గంజాయి అమ్ముతున్న స్టూడెంట్ అరెస్ట్ 

మిర్యాలగూడ, వెలుగు : గంజాయి అమ్ముతున్న ఇంజినీరింగ్ స్టూడెంట్ ను పోలీసులు అరెస్ట్​చేశారు. వన్ టౌన్ పీఎస్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డీఎస్పీ రాజశేఖర్ రాజు వివరాలు వెల్లడించారు. మిర్యాలగూడ పట్టణంలోని శాంతినగర్ కు చెందిన సిరికొండ భానుప్రకాష్ కోదాడలో ఈఈఈ విభాగంలో ఇంజినీరింగ్ చేశారు. ఎనిమిదేళ్ల క్రితం తండ్రి శ్రీనివాస్ మృతి చెందడంతో నాటి నుంచి చెడు అలవాట్లకు బానిసయ్యాడు. కోదాడకు చెందిన అఖిల్ అలియాస్ సోను, డేంజర్ రాఘవతో కలిసి భానుప్రకాష్ గంజాయి విక్రయించేవాడు.

గత ఏడాది సదరు స్నేహితులతో కలిసి ఒడిశా, ఏపీ బార్డర్ లోని కూర్మనూర్ గ్రామానికి చెందిన వ్యక్తి నుంచి ఒకటిన్నర కేజీల గంజాయిని కొనుగోలు చేసి హైదరాబాద్, దూల్ పేట్, పటాన్ చెరువు వద్ద గీతం వర్సిటీ, ఇబ్రహీంపట్నం పరిధిలోని సిద్ధార్థ కాలేజీలు, పలు హాస్టల్స్ లో విక్రయించాడు. గత నవంబర్ లో భద్రాచలం నుంచి చింతూరుకుంట మీదుగా కుర్మనూర్ కు చేరుకొని 2.5 కేజీల గంజాయి రూ.1250 కొనుగోలు చేశాడు. సూర్యాపేట జిల్లా అమీనాబాద్ లోని తన ఇంట్లో ఉంచిన గంజాయి నుంచి1200 గ్రాములు తీసుకొని మిర్యాలగూడలోని బంగారుగడ్డ, ముత్తిరెడ్డికుంట, సుందర్ నగర్, త్రిపురారంకు చెందిన నలుగురు వ్యక్తులకు 50 గ్రాముల చొప్పున రూ.4 వేలకు విక్రయించాడు. కేజీ గంజాయిని రూ.5 వేల నుంచి 10 వేలకు కొనుగోలు చేసి రూ.25 వేలకు అమ్మేవాడు. 

అనంతరం హైదరాబాద్ దూల్ పేట్ లో రూ.10 వేలకు 500 గ్రాముల గంజాయి, గీతం, సిద్ధార్థ కళాశాలల వద్ద మరో 500 గ్రాముల గంజాయిని రూ.5 వేలకు అమ్మాడు. మిగిలిన 1300 గ్రాముల గంజాయిని విక్రయించేందుకు మిర్యాలగూడ పట్టణంలోని బోటింగ్ శివాలయం వద్దకు చేరుకోగా విశ్వసనీయ సమాచారం మేరకు పోలీసులు అతడిని పట్టుకున్నారు. నిందితుడి నుంచి 1300 గ్రాముల గంజాయి, రూ.2 వేల నగదు, సెల్ ఫోన్ స్వాధీనం చేసుకొని రిమాండ్ కు తరలించినట్లు డీఎస్సీ తెలిపారు. సమావేశంలో వన్ టౌన్ సీఐ కరుణాకర్, ఎస్ఐ సుధీర్ కుమార్, సిబ్బంది పాల్గొన్నారు.