ఎల్లంపల్లి ఫుల్.. ఏ క్షణమైనా గేట్లు ఎత్తే చాన్స్

  • ప్రాజెక్టుకు పైనుంచి భారీగా వరద 
  • 20 టీఎంసీలకు గాను 17 టీఎంసీలకు చేరిన నీటి నిల్వ 
  • మిడ్ మానేరుకు ఎత్తిపోతలు షురూ 
  • నంది పంప్ హౌస్ ద్వారా 12,931 క్యూసెక్కులు విడుదల 

మంచిర్యాల/పెద్దపల్లి, వెలుగు: మొన్నటి వరకు వెలవెలబోయిన ఎల్లంపల్లి ప్రాజెక్టు.. ఉమ్మడి ఆదిలాబాద్​ జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలు, గోదావరిలో వరద కారణంగా వారం రోజుల్లోనే నిండుకుండలా మారింది. ప్రాజెక్టు కెపాసిటీ 20.175 టీఎంసీలు కాగా, శనివారం సాయంత్రానికి నీటి నిల్వ17.375 టీఎంసీలకు చేరింది. పైనుంచి వస్తున్న వరద మరింత పెరిగితే, ఏ క్షణమైనా గేట్లు ఎత్తే అవకాశం ఉంది. ప్రస్తుతం క్యాచ్మెంట్ ఏరియా నుంచి 13,659 క్యూసెక్కుల ఇన్​ఫ్లో కొనసాగుతున్నది.

ఇక ఎల్లంపల్లి ప్రాజెక్టు నిండడంతో ఇరిగేషన్​శాఖ మంత్రి ఉత్తమ్​కుమార్​రెడ్డి ఆదేశాల మేరకు ఆఫీసర్లు ఇక్కడి నుంచి మిడ్​మానేరుకు వాటర్ లిఫ్టింగ్ ప్రారంభించారు. శనివారం మధ్యాహ్నం ఒంటి గంటకు నందిమేడారం పంపుహౌస్​లోని రెండు మోటార్లు ఆన్ చేశారు. సాయంత్రానికి మరో రెండు మోటార్లు ఆన్ చేసి 12,600 క్యూసెక్కులు లిఫ్ట్ చేశారు. దాన్ని మళ్లీ 6,300 క్యూసెక్కులకు తగ్గించారు. సాయంత్రం 6 గంటలకు 12,931 క్యూసెక్కులకు పెంచారు. ఎల్లంపల్లి నుంచి నంది పంపుహౌస్ ద్వారా నందిమేడారం రిజర్వాయర్ నింపడంతో పాటు లక్ష్మీపూర్ గాయత్రి పంపుహౌస్ నుంచి కెనాల్స్ ద్వారా మిడ్ మానేరుకు పంపిస్తున్నారు. మరోవైపు హైదరాబాద్ మెట్రో వాటర్ సప్లై స్కీమ్​కు ఎల్లంపల్లి నుంచి 331 క్యూసెక్కులు రిలీజ్ చేస్తున్నారు. 

ఎల్లంపల్లికి ఎత్తిపోస్తే మళ్లీ కిందికే..  

మేడిగడ్డ నుంచి అన్నారం,  సుందిళ్ల, ఎల్లంపల్లికి, అక్కడి నుంచి మల్లన్న సాగర్​వరకు నీళ్లు ఎత్తిపోయాలని బీఆర్ఎస్​ లీడర్లు కొద్ది రోజులుగా డిమాండ్ చేస్తున్నారు. ఇటీవల బీఆర్ఎస్​వర్కింగ్​ప్రెసిడెంట్​కేటీఆర్​ఆధ్వర్యంలో ఆ పార్టీ ఎమ్మెల్యేలు, లీడర్లు మేడిగడ్డ టూర్​ చేపట్టి.. ఆగస్టు 2లోగా మేడిగడ్డ వద్ద పంపులు ఆన్​చేయాలని, లేదంటే తామే రైతులతో తరలివచ్చి ఆన్​చేస్తామని హెచ్చరించారు. 

అయితే ఎన్డీఎస్​ఏ సూచన మేరకే మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల గేట్లు ఓపెన్ ఉంచామని.. మేడిగడ్డ నుంచి నీళ్లు ఎత్తిపోయడం సాధ్యం కాదని ఇంజినీర్లు చెప్తున్నా బీఆర్ఎస్ నేతలు మాత్రం ప్రభుత్వంపై విమర్శలు కొనసాగిస్తూ వచ్చారు.  కానీ తాజాగా పైనుంచి వచ్చిన వరదతోనే ఎల్లంపల్లి నిండింది. దీంతో ఒకవేళ మేడిగడ్డ నుంచి ఎత్తిపోసినా ఆ నీళ్లంటినీ కిందికి వదలాల్సి వచ్చేదని ఇంజినీర్లు చెబుతున్నారు.

అప్పుడు కోట్ల రూపాయల కరెంట్​బిల్లులు సర్కార్ మీద పడేవంటున్నారు. గోదావరికి ఏటా జులై, ఆగస్టు మాసాల్లో భారీ వరదలు వస్తున్నాయి. ఆలోపు మేడిగడ్డ నుంచి ఎల్లంపల్లికి ఎత్తిపోస్తే, పైనుంచి వరద వచ్చాక లిఫ్టు చేసిన నీళ్లన్నీ కిందికి వదలాల్సి వస్తున్నది. గత నాలుగేండ్లలో బీఆర్ఎస్​సర్కార్ మేడిగడ్డ నుంచి ఎల్లంపల్లికి దాదాపు 160 టీఎంసీల నీటిని ఎత్తిపోస్తే, అందులో దాదాపు 100 టీఎంసీల నీటిని వృథాగా వదిలేసిన 
సంగతి తెలిసిందే.