోన్లతో నిఘా ఉంచారు. వినాయక్ సాగర్, బంగాలపేట చెరువు వద్ద క్రేన్లను ఏర్పాటు చేశారు. జిల్లాలో భారీ విగ్రహాలు ఉండటంతో చెరువుల వద్ద ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటున్నారు. భద్రత కట్టుదిట్టం చేశాం

ఆదిలాబాద్ పట్టణంలోని గణేశ్ నిమజ్జనం సందర్భంగా ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా భద్రతను కట్టుదిట్టం చేశాం. శోభాయాత్రలో పటాకులు కాల్చడాన్ని నిషేధించాం. పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చే అవకాశం ఉండడంతో ఎలాంటి అగ్ని ప్రమాదాలు జరుగకుండా ఈ నిర్ణయం తీసుకున్నాం. రాత్రి సమయంలో ప్రత్యేకంగా డ్రంకెన్​ డ్రైవ్ చెక్ పోస్టులు ఏర్పాటు చేశాం. విగ్రహాలను తరలించే వాహనాల డ్రైవర్లు మద్యం సేవించకూడదు.– జీవన్ రెడ్డి, డీఎస్పీ ఆదిలాబాద్