మహిళలకు రక్షణ కరువు.!

భారతదేశంలో 78 వ ఇండిపెండెన్స్ డే వచ్చినా ఇంకా మహిళలకు స్వేచ్ఛ, స్వాతంత్ర్యం రాలేదు.  ఒంటరి మహిళలమీద అత్యాచారాలు, మహిళల హత్యలు జరుగుతూనే ఉన్నాయి. రేపిస్టులు, హంతకులు ఏమాత్రం భయపడకుండా దారుణాలకు తెగబడుతున్నారు.  దేశంలో నిర్భయ కాండలు జరుగుతూనే ఉన్నాయి.  వైద్యులను ప్రాణదాతలు అంటారు.  అలాంటి  ప్రాణదాతలకే ఇప్పుడు రక్షణ లేని పరిస్థితి దేశంలో దాపురించింది.  సేవ్ సేవర్స్ అంటూ వైద్యులు వీధుల్లోకి ఎక్కాల్సిన పరిస్థితి వచ్చింది.  

కోల్​కతాలో మన ఇండిపెండెన్స్​డే కు సరిగ్గా ఆరు రోజుల ముందు ఒక లేడీ డాక్టర్​పై జరిగిన అత్యాచారం, హత్య సంఘటన దేశవ్యాప్తంగా కలకలం రేపింది. ఒక జర్నలిస్ట్ హత్య, ఇద్దరు యువతుల మీద అత్యాచారం కేసుల్లో జీవితఖైదు అనుభవిస్తూ జైల్లో ఉన్న గుర్మిత్ అలియాస్ రాం రహీం 21 రోజుల పెరోల్ మీద, ఇండిపెండెన్స్ డే మరో రెండు రోజులు ఉండగా మంగళవారం విడుదల అయ్యాడు.  ఇతను 2017 నుంచి జైల్లో యావజ్జీవ శిక్ష అనుభవిస్తున్నాడు, ఇప్పటికి ఆరుసార్లు పెరోల్ మీద విడుదలై 255 రోజుల పాటు బయట ఉన్నాడు. ఇతని బర్త్ డే ఉందని పెరోల్​పై  విడుదల చేశారు.  గతంలోనూ ఇలాగే  బిల్కీస్ బానుపై అత్యాచారం, ఆమె కుటుంబసభ్యుల హత్య కేసులో యావజ్జీవ శిక్షలు అనుభవిస్తున్న 11 మందిని శిక్ష పూర్తి కాకుండానే  ప్రభుత్వం విడుదల చేయడం,  అది పెద్ద సమస్యగా మారడం చూశాం.

దేశాన్ని కదిలించిన కోల్​కతా ఘటన

మనదేశంలో  బేటీ పడావో,  బేటీ బచావో అనే పాలకుల నినాదం వట్టి బూటకం అయిపోయింది.  మహిళలపై జరుగుతున్న అత్యాచారాలను ప్రస్తావిస్తూ వారి రక్షణ గురించి మొన్నటికి మొన్న ఇండిపెండెన్స్​డే నాడు  ప్రధానమంత్రి మోదీ ఎర్రకోట నుంచి మాట్లాడడం చూశాం.  ఒక మహిళ ముఖ్యమంత్రిగా ఉన్న రాష్ట్రంలో, రాష్ట్ర రాజధాని మహానగరంలో ఈ నెల 9 న అర్జీ కర్ మెడికల్ కాలేజ్ హాస్పిటల్​లో ఒక మహిళా ట్రెయినీ డాక్టర్ పైన అత్యాచారం, హత్య సంఘటన  యావత్​ దేశాన్ని కదిలించింది.  బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్​ చేస్తూ --దేశవ్యాప్తంగా  మహానగరాల్లో, చిన్న చిన్న పట్టణాల్లో ఇప్పటికీ  వైద్యులు, వైద్యసిబ్బంది నిరసన ప్రదర్శనలు నిర్వహిస్తున్నారు. ఈ సంఘటనను సీబీఐ విచారిస్తున్నది.  ఆసుపత్రి ప్రిన్సిపాల్,  వైస్ ప్రిన్సిపాల్,  
డీన్​లను సస్పెండ్ చేసి అరెస్ట్ చేయాలని డాక్టర్లు డిమాండ్ చేస్తున్నారు. ఆందోళనలు ఇంకా కొనసాగుతున్నాయి. ఆసుపత్రికి కమిషన్ల కోసం పేషంట్లను భర్తీ చేసే సంజయ్ రాయ్ అనే ఒక బ్రోకర్ ఈ ఘోర అకృత్యానికి పాల్పడినట్లు తెలుస్తున్నది. ఆసుపత్రిలోని మూడో అంతస్తులో దినమంతా వైద్య సేవలందించి సెమినార్ హాల్​లో నిద్రిస్తున్న మహిళా డాక్టర్ పై ఈ అకృత్యానికి పాల్పడ్డాడు. ఆమె రక్తం మడుగులో పడి ఉండగా చూసిన కుటుంబ సభ్యులకు ఇది చాలా పెద్ద షాక్ అయ్యింది. గతంలో ముంబయిలో ఒక నర్స్​పై కూడా ఇలాంటి అకృత్యం ఆసుపత్రిలోనే జరిగింది.  కోల్​కతాలో  డాక్టర్​పై అత్యాచారం జరిపి చంపిన సంజయ్ రాయ్ అనే నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు.  ఒక ఆసుపత్రిలో రోగులను అడ్మిట్ చేసి కమిషన్​లు తీసుకునేవాడు ఇలాంటి అకృత్యానికి పాల్పడగలడని ఎవరు ఊహిస్తారు.

