2024.. ఎన్నికల నామ సంవత్సరం

కొత్త ఏడాది వస్తుందంటే చాలు.. అందరిలోనూ ఏదో తెలియని ఉత్సాహం కనిపిస్తుంది. కొత్త టార్గెట్లు పెట్టుకుంటారు. రెజల్యూషన్​లు​ తీసుకుంటారు. ఏదెలా ఉన్నా ఇవ్వాళ్టితో 2023కి గుడ్​బై చెప్పి... 2024కి వెల్​కం చెప్పబోతున్నాం. ఇంతకీ 2024  ఏం తీసుకొస్తుందేంటి? అంటే... మిగతా వాటి సంగతేమో కానీ... ఎన్నికలు తీసుకొస్తుందని మాత్రం ఈజీగా చెప్పొచ్చు. 

ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది ప్రజల భవిష్యత్తు నిర్ణయించబోతోంది. వ్యక్తులకు ఉన్నట్టే 2024లో ప్రపంచానికి కొన్ని లక్ష్యాలు ఉన్నాయి. వాటిని సాధించే క్రమంలో కొన్ని సవాళ్లు కూడా ఎదుర్కోవలసి ఉంటుంది. ఆ సవాళ్లలో ప్రధానమైనవి ఎన్నికలు. ఈ సవాల్​ను ఎదుర్కొని సరైన నాయకులను ఎన్నుకుంటే.. మానవ, ప్రపంచ ప్రగతికి కొత్త దారులు ఏర్పడుతాయి. లేదంటే.. ఏడాది మారినా ప్రజల జీవితాల్లో మాత్రం మార్పులు రావు. 

ప్రపంచంలో దాదాపు 40 దేశాల్లో 3.7 బిలియన్ల కంటే ఎక్కువ మంది ప్రజలు వాళ్ల నాయకులను ఎన్నుకునే ఏడాది ఇది. ప్రపంచ జనాభాలో దాదాపు సగం మంది వాళ్ల తల రాతలను మార్చే అధ్యక్ష లేదా శాసనసభ ప్రతినిధులను ఎన్నుకోనున్నారు. ఎన్నికల తీర్పు ప్రజల జీవితాలపై ప్రభావం చూపిస్తుందనేది నిర్వివాదాంశం. అందుకే రాబోయే ఏడాది యావత్‌ ప్రపంచానికి ఎంతో కీలకం. అవి రాబోయే దశాబ్దపు గమనాన్ని మారుస్తాయా? మరిన్ని చిక్కులు తెచ్చిపెడతాయా? అనేది తెలియాలంటే ఇంకొన్నాళ్లు వెయిట్‌ చేయాల్సిందే.

ప్రపంచంలో గొప్ప శక్తిగా చెప్పుకుంటున్న యునైటెడ్ స్టేట్స్, అప్పట్లో ఓ వెలుగు వెలిగిన రష్యా, అత్యధిక జనాభా కలిగిన దేశం ఇండియా, అతిపెద్ద వాణిజ్య కూటమి యూరోపియన్ యూనియన్, అతిపెద్ద ముస్లిం దేశం ఇండోనేసియా, అతిపెద్ద స్పానిష్ మాట్లాడే దేశం మెక్సికో ఎన్నికలకు సిద్ధమవుతున్నాయి.

ఈ ఎన్నికల్లో గెలిచే ప్రభుత్వాలు 2028 –2030ల మధ్య వరకు కొనసాగుతాయి. 2030 వరకు కొనసాగే రష్యా అధ్యక్ష ఎన్నిక మార్చిలో జరగనుంది. 2024 ఏప్రిల్, మే మధ్య 2029 వరకు దేశానికి నాయకత్వం వహించే ప్రభుత్వాన్ని ఎన్నుకునేందుకు మన దేశం రెడీ అవుతోంది. జూన్, జులైలో, యూరోపియన్ యూనియన్ బ్లాక్- కొత్త యూరోపియన్ కమిషన్‌ని ఎన్నుకుంటుంది. యు.ఎస్.ఎ. ద్వైవార్షిక శాసనసభ ఎన్నికలు, అధ్యక్ష ఎన్నికలు నవంబర్‌లో జరుగుతాయి. వచ్చే జనవరిలో జరగనున్న తైవాన్ అధ్యక్ష ఎన్నికల మీద అందరికీ ఆసక్తి ఉంది. 

మొత్తంగా15 ఆఫ్రికన్ దేశాలు, 9 అమెరికన్ దేశాలు, 11 ఆసియా దేశాలు, 22 యూరోపియన్ దేశాలు, ఓసీనియాలోని నాలుగు దేశాలు ఎన్నికలకు వెళ్లనున్నాయి. అంతేకాకుండా ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి ఎన్నికలు కూడా జరుగుతాయి. ఆసియా–పసిఫిక్ గ్రూప్‌కు, లాటిన్ అమెరికా, కరేబియన్లకు, పశ్చిమ యూరోపియన్ గ్రూప్‌కి కూడా ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. అయితే.. కొన్ని దేశాల ఎన్నికల ఫలితాలు, మార్పుల గురించి తెలుసుకునేందుకు యావత్‌ ప్రపంచం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. అందుకు కారణం ఆ దేశాల్లో గెలిచే అధినేతల నిర్ణయాలు ప్రపంచం మీద కూడా  ఎఫెక్ట్‌ చూపించడమే. 

