పర్యావరణానికి మారుపేరు ‘బిష్ణోయ్’

బిష్ణోయ్ వర్గానికి చెందిన ప్రజలు ప్రకృతితో శాంతియుత సహజీవనానికి,  పర్యావరణ పరిరక్షణ కోసం తమ జీవితాలను పణంగా పెట్టి ప్రాణత్యాగాలకుప్రసిద్ధి పొందినవారు. వీరిని భారతదేశపు మొదటి పర్యావరణవేత్తలుగా పరిగణిస్తారు. 

బిష్ణోయ్  కమ్యూనిటీ  ఆధ్యాత్మిక నాయకుడు గురు జంభేశ్వర్.  ఈయనను జంభోజీ అని కూడా పిలుస్తారు.  'బిష్ణోయ్' అనే పదం బిస్ (ఇరవై),  నోయి (తొమ్మిది) నుంచి ఉద్భవించింది.  వీరి ధర్మం 29  ఆజ్ఞలను బోధిస్తుంది. వీటిలో ఏడు ఆజ్ఞలు  సామాజిక ప్రవర్తనను బోధిస్తాయి.  పది ఆజ్ఞలు వ్యక్తిగత పరిశుభ్రత,  ఆరోగ్య పద్ధతులను బోధిస్తాయి, నాలుగు ఆజ్ఞలు  రోజువారీ పూజకు సంబంధించిన సూచనలను తెలియజేస్తాయి. అదేవిధంగా మరో ఎనిమిది ఆజ్ఞలు జంతువులు,  చెట్లను  సంరక్షించడం.  పశుపోషణను ప్రోత్సహించడం వంటివి బోధిస్తాయి. 

ఖేజ్రీ చెట్టు బిష్ణోయిల జీవితంలో ఒక ప్రత్యేక స్థానాన్ని కలిగి  ఉంటుంది.  ఖేజ్రీ  చెట్లను లేదా వాటి కొమ్మలను నరికివేయడం లేదా గాయపరచడం,  బిష్ణోయ్ ధర్మానికి విరుద్ధం.  ఖేజ్రీ చెట్లకు  హానిచేయుట పూర్తిగా నిషిద్ధం. ఈ చిన్న  సతత హరిత వృక్షాన్ని థార్ ఎడారి జీవనాధారంగా కొలుస్తారు.  ఖేజ్రీ చెట్టు  కాయలు తినదగినవి.  నీడను ఇస్తుంది. ఈ చెట్టు ఆకులు.. ఒంటెలు, మేకలు, పశువులు,  ఇతర జంతువులకు  మేతగా ఉపయోగపడుతుంది.  ఖేజ్రీ చెట్టు ఎడారి ఆర్థిక వ్యవస్థకు,   జీవావరణ శాస్త్రానికి అమూల్యమైనది.  ఖేజ్రీ చెట్లకు, ప్రసిద్ధి చెందిన చిప్కో ఆందోళన్​కు మధ్య సంబంధం ఉంది.

చిప్కో ఆందోళన్ ఎలా పుట్టిందంటే..

పర్యావరణ ఉద్యమాల చరిత్రలో  చెట్ల నరికివేతను నిలువరించడానికి  చెట్లను కౌగిలించుకోవడం లేదా  ఆలింగనం చేసుకునే వ్యూహాన్ని మొట్టమొదటిసారిగా అమలుచేసిన వారు ‘బిష్ణోయ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు’.  ఇది  ‘చిప్కో ఆందోళన్’ గా ప్రపంచ ప్రసిద్ధిపొందింది. హిందీ పదం చిప్కో అంటే "కౌగిలించుకోవడం" లేదా "ఆలింగనం చేసుకోవడం.  జోధ్‌‌‌‌‌‌‌‌పూర్ నుంచి 18 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక చిన్నగ్రామం ‘ఖేజర్లీ’. ఇతర బిష్ణోయ్ గ్రామాలు వలె, ఇది కూడా ఖేజ్రీ చెట్లతో సమృద్ధిగా ఉంటుంది. 

సెప్టెంబరు 11, 1730లో  మహారాజా అభయ్ సింగ్,  కొత్త  రాజభవన నిర్మాణానికి అవసరమైన సున్నం తయారీకోసం  ఏర్పాటు చేసిన సున్నపు బట్టీలను  మండించడానికి కావలసిన కలప కోసం తన సైనికులను ఖేజర్లీ  గ్రామానికి పంపించాడు.  సైనికులు  కలప కోసం ఖేజ్రీ  చెట్లను నరకటం ఆరంభించినప్పుడు, ఈ విషయము తెలుసుకున్న అమృతాదేవి  అనే ఒక మహిళ తన ముగ్గురు కుమార్తెలైన అసు, రత్ని,  భగులతో కలసి  చెట్ల నరికివేతను అడ్డుకుంటుంది. అందుకోసం ఆమె  ఖేజ్రీ  చెట్టును  కౌగిలించుకుని చెట్టు నరికివేతను  నిలువరించే ప్రయత్నం చేసింది. అయినప్పటికీ సైనికులు ఆగకుండా అమృతాదేవి శరీరాన్ని  నరికి వేశారు. 