కఠినచర్యలకు సీఎం మమత ఆదేశాలు

పశ్చిమ బెంగాల్​ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ వెంటనే స్పందించి నిందితుడిపై కఠిన చర్యలకు ఆదేశించారు.  డాక్టర్ కుటుంబ సభ్యులను కలిసి ఆమె మాట్లాడారు. మొన్నటి పార్లమెంట్ ఎన్నికల్లో అత్యధిక మహిళా అభ్యర్థులు ఎంపీలుగా గెలిచింది పశ్చిమ బెంగాల్ నుంచే.  అది కూడా తృణమూల్ కాంగ్రెస్ అభ్యర్థులే  కావడం విశేషం.  మహిళలకు ప్రాముఖ్యత ఉన్న అలాంటి ప్రాంతంలో  ఒక యువ వైద్యురాలి మీద అత్యాచారం జరగడం, హత్యకు గురవడం ఆందోళనకరం అనకతప్పదు. దేశంలో గత పది ఏండ్ల నుంచి మహిళల మీద అత్యాచారాలు పెరిగాయి.  మణిపూర్​లో ఇద్దరు యువతులను నగ్నంగా ఊరేగించి ఆ తర్వాత వారి మీద అకృత్యం జరపడం, హత్రస్​లో దళిత యువతిపై అత్యాచారం, హత్య ఆమె శవాన్ని సైతం కుటుంబ సభ్యులకు ఇవ్వకుండా పోలీసులే దహనం చేయడాన్ని ఎవరు మర్చిపోగలరు. రోజూ ఒకరి ప్రాణాలను కాపాడే డాక్టర్ ప్రాణానికే రక్షణ లేని పరిస్థితి ఉన్నది. 'సేవ్ సేవర్' అంటూ డాక్టర్స్ వీధుల్లోకి వచ్చి నినదించాల్సిన పరిస్థితి నెలకొంది.  మహిళలు మన కంటి రెప్పలు,  మన బిడ్డలు. వారు డాక్టర్లు కావచ్చు, లాయర్లు కావచ్చు, రైతు కూలీలు కావచ్చు, కలెక్టర్​లు, పోలీస్​లు, జడ్జిలు, రెజ్లర్లు ఎవరైనా కావొచ్చు, రాజకీయాల్లో ఉండేవారు కావచ్చు వారంతా మన కంటి రెప్పలు. దేశమంతా ఏకమై వారిని కాపాడుకోవాలి.  పెషేంట్ ల కోసం బ్రోకర్లను పోషించి ప్రోత్సహించడం శ్రేయస్కరం కాదు.  

సేవ్ అవర్ సేవర్స్! 

మన బిడ్డలను మనమే రక్షించుకోవాలి. మహిళల మీద అత్యాచార కేసులు ఎక్కువగా రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఉత్తర్ ప్రదేశ్, పశ్చిమ బెంగాల్,  చత్తీస్​గఢ్, బిహార్, మహారాష్ట్రలలో నమోదవుతున్నాయి. దేశాన్ని గతంలో కదిలించిన నిర్భయ సంఘటన లాంటి సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి.  ప్రజాప్రతినిధులపై మీద  లైంగిక వేధింపుల ఆరోపణలు వచ్చినా పాలకులు మాట్లాడడం లేదు!  పైగా ఇలాంటి దుశ్చర్యల మీద గొంతు ఎత్తినవారిని జైల్లో పెడుతున్నారు. జులుం చేస్తున్నారు. ఇంకా ఎంత కాలం?  జూనియర్ డాక్టర్లకు నిరంతర డ్యూటీలు ఏమిటి?   జూడాలపై పని ఒత్తిళ్ళు పెరిగాయి అనేది స్పష్టం అవుతున్నది.  ఈ విషయాలన్నింటి మీద ప్రభుత్వాలు దృష్టి పెట్టాలి.  మనల్ని కాపాడే వైద్యులను మనం రక్షించుకోవాలి.

- ఎండి. మునీర్, 
సీనియర్ జర్నలిస్ట్