అమ్మో.. కుక్కలు .. ఉమ్మడి నిజామాబాద్ లో రోజుకు 10 మంది బాధితులు

  • గవర్నమెంట్​ఆదేశాలతో ఆఫీసర్లు అలర్ట్
  • శునకాల ఏరివేతకు స్పెషల్​ టీంలు

నిజామాబాద్, వెలుగు : ఒక్క జూన్ నెలలోనే 435 కేసులు.. ఈ నెలలో ఇప్పటివరకు 243.. గత ఆరు నెలలుగా 300కు పైగానే..  సగటున రోజుకు 10 మంది ఉమ్మడి నిజామాబాద్​ జిల్లాలో కుక్కల దాడిలో గాయపడుతున్నారు. పల్లె, పట్టణమన్న తేడా లేకుండా వీధి కుక్కలు స్వైరవిహారం చేస్తున్నాయి. ఆకలి మంటతో జనం మీద దాడి చేస్తున్నాయి. వాటి పునరుత్పత్తి సీజన్​లో డాగ్​బైట్​ కేసులు అధికంగా నమోదవుతున్నాయి.

వాటి పిల్లలను కాపాడుకునే ప్రయత్నంలో దగ్గరగా నడుచుకుంటూ వెళ్లేవారిని ఎటాక్​ చేస్తున్నాయి. బండ్లపై వెళ్లే వారిని, ఇంటి బయట ఆడుకుంటున్న పిల్లలను వదలట్లేదు. అసలు ఎటు నుంచి వచ్చి కుక్కలు దాడులు దాడి చేస్తున్నాయో తెలియక ప్రజలు రోడ్డు ఎక్కాలంటేనే భయపడుతున్నారు. 

కంట్రోల్​ రూమ్​​ ఏర్పాటు.. 

డాగ్​ బైట్ ​కేసులు పెరుగుతున్న నేపథ్యంలో గవర్నమెంట్ ఆదేశాల మేరకు నిజామాబాద్​ జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. నగరంలోని ఎనిమల్​ బెర్త్​ కంట్రోల్​ రూమ్ ​బాధ్యతలు పెంచింది. వీధి కుక్కల సమాచారం తెలపడానికి  08462-220234  నంబర్​ను​ పౌరుల కోసం అందుబాటులో తెచ్చినట్లు నగర పాలక కమిషనర్ మంద మకరంద్​ తెలిపారు. సమాచారం అందిస్తే వీధి కుక్కులను పట్టుకొని సంతానోత్పత్తిలేకుండా ఆపరేషన్​ చేయిస్తామని, వాటి కోపాన్ని తగ్గించే ట్రీట్​మెంట్​ను​ వెటర్నరీ డాక్టర్లు ఇస్తారని వివరించారు. ఇందుకోసం మూడు టీమ్​లను వాహనాన్ని  ఏర్పాటు చేసినట్లు మేయర్​ నీతూకిరణ్​ వెల్లడించారు.

నిజామాబాద్​లోని​ ఆటో నగర్​లో నెల కింద ఇంటి బయట ఏడాది కొడుకుతో కూర్చున్న తల్లి జరీనా.. పాలబాటిల్​ కోసం లోపలికి వెళ్లొచ్చే నిమిషం వ్యవధిలో చిన్నారిపై కుక్క దాడి చేసింది. మాక్లూర్​లో ఈ నెల 17న మూడేండ్ల పిల్లాడిని కుక్క తీవ్రంగా గాయపర్చింది. ఇంటి బయట ఆడుకుంటుండగా, ఇష్టమొచ్చినట్టు కొరికింది. 

కామారెడ్డి జిల్లా భిక్కనూర్​ మండలం రామేశ్వర్​పల్లి శివారులో ఈ నెల 3న రోడ్​పై నడుచుకుంటూ వెళ్తున్న ఏడుగురు వ్యక్తులపై వీధి కుక్కులు దాడి చేసి గాయపర్చాయి. అంతకు కొన్ని రోజుల ముందు తాడ్వాయి మండలం సోమారం తండాలో ఇంటి బయట ఆడుకుంటున్న ఏడేళ్ల బాలిక శైలజపై కుక్క దాడి చేసింది.