బిష్ణోయ్‌‌‌‌‌‌‌‌ల ప్రాణత్యాగం

తల్లి మరణాన్ని చూసి చలించిపోయిన  అమృతాదేవి ముగ్గురు కుమార్తెలు కూడా చెట్లను  కౌగిలించుకొని తమ ప్రాణాలను  త్యాగం చేశారు. ఈ వార్త దావానంలా వ్యాపించి ఖేజర్లీలో 83 గ్రామాలకు చెందిన బిష్ణోయ్‌‌‌‌‌‌‌‌లు సమావేశమై చెట్లను కాపాడుకోవాలంటే ప్రతి  బిష్ణోయ్ ఒక చెట్టును కౌగిలించుకొని అవసరమైతే ప్రాణ త్యాగం చేయాలని నిర్ణయించుకుంటారు. ఈ ఘటనలో మొత్తం 49 గ్రామాలకు చెందిన 363 మంది బిష్ణోయ్‌‌‌‌‌‌‌‌లు అమరులయ్యారు. ఖేజర్లీ నేల వారి రక్తంతో ఎర్రగా మారింది. ఈ విషయం తెలుసుకున్న రాజు చెట్ల నరికివేతను నిలిపివేసి  బిష్ణోయ్​ల ధైర్యాన్ని  అభినందిస్తూ, వారికి క్షమాపణలు చెప్పి  బిష్ణోయ్ గ్రామాలలో,  సమీపంలో చెట్లను నరికివేయడం,  జంతువులను వేటాడడాన్ని శాశ్వతంగా నిషేధించి శాసనాన్ని జారీ చేశాడు. 
ఆ శాసనం నేటికీ చెల్లుబాటులో ఉంది.  బిష్ణోయ్‌‌‌‌‌‌‌‌లు ఇప్పటికీ జీవవైవిధ్యాన్ని  కాపాడుకుంటున్నారు.

 పర్యావరణ ఉద్యమాలకు స్ఫూర్తి

చిప్కో ఆందోళన్ అనేక పర్యావరణ ఉద్యమాలకు స్ఫూర్తినిచ్చింది. ఉదాహరణకు 1973 లో చిప్కో  ఆందోళన్  ఉత్తరప్రదేశ్‌‌‌‌‌‌‌‌లోని  హిమాలయ ప్రాంతంలో ప్రారంభం కాగా,  జంగిల్ బచావో ఆందోళన్ 1982లో  బిహార్‌‌‌‌‌‌‌‌లోని సింగ్‌‌‌‌‌‌‌‌భూమ్ జిల్లాలో (ప్రస్తుతం జార్ఖండ్) ప్రారంభమైంది. 1983 సంవత్సరంలో కర్నాటకలోని పశ్చిమ కనుమలలో అప్పికో చలువాలి అనే పర్యావరణ ఉద్యమం ప్రారంభమైంది.   బిష్ణోయ్‌‌‌‌‌‌‌‌ల పర్యావరణ పరిరక్షణకు మరొక ఉదాహరణ.. ప్రముఖ హిందీ నటుడు సల్మాన్ ఖాన్ పై  కృష్ణ జింకల కేసు. 1998 సంవత్సరం సెప్టెంబర్ లో  సల్మాన్ ఖాన్  ‘హమ్ సాథ్ సాథ్ హై’ సినిమా షూటింగ్ కోసం రాజస్థాన్  వెళ్లినప్పుడు  జోధ్‌‌‌‌‌‌‌‌పూర్  సమీపంలోని అడవిలో రెండు కృష్ణ జింకలను  చంపడం జరిగింది.  బిష్ణోయ్‌‌‌‌‌‌‌‌లు కృష్ణ జింకలను వారి ఆధ్యాత్మిక నాయకుడు గురు జంభేశ్వర్ ప్రతిరూపంగా భావిస్తారు.  బిష్ణోయ్‌‌‌‌‌‌‌‌లు సల్మాన్ ఖాన్​పై  ఫిర్యాదు చేసి అతడిని శిక్షించడానికి ఇప్పటికీ న్యాయపోరాటం చేస్తున్నారు.

 సల్మాన్​ కేసు సుప్రీంలో  కొనసాగుతోంది

2019 సంవత్సరంలో  రాజస్థాన్ అత్యున్నత  న్యాయస్థానం సల్మాన్ ఖాన్​ను  నిర్దోషిగా ప్రకటించింది.  ఈ తీర్పును  సవాల్ చేస్తూ  రాజస్థాన్ ప్రభుత్వం సుప్రీంకోర్టులో తిరిగి అపీల్ చేసింది. ఇప్పటికీ ఈకేసు సుప్రీంకోర్టులో కొనసాగుతోంది. పర్యావరణాన్ని రక్షించటంలో వీరి పోరాట పటిమ, పట్టుదల  ప్రపంచానికి ఆదర్శంగా నిలుస్తోంది.  ప్రపంచంలో చెట్లను కాపాడటం కోసం  ప్రాణత్యాగం చేసిన గొప్ప కీర్తిని సంపాదించినవారు బిష్ణోయ్‌‌‌‌‌‌‌‌లు. పర్యావరణాన్ని కాపాడటంలో  బిష్ణోయ్‌‌‌‌‌‌‌‌ల నిబద్ధత గురించి నేటి విద్యార్థులు, సమాజం తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. 


- డా. శ్రీధరాల రాము,
ఫ్యాకల్టీ ఆఫ్  కెమిస్ట్రీ అండ్ ఎన్విరాన్మెంటల్ సైన్సెస్