- గోపాలగిరి వద్ద 45 ఎకరాల ప్రభుత్వ భూమి సేకరణ
- రూ.200 కోట్లతో టీఎస్ ఆయిల్ ఫెడ్ ఆధ్వర్యంలో ఏర్పాటుకు ప్రణాళిక
- సంవత్సరం గడిచినా స్టార్ట్ కాని పనులు
మహబూబాబాద్, వెలుగు: మహబూబాబాద్ జిల్లాలో ఫామాయిల్ ఫ్యాక్టరీ ఏర్పాటు శంకుస్థాపనకే పరిమితమైంది. ఉద్యానవన శాఖ ఆఫీసర్ల ప్రోత్సాహంతో మహబూబాబాద్ జిల్లాలో మొత్తం 6943 ఎకరాల్లో పామాయిల్ తోటల సాగు చేపట్టారు. ఇప్పటికే మూడేళ్లు గడిచిపోవడంతో చెట్లకు గెలలు వస్తున్నాయి. దీనికి అనుబంధంగా నిర్మాణం కావాల్సిన ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ పనులు మాత్రం అడుగు ముందుకు పడటం లేదు.
జిల్లాలో రాబోయే సంవత్సరంలో 4 వేల ఎకరాల్లో సాగును ప్రోత్సహించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. తొర్రూరు, కురవి, మరిపెడ, నరసింహులపేట మండలాల్లో పామాయిల్పంట కోతకు వచ్చింది. కానీ స్థానికంగా ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ అందుబాటులోకి రాకపోవడంతో రైతులు ఖమ్మం జిల్లాలోని అశ్వరావుపేటలోని ఫ్యాక్టరీకి పామాయిల్ గెలలను తరలిస్తున్నారు.
శంకుస్థాపనకే పరిమితం
2023 సెప్టెంబర్ నెలలో జిల్లాలోని తొర్రూరు మండలం గోపాలగిరి గ్రామ శివారు సర్వే నంబర్ 111లో 45 ఎకరాల విస్తీర్ణం గల ప్రభుత్వ భూమిలో లో రూ.200 కోట్లతో టీఎస్ ఆయిల్ ఫెడ్ ఆధ్వర్యంలో ఫ్యాక్టరీ ఏర్పాటుకు మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు శంకుస్థాపన చేశారు. 2026 నాటికి ఆయిల్ పామ్ పరిశ్రమ ప్రారంభించేలా నిర్ణయించారు. కాగా ఈప్రాంతంలో ఇప్పటి వరకు ఎలాంటి పనులు ప్రారంభం కాలేదు.
పామాయిల్సాగు కోసం డ్రిప్ కు అయ్యే ఖర్చు ప్రభుత్వమే భరిస్తుంది. మహబూబాబాద్ జిల్లా నుంచి 825 టన్నుల ఆయిల్ పామ్ గెలలను ఇప్పటికే అశ్వరావుపేటకు తరలించారు. ప్రస్తుతం టన్ను ధర రూ.17,045 పలుకుతోంది. పామాయిల్ మద్దతు ధర పెంచాలని, జిల్లాలో ఆయిల్ పామ్ ఫ్యాక్టరీని ఏర్పాటు చేయాలని రైతులు కోరుతున్నారు.
ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ ఏర్పాటుకు చర్యలు
జిల్లాలోని తొర్రూరు మండలం గోపాలగిరిలో ఆయిల్‌పామ్ పరిశ్రమ ఏర్పాటు అంశాన్ని ఉన్నతాధికారులకు తెలియజేశాం. పనులు పూర్తి చేసి 2028 వరకు అందుబా టులోకి తీసుకురావడానికి చర్యలు చేపడతాం. రాష్ట్ర ఆయిల్‌ఫెడ్ చైర్మన్జంగా రాఘవరెడ్డి కి సమస్యను వివరించాం.
సీహెచ్. రాములు, ఆయిల్‌ఫెడ్ ఆఫీసర్, మహబూబాబాద్ జిల్లా
పంట చేతికి వచ్చే సరికి పరిశ్రమ ఏర్పాటు చేయాలి
మహబూబాబాద్ జిల్లాలో భూములు ఆయిల్ పామ్ సాగుకు అనుకూలంగా ఉన్నాయి. కోతుల బాధ కూడా ఈ పంటకు లేకపోవడంతో హర్టికల్చర్ ఆఫీసర్ల సలహాతో పామాయిల్ పంటను విరివిగా సాగు చేశాం. పంట చేతికి వచ్చే వరకు పరిశ్రమ ఏర్పాటు చేయాలి.
ముడుపు రవీందర్ రెడ్డి, ఆయిల్ పామ్ రైతు, ఖానాపురం గ్రామం