పేలిన టీవీఎస్ ఎలక్ట్రిక్ స్కూటీ.. కొని మూడు నెలలే.. జగిత్యాలలో ఘటన

జగిత్యాల: జగిత్యాల రూరల్ మండలం బాలపల్లి గ్రామంలో ఎలక్ట్రిక్ స్కూటర్ బ్యాటరీ పేలింది.  బాలపల్లికి  చెందిన భేతి తిరుపతి రెడ్డి మూడు నెలల క్రితం టీవీఎస్ కంపెనీకి చెందిన ఎలక్ట్రిక్ స్కూటీ కొనుగోలు చేశాడు. రోజూలానే ఇవాళ ఉదయం(గురువారం, నవంబర్ 21) తన ఇంటి కాంపౌండ్ లోపల ఎప్పటి లానే స్కూటర్కు చార్జింగ్ పెట్టి వేరే పనుల్లో నిమగ్నమయ్యాడు. స్కూటీకి చార్జింగ్ పెట్టిన కొద్దిసేపటికి బ్యాటరీ పేలి ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. ప్రమాదంలో ఇంటి తలుపులు పాక్షికంగా ధ్వంసమయ్యాయి. స్కూటీ పూర్తిగా కాలిపోయింది. ఫైర్ సిబ్బందికి సమాచారం అందించడంతో మంటలను అదుపులోకి తెచ్చారు.

తెలంగాణ ప్రభుత్వం కాలుష్యాన్ని తగ్గించే సదుద్దేశంతో ఎలక్ట్రిక్ వాహనాలను కొనాలని పిలుపునిస్తున్న సమయంలో ఇలా ఎలక్ట్రిక్ స్కూటీలు పేలిపోతున్న ఘటన వెలుగులోకి రావడం ఆందోళన కలిగించే విషయం. లీటర్ పెట్రోల్ ధర 110 రూపాయలకు పైగానే ఉన్న ఈరోజుల్లో ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోలు వైపు వాహనదారులు మొగ్గుచూపుతున్నారు. కానీ.. ఇలా అడపాదడపా ఎలక్ట్రిక్ స్కూటర్లు పేలిపోతున్న ఘటనలు కొనుగోలుదారులను ఆలోచనలో పడేస్తు్న్నాయి.