ఐరోపాలో...

ఐరోపాలోని కొన్ని దేశాల్లో పార్లమెంటరీ ఎన్నికల తర్వాత కొత్త ఈయూ కమిషన్ ఎన్నికతో పాటు, బ్రిటన్‌‌లో కూడా ఎన్నికలు జరగనున్నాయి. అక్కడ కన్జర్వేటివ్‌‌లు14 ఏండ్లు ప్రభుత్వాన్ని నడిపించారు. కానీ.. ఇప్పుడు అధికారాన్ని కోల్పోయే అవకాశం ఉందంటున్నారు ఎక్స్‌‌పర్ట్స్‌‌. అంతేకాదు.. బ్రిటన్‌‌లో ముందస్తు ఎన్నికలు వచ్చే ప్రమాదం కూడా ఉంది. ఇప్పటికే ఉన్న సమస్యల వల్ల వచ్చే ఏడాది ఈయూ బడ్జెట్ మీద ఒత్తిడి పెరగొచ్చనేది ఎక్స్‌‌పర్ట్స్‌‌ అంచనా. ఈయూకి ఉక్రెయిన్ యుద్ధం‌‌ కూడా పెద్ద తలనొప్పిగా ఉంది. 

మన దేశంలో...

మన దేశం విషయానికి వస్తే.. నరేంద్ర మోదీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం వరుసగా మూడోసారి అధికారంలోకి రావాలని ప్రయత్నిస్తోంది. మరో వైపు కాంగ్రెస్‌‌ కూడా గట్టి పోటీని ఇస్తోంది. ఈ రెండు ప్రధాన పార్టీల్లో అధికారం ఏ పార్టీకి దక్కుతుందో వేచి చూడాలి. మోదీ ప్రభుత్వం మళ్లీ ఏర్పడితే.. బిజినెస్‌‌ ఫ్రెండ్లీ సంస్కరణలను కొనసాగిస్తుందని, రష్యా–ఉక్రెయిన్ యుద్ధం వంటి కొన్ని అంశాల్లో తటస్థంగా ఉంటూనే అంతర్జాతీయంగా ఎక్కువ ప్రభావాన్ని చూపెడుతుంది అంటున్నారు ఎక్స్‌‌పర్ట్స్‌‌. 

మెక్సికోలో మహిళ

ప్రజాస్వామ్య స్ఫూర్తితో జూన్‌లో జరగనున్న మెక్సికో ఎన్నికల్లో ఆ దేశానికి మొదటి మహిళా అధ్యక్షురాలి ఎంపిక జరిగే అవకాశం ఉంది. మెక్సికోలో ఉన్న పురుషాధిపత్య రాజకీయంలో మొదటి సారి ఒక మహిళ పోటీలో ఉంది. ప్రస్తుతం అధ్యక్షుడిగా ఉన్న ఆండ్రెస్ మాన్యుయెల్ లోపెజ్ ఒబ్రాడోర్ మోరెనా పదవీ కాలం ముగియడంతో ఆ పార్టీ ఈసారి మెక్సికో సిటీ మాజీ మేయర్ క్లాడియా షీన్‌బామ్ అధ్యక్ష బరిలో నిలిచే అవకాశం ఇచ్చింది. 

అమెరికాలో ...

ఇండియన్స్‌ ఎక్కువగా ఉండే అమెరికా ఎన్నికల మీద అమెరికా, ఇండియాలతోపాటు యావత్‌ ప్రపంచం ఆసక్తి చూపిస్తోంది. ఎందుకంటే.. అమెరికాకు ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాల నుంచి విద్య, ఉద్యోగాల కోసం వెళ్తుంటారు. అక్కడ ఎన్నికైన ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలే ఆ దేశానికి ఎంట్రీని సులభం లేదా కఠినం చేస్తాయి. ఆ నిర్ణయాలే ఆ దేశంలోని ప్రవాస భారతీయుల ఫ్యూచర్‌‌ని డిసైడ్‌ చేస్తాయి. దాంతోపాటు వీసాల సంఖ్య పెంపు, గ్రీన్‌కార్డుల జారీ లాంటివి కూడా ప్రభుత్వం చేతిలోనే ఉంటాయి. 

వచ్చే ఏడాది నవంబర్‌లో అమెరికా ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో డెమోక్రటిక్‌ పార్టీ తరఫున ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్‌ మరోసారి అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాడు. అమెరికన్లు ఆయనపై మరోసారి నమ్మకం పెట్టుకుంటారా? లేదా? అనేది తేలాల్సి ఉన్నది. రిపబ్లికన్‌ పార్టీ తరఫున77 ఏండ్ల మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ మరోసారి బరిలోకి దిగుతున్నాడు. కానీ.. కొన్ని అభియోగాల వల్ల అక్కడి కోర్టు ఆయనపై అనర్హత వేటు వేసింది. కానీ.. పైకోర్టులకు అప్పీల్‌ చేసుకుంటే  మళ్లీ అర్హత సాధించే అవకాశాలు ఉన్నాయి.  

