పెరిగిపోతున్న ఎన్నికల ఖర్చు..  కోటీశ్వరులే పోటీలో!

ప్రజాస్వామ్యంలో ఎన్నికలు అతి ముఖ్యమైన ఘట్టం. మన దేశంలో ఐదేండ్లకు ఒకసారి ఎన్నికల్లో ఓటు వేసి నాయకులను ఎన్నుకుంటాం. అయితే రాను రాను ఎన్నుకున్న నాయకులు ప్రజాసేవకుల స్థాయి నుంచి ప్రజాపాలకులుగా మారి అధికారాన్ని చేజిక్కించుకున్న తరువాత అక్రమాలకు తెరలేపి పెద్ద ఎత్తున ధనార్జన చేస్తున్నారు. ఒకసారి శాసనసభ్యుడు అయితే చాలు మూడు తరాలకు సరిపడే డబ్బు సంపాదిస్తున్నాడు.

50వ దశకంలో జరిగిన మొదటి రెండు ఎన్నికలలో అభ్యర్థులు చాలావరకు స్వాతంత్ర్యోద్యమంలో పాల్గొన్నవాళ్లే. ప్రజలు వారి సేవలను గుర్తించి ఎన్నుకునేవారు. అప్పట్లో ఓటర్లకు డబ్బు, మద్యం పంచడం కానీ.. వారిని ప్రలోభపెట్టి రకరకాల తాయిలాలు (ఉచితాలు) పంచడం గానీ జరగలేదు. అందుకే కాబోలు ఒక శాసనసభ్యుడి ఎన్నికల ఖర్చు ఐదు వేల రూపాయలకు మించేది కాదు. 

కోటీశ్వరులే పోటీలో!

తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలు కేవలం కోటీశ్వరులకు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. భారతదేశంలో ఎక్కడా లేని విధంగా ఇక్కడ అభ్యర్థులు ఖర్చు చేస్తారు. కొన్ని రిజర్వ్‌‌‌‌డ్‌‌ నియోజకవర్గాలు తప్ప మిగిలిన అన్ని నియోజకవర్గాల్లో కోటీశ్వరులు మాత్రమే ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. రాష్ట్రంలో నేడు ఒక శాసనసభ్యుడి ఎన్నిక ఖర్చు ఆ నియోజకవర్గ పరిస్థితిని బట్టి పాతిక నుంచి 100 కోట్ల వరకు ఉంది. భారత ఎన్నికల కమిషన్ ఆదేశాల ప్రకారం మన రాష్ట్రంలో ఒక అభ్యర్థి ఎన్నికల ఖర్చు 40 లక్షల కంటే మించకూడదు.