తహసీల్దార్ జయశ్రీపై కొనసాగుతున్న విచారణ

హుజూర్ నగర్, వెలుగు: ప్రభుత్వ భూములు ధరణిలో మార్పు చేసి రైతుబంధు పొందినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ లో తహసీల్దార్​గా పని చేసిన వజ్రాల జయశ్రీ, ధరణి ఆపరేటర్  జగదీశ్​లపై విచారణ కొనసాగుతోంది. 3 రోజుల విచారణకు కోదాడ జూనియర్  సివిల్  కోర్టు అనుమతించింది. మొదటి రోజు విచారణకు తహసీల్దార్  సహకరించలేదని తెలిసింది. అనారోగ్యంగా ఉంది.. నా దగ్గర సమాచారం లేదంటూ దాట వేసినట్లు సమాచారం. బుధవారం రెండో రోజు తహసీల్దార్ ను అన్యాక్రాంతమైన ప్రభుత్వ భూములు, స్థిరాస్తుల బదిలీ అంశంపై పోలీసులు ప్రశ్నించారు.

తహసీల్దార్ గా గరిడేపల్లి, మఠంపల్లి, హుజూర్ నగర్  మండలాల్లో పని చేసిన సమయంలో ఆమెపై అనేక అభియోగాలు వచ్చాయి. హుజూర్ నగర్  మండలంలోని శ్రీనివాసపురం, లింగగిరి వంటి గ్రామాల్లో అక్రమార్కులకు సహకరించి ప్రభుత్వ భూములకు పట్టాలు ఇచ్చినట్లు ఆరోపణలున్నాయి. గరిడేపల్లి మండలంలో విలువైన ప్రభుత్వ భూమిని ప్రైవేట్​ వ్యక్తులకు కట్టబెట్టినట్లు పలువురు బహిరంగంగానే చర్చించుకుంటున్నారు. తహసీల్దార్ ను విచారిస్తుండడంతో నిజాలు బయటికి వస్తాయేమోనని అక్రమార్కులు ఆందోళన చెందుతున్నారు. పోలీస్  విచారణ తర్వాత ఏ విషయాలు బయటపడతాయోనని 
ఉత్కంఠ నెలకొంది.