రిపబ్లికన్‌ పార్టీ నుంచి పోటీ చేసేందుకు ఇండియన్ ఆరిజన్ బిజినెస్‌మ్యాన్‌ వివేక్‌ రామస్వామి కూడా బరిలో ఉన్నాడు. ప్రస్తుత ప్రెసిడెంట్ జోబైడెన్‌ ఉక్రెయిన్‌కు ఆర్మీ పరంగా ఎక్కువ సాయం చేస్తున్నాడని విమర్శలు ఉన్నాయి. ఈ సాకుతో  రిపబ్లికన్‌ పార్టీ అధికారం దక్కించుకునే అవకాశం ఉంది. అదే జరిగితే.. ఆ ప్రభావం రష్యా–ఉక్రెయిన్‌ యుద్ధంపై మీద కూడా పడుతుంది. 

మరెన్నో మార్పులు 

దెబ్బతిన్న చైనా–తైవాన్ సంబంధాల నేపథ్యంలో తైవాన్‌ ఎన్నికలు ఆసక్తిగా మారాయి. అక్కడ ఇప్పుడున్న ప్రతిపక్షం గెలిస్తే..  తైవాన్– చైనాల మధ్య ఉద్రిక్తతలు తక్కువ టైంలోనే తగ్గే అవకాశం ఉంది. తైవాన్ జలసంధి అంతటా ఆర్థిక సమైక్యత సాధ్యమవుతుంది. దక్షిణాఫ్రికా ఎన్నికలు కూడా ఆసక్తిని పెంచుతున్నాయి. భూటాన్‌లో ఇప్పటికే మొదటి విడత ఎన్నికలు ముగిశాయి. 

జనవరి 9, 2024న రెండో విడత ఎన్నికలు జరగనున్నాయి. రక్షణ పరంగా భారత్‌కు భూటాన్‌ ముఖ్యమైన దేశం. అక్కడ జరిగిన మొదటి విడత ఎన్నికల్లో భారత్‌కు అనుకూలంగా వ్యవహరించే పీడీపీ పార్టీ ముందంజలో ఉంది. వీటితో పాటు అస్థిర అణుశక్తులైన పాకిస్తాన్, ఇరాన్ శాసనసభ ఎన్నికలు కూడా 2024లోనే ఉన్నాయి. వెనిజులాలో కూడా అధ్యక్ష ఎన్నికలు జరుగుతాయి.
 
యుద్ధంతో విసిగిపోయిన ఉక్రెయిన్‌లో జెలెన్​స్కీ అధికారం మార్చి 2024లో ముగుస్తుంది. కానీ.. ఎన్నికలు నిర్వహిస్తారా? లేదా? అనేది తెలియాలంటే వేచి చూడాలి. 2024లో జరిగే ప్రధాన ఎన్నికలు ప్రపంచ ప్రజాస్వామ్యానికి ఒక ముఖ్యమైన పరీక్ష లాంటివి. అనేక ఆఫ్రికన్ దేశాల్లో ఇప్పటికే తిరుగుబాట్లు జరుగుతున్నాయి. ఇలాంటి టైంలో ఆ దేశాల్లో ఎన్నికలు వస్తే.. మరిన్ని ఎదురుదెబ్బలు తగిలే ప్రమాదం ఉంది. అనేక సమాజాలు ఆరోగ్యకరమైన ప్రజాస్వామ్య వాతావరణం నుంచి దుర్భలమైన పరిస్థితుల్లోకి పడిపోయే అవకాశాలు లేకపోలేదు.  

రష్యాలో పరిస్థితి 

కొంతకాలంగా ఉక్రెయిన్‌తో యుద్ధం చేస్తున్న రష్యాలో కూడా 2024 మార్చిలో ఎన్నికలు జరగనున్నాయి. వ్లాదిమిర్‌ పుతిన్‌ ఇప్పటివరకు 5 టర్మ్స్‌ పదవిలో ఉన్నారు. ప్రైమ్‌ మినిస్టర్‌‌, ప్రెసిడెంట్‌గా 23 ఏండ్లు పనిచేశాడు. ఇప్పుడు కూడా ఎన్నికల బరిలో నిలుస్తున్నట్టు ఇప్పటికే ప్రకటించాడు. అంతేకాదు.. 71 ఏండ్ల పుతిన్‌ మరోసారి అధికారం దక్కించుకే అవకాశం ఉంది. ఎందుకంటే.. ఉక్రెయిన్‌ యుద్ధాన్ని సాకుగా చూపించి ఇప్పటికే తన రాజకీయ ప్రత్యర్థులను చెల్లాచెదురు చేశాడు. చిరకాల ప్రత్యర్థి నావెల్నీని ఇప్పటికే జైలుకు పంపాడు. దీంతో ఆయనపై పోటీ పడేందుకు సరైన ప్రత్యర్థులే లేకుండా పోయారు.