సర్వేలో తొలిరోజు..ఇంటింటికి స్టిక్కరింగ్

 

  • కొన్నిచోట్ల ఇంటి నంబర్లు వెతకడంలో ఇబ్బందులు పడిన ఎన్యుమరేటర్లు
  • మహాత్మానగర్, రేకొండ గ్రామాల్లో  స్టిక్కరింగ్ ను పరిశీలించిన కలెక్టర్ పమేలా సత్పతి
  • ఇయ్యాల, రేపు స్టిక్కర్స్ వేసే పనిలోనే ఎన్యుమరేటర్లు
  • ఎల్లుండి నుంచి కుల గణన సర్వే 

కరీంనగర్, వెలుగు: ఉమ్మడి జిల్లావ్యాప్తంగా సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే బుధవారం ప్రారంభమైంది.  తొలి రోజు ఎన్యుమరేటర్లు తమకు కేటాయించిన ఇళ్లకు స్టిక్కరింగ్ వేశారు. స్టిక్కరింగ్ ప్రక్రియ గురు, శుక్రవారాల్లోనూ కొనసాగనుంది. 75 ప్రశ్నలతో కూడిన సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే శనివారం  నుంచి ప్రారంభం కానుంది. తిమ్మాపూర్ మండలం మహాత్మా నగర్, చిగురుమామిడి మండల కేంద్రం, ఇదే మండలంలోని రేగొండలో  ఇళ్లకు స్టిక్కరింగ్ అంటించే ప్రక్రియను కలెక్టర్ పమేలా సత్పతి, అడిషనల్ కలెక్టర్ ప్రపుల్ దేశాయ్, ట్రైనీ కలెక్టర్ అజయ్ యాదవ్ పరిశీలించారు.

 ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ సర్వేలో సేకరించిన వివరాలను గోప్యంగా ఉంచుతామని, ఎవరికీ వ్యక్తిగత సమాచారాన్ని వెల్లడించమని స్పష్టం చేశారు. ప్రజలు ఆధార్, రేషన్ కార్డు, ధరణి పట్టాదారు పాస్ బుక్ వంటివి సిద్ధంగా ఉంచుకుని ఎన్యుమరేటర్లకు సమాచారం ఇచ్చి సహకరించాలని సూచించారు. కాగా తమకు కేటాయించిన ఇండ్లను వెతకడంలో ఎన్యుమరేటర్లు ఇబ్బందులు పడ్డారు.

వారికి ఇళ్ల మ్యాపింగ్ 2011 సెన్సెస్ ప్రకారం తయారుచేసింది కావడంతో కరీంనగర్ కార్పొరేషన్, జమ్మికుంట, హుజూరాబాద్, కొత్తపల్లి మున్సిపాలిటీల్లో ఇండ్ల నంబర్లను గుర్తించేందుకు ఎన్యుమరేటర్లు ఇబ్బందులు పడ్డారు. జీపీ నుంచి మున్సిపాలిటీగా మారిన ఏరియాల్లో ఈ సమస్య తలెత్తింది. ఈ 13 ఏండ్లలో చాలావరకు కొత్త ఇండ్లు రాగా.. ఎన్యుమరేటర్లకు ఇచ్చిన జాబితాలో ఆ ఇంటి నంబర్లు లేకపోవడంతో తమ ఇండ్లకు ఎందుకు  స్టిక్కర్లు వేయడం లేదని ప్రశ్నించిన ఘటనలు హుజురాబాద్ లో ఎన్యుమరేటర్లకు ఎదురయ్యాయి. 

ఇండ్లకు స్టిక్కర్లు 

పెద్దపల్లి, వెలుగు: పెద్దపల్లి జిల్లా వ్యాప్తంగా సమగ్ర కుటుంబ సర్వేకు సంబంధించిన ఇండ్ల గుర్తింపు స్టిక్కరింగ్ బుధవారం పూర్తయిందని అధికారులు పేర్కొన్నారు. ఈనెల 9 నుంచి కుటుంబాలకు సంబంధించిన పూర్తి వివరాలు సేకరిస్తామని పెద్దపల్లి జిల్లా కలెక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ శ్రీహర్ష తెలిపారు. జిల్లాలో జరుగుతున్న సర్వేను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఎన్యూమరేటర్లకు పలు సూచనలు చేశారు.

సర్వే పకడ్బందీగా నిర్వహించాలి 

కొడిమ్యాల,వెలుగు: సమగ్ర కుటుంబ సర్వేను పకడ్బందీగా చేపట్టాలని ఉమ్మడి జిల్లా స్పెషల్​ఆఫీసర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆర్వీ కర్ణన్​ అధికారులను ఆదేశించారు. బుధవారం జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలంలో సర్వే తీరును కలెక్టర్ సత్యప్రసాద్‌‌‌‌‌‌‌‌తో కలిసి పరిశీలించారు. కుటుంబ వివరాలను పక్కాగా నమోదు చేయాలన్నారు. అనంతరం పూడూరు, కొడిమ్యాల ధాన్యం కొనుగోలు సెంటర్లను సందర్శించారు. గతంలో తాము దళారులకు పంట అమ్మగా డబ్బులు ఇవ్వకుండా ఇబ్బందులకు గురిచేస్తున్నారని కొందరు రైతులు కర్ణన్‌‌‌‌‌‌‌‌ దృష్టికి తీసుకెళ్లారు. స్పందించిన ఆయన పూర్తి వివరాలు సేకరించి బాధ్యులపై కేసులు నమోదు చేయాలని తహసీల్దార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రమేశ్‌‌‌‌‌‌‌‌కు సూచించారు.కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ లత, ఆర్డీవో మధుసూదన్, ఎంపీడీవో స్వరూప పాల్గొన్నారు.