గభీరే కాసారే విశతి విజనే ఘోరవిపినే
విశాలే శైలేచ భ్రమతి కుసుమార్థం జడమతిః
సమర్ప్యైకం చేతస్సరసిజ ముమానాథ భవతే
సుఖేనావస్థాతుం జన ఇహ న జానాతి కిమహో
మందబుద్ధి కలవారు భగవంతుని పూజ కోసం పూలు తేవడానికి లోతైన చెరువులలో దిగుతారు. దట్టమైన అడవులలో తిరుగుతారు. విశాలమైన కొండల మీద, గుట్టల మీద తిరుగుతారు. తమలో ఉన్న తమ మనసు అనే పద్మాన్ని భగవంతునికి సమర్పించి ఈ లోకంలో సుఖంగా ఎందుకు ఉండట్లేదో ఆశ్చర్యంగా ఉంది. మనసు పెట్టి భక్తితో పూజించడం ముఖ్యం కదా... అని జగద్గురువులైన ఆదిశంకరులు శివానందలహరిలో చెప్పారు.
ఇది చాలా చోట్ల ప్రత్యక్షంగా చూస్తుంటాం. వేలకువేల రూపాయలు ఖర్చు చేసి పూలు కొంటారు. ఎక్కడెక్కడో తిరిగితిరిగి పూలను సాధించుకుంటారు. ఒకవేళ ఆ పూలు దొరక్కపోతే, అసహనంగా పరుష వాక్యాలు పలుకుతారు. అంతేకాని మనసులోని పద్మాన్ని భగవంతునికి సమర్పించలేకపోతున్నారు. ఇందులో లౌకికార్థం కూడా ఉంది.
ఇంట్లో కళ్ల ఎదురుగా ఉంటే ప్రత్యక్ష దైవాలయిన తల్లిదండ్రులను, విద్యాబుద్ధులు నేర్పిన గురువులను నిర్లక్ష్యం చేసి, కొన్ని వేల మైళ్ల దూరంలో ఎక్కడో ఆలయంలో ఉన్న భగవంతుని కోసం గంటల తరబడి ప్రయాణించి, నిరీక్షించి, దర్శించుకుని వస్తారు. దేవుడు సర్వాంతర్యామి అని మనకు వేదాలు చెప్తున్నాయి. తల్లిదండ్రుల గురించి, గురువు గురించి ‘మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ’ అని చెప్తున్నారు. ఇంటికి వచ్చిన అతిథిని కూడా దైవంగానే భావించమన్నారు. మనసు పెట్టి చేయవలసిన ఈ పనులను విడిచిపెట్టి, భౌతికంగా చేసే పనులకు విలువనిస్తున్నారు అని శంకరాచార్యుని భావన.
వినాయకచవితి కథ ఇందుకు మంచి ఉదాహరణ.
గణాధిపత్యం కోసం కుమారస్వామి నదులలో స్నానం చేయడానికి వెళితే, వినాయకుడు మాత్రం తల్లిదండ్రులకు ప్రదక్షిణ నమస్కారం చేసి, నాయకుడయ్యాడు.
ఇక శ్రవణకుమారుని కథ గమనిస్తే...
వయోవృద్ధులైన తల్లిదండ్రులను కావడిలో రెండు పక్కలా ఉంచి, తన భుజాల మీద ఆ కావడిని మోసేవాడు. తల్లిదండ్రులను ప్రత్యక్ష దైవాలుగా భావించి, వారిని అనునిత్యం సేవించుకునేవాడు. త్రికరణశుద్ధిగా వారిని పూజించేవాడు. ప్రహ్లాదుడిని హిరణ్యకశిపుడు ఎన్ని రకాలుగా శిక్షించినా, తన మనసును ఆ భగవంతుని మీదే లగ్నం చేశాడు. మనసులోనే ధ్యానించాడు. చేసే పనిలో మనసు లగ్నం కావాలి. పైపై పూజలకు, పైపై భేషజాలకు ఫలితం లభించదని ఈ శ్లోకం చెబుతోంది.
కష్టంలో ఉన్న మనిషికి హృదయ పద్మంతో సమర్పించే మాటలే ఓదార్పునిస్తాయి. ఏవేవో బహుమతులు కొని ఇవ్వటం వల్ల తాత్కాలికమైన ఉపయోగం ఉండవచ్చునేమో! కానీ, శాశ్వతమైన ఉపకారం మంచి మాటల వల్లే వస్తుంది.
శ్రీకృష్ణదేవరాయల ఆస్థానంలోని అష్టదిగ్గజకవులలో ఒకరైన ధూర్జటి మహాకవి ఈ విషయాన్నే
అంతా మిథ్య తలంచి చూచిన నరుండెట్లౌటెరింగిన్ సదా
కాంతల్పుత్రులు తనువు నిక్కంబంచు మోహార్ణవ
భ్రాంతి చెంది చరించుగాని పరమార్థంబైన నీయందు దా
చింతాకంతకు చింత నిల్పడు కదా శ్రీకాళహస్తీశ్వరా
అంటూ మరో రకంగా చెప్పాడు.
ధూర్జటి రచించిన శ్రీకాళహస్తీశ్వర మహత్యంలో కన్నప్ప కథ ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణ. శివుడికి నైవేద్యంగా తనకు దొరికిన మాంసాన్ని సమర్పించాడు. నోటితో నీరు తీసుకొచ్చి అభిషేకం చేశాడు. కంటి నుండి నీరు కారితే తన కన్ను సమర్పించాడు. అంతేకాని, పరమశివుని ప్రసాదం కోసం ఎక్కడికో వెళ్లి, పదార్థాలను రుచిగా వండి తేలేదు.
మహాభారతంలో భీష్ముడు నేలకూలుతున్న సందర్భంలో తనకు తల్పం ఏర్పాటుచేయమంటాడు. అప్పుడు దుర్యోధనుడు తన పరివారాన్ని పిలిచి, పట్టు పరుపులు తీసుకురమ్మంటాడు. అందుకు భీష్ముడు నవ్వుతూ, ‘ఈ సమయంలో నాకు పట్టు పరుపులు అక్కరలేదు’ అని చెప్తుండగానే, అర్జునుడు తన గాండీవాన్ని సంధించి, శరతల్పం ఏర్పాటు చేశాడు. దాని మీద శయనించిన భీష్ముడు, ‘దాహం’ అంటాడు. వెంటనే దుర్యోధనుడు తన సేవకులతో, ‘తాతగారికి బంగారు కలశాలలో మంచినీరు తీసుకురండి’ అని ఆజ్ఞాపిస్తాడు. అంతలోనే అర్జునుడు బాణం సంధించి, పాతాళగంగను రప్పించి, నేరుగా భీష్ముని నోటిలోకి నీరు పడేలాగ చేస్తాడు. భీష్ముడు ఆనందపరవశుడవుతాడు.
అభిమానంగా సమర్పించాలే కానీ, ఆర్భాటాలు ప్రదర్శించి ఎక్కడ నుంచో తీసుకువచ్చిన బంగారు పాత్రలు, పట్టు పరుపులు ఆయనకు అక్కరలేదు. శంకరాచార్యుడు పలికిన శ్లోకానికి ఇది గొప్ప ఉదాహరణ.
- డా. పురాణపండ వైజయంతి
ఫోన్ : 80085 51232