కాంగ్రెస్​కే చాన్స్!.. పాలమూరు లోకల్​బాడీ ఎమ్మెల్సీ బైపోల్ షెడ్యూల్​ విడుదల 

  • మార్చి 4 నుంచి నామినేషన్లు .. 28న పోలింగ్​
  • కాంగ్రెస్ టికెట్ కోసం హర్షవర్ధన్​ ప్రయత్నాలు 
  • మన్నే జీవన్​రెడ్డి వైపు హైకమాండ్​ మొగ్గు 
  • బీఆర్​ఎస్​నుంచి పోటీకి ఆసక్తి చూపని లీడర్లు​
  • పార్టీతీరుపై ఎంపీటీసీలు, కౌన్సిలర్లు నారాజ్​ 

మహబూబ్​నగర్​, వెలుగు : మహబూబ్​నగర్​ లోకల్​ బాడీల ఎమ్మెల్సీ బై ఎలక్షన్స్ కు ఎన్నికల సంఘం షెడ్యూలు జారీ చేసింది. మార్చి 4న నోటిఫికేషన్​ రిలీజ్​ చేయనుంది. ఇక్కడ నుంచి 2021లో ఎమ్మెల్సీగా ఎన్నికయిన కసిరెడ్డి నారాయణరెడ్డి ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కల్వకుర్తి ఎమ్మెల్యేగా గెలుపొందారు. దీంతో డిసెంబరు 8న తన పదవికి రాజీనామా చేయడంతో ఈ స్థానం ఖాళీ కాగా ఉప ఎన్నిక అనివార్యమైంది. సోమవారం షెడ్యూలు రిలీజ్​ కావడంతో ఉమ్మడి మహబూబ్​నగర్​ జిల్లాలో ఎన్నికల కోడ్​ అమల్లోకి వచ్చింది. మార్చి 4న ఎన్నికల నోటిఫికేషన్​ జారీ చేస్తారు. మార్చి 4 నుంచి 11 వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. 12న నామినేషన్ల స్క్రూటినీ జరుగుతుంది. 14 వరకు నామినేషన్లు విత్ ​డ్రా చేసుకునేందుకు అవకాశం ఉంటుంది.

మార్చి 28న ఉదయం 8 నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్​ నిర్వహిస్తారు. ఏప్రిల్​ 2న ఓట్ల లెక్కిస్తారు. ఏప్రిల్​4 నాటికి ఎన్నికల ప్రక్రియ పూర్తి చేస్తారు. ఉమ్మడి మహబూబ్​నగర్​పరిధిలోని ​ ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, మున్సిపల్ కౌన్సిలర్లు, ఎమ్మెల్యేలు లోకల్​ బాడీ ఎన్నికలకు ఓటర్లుగా ఉంటారు. ఉమ్మడి జిల్లాలో1,221మంది ఓటర్లు ఉండగా, అందులో 776 మంది ఎంపీటీసీలు, 71 మంది జడ్పీటీసీలు, 374 మంది మున్సిపల్​ కౌన్సిలర్లు, 14 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు.

కాంగ్రెస్​కే చాన్స్​ 

స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానాన్ని కాంగ్రెస్​పార్టీ చేజిక్కించుకునే అవకాశం ఉంది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లోఉమ్మడి పాలమూరు జిల్లాలోని 14 కు గాను 12 స్థానాల్లో కాంగ్రెస్​అభ్యర్ధులే గెలిచారు. అసెంబ్లీ ఎన్నికల తర్వాత లోకల్​బాడీలకు చెందిన ప్రజాప్రతినిధులు పెద్ద ఎత్తున కాంగ్రెస్​లోకి వలస వచ్చారు. .అసెంబ్లీ ఎన్నికల అనంతరం ఊపు మీదున్న కాంగ్రెస్​నుంచి బరిలో దిగేందుకు అభ్యర్ధులు పోటీ పడుతున్నారు. ప్రస్తుతం కాంగ్రెస్​ పార్టీ స్పోక్స్ పర్సన్​గా వ్యవహరిస్తున్న టీపీఆర్ టీయూ వ్యవస్థాపక అధ్యక్షుడు గాల్​రెడ్డి హర్షవర్ధన్​ రెడ్డి ఆసక్తిగా ఉన్నారు.

నిరుడు ఆయన టీచర్​ ఎమ్మెల్సీగా పోటీ చేసినా ఫలితం దక్కలేదు. నారాయణపేట నుంచి అసెంబ్లీ టికెట్​ఆశించినా నిరాశే ఎదురైంది. ఇటీవల కాంగ్రెస్​లో చేరిన ఎంఎస్​ఎన్​ ఫార్మా కంపెనీల అధినేత మన్నే జీవన్​ రెడ్డిని పోటీ చేయించాలని పార్టీ నేతలు భావిస్తున్నట్టు తెలుస్తోంది. గత నెలలో ఆయన సీఎం రేవంత్​ రెడ్డి ఆధ్వర్యంలో ఢిల్లీలో ఏఐసీసీ చీఫ్​మల్లికార్జున్​ ఖర్గే సమక్షంలో పార్టీలో చేరారు. ఆయన పార్లమెంట్ టికెట్​ఆశిస్తుండగా.. ఎమ్మెల్సీ అవకాశం ఇస్తామని ఆయన పార్టీలో చేరినప్పుడేహైకమాండ్​ హామీ ఇచ్చినట్టు తెలుస్తోంది. 

బీఆర్​ఎస్ సైలెన్స్ 

స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా కసిరెడ్డి నారాయణరెడ్డి బీఆర్ఎస్ నుంచి ఎన్నికయ్యారు. ఆయన కల్వకుర్తి నుంచి అసెంబ్లీకి పోటీ చేయాలని ఆశించగా బీఆర్ఎస్ టికెట్ ఇవ్వలేదు. దాంతో బీఆర్ఎస్ కు రాజీనామా చేసి కాంగ్రెస్​లో చేరారు. కల్వకుర్తి నుంచి కాంగ్రెస్​ ఎమ్మెల్యేగా గెలిచారు. ఉప ఎన్నికల్లో బీఆర్​ఎస్​ నుంచి ఎవరు పోటీ చేస్తారన్నది ఆసక్తిగా మారింది. 2021 ఎన్నికల్లో ఉమ్మడి పాలమూరు జిల్లాలోని రెండు లోకల్​బాడీ స్థానాలకు గాను బీఆర్ఎస్​ నుంచి కసిరెడ్డి నారాయణరెడ్డి, కూచుకుల్ల దామోదరరెడ్డికి అవకాశమిచ్చారు. దామోదరరెడ్డి స్థానంలో మొదట మహబూబ్​నగర్​ బీఆర్ఎస్​ జిల్లా అధ్యక్షుడు బాద్మ శివకుమార్​

గాయకుడు సాయిచంద్​కు అవకాశం ఇస్తారని భావించారు. ఒక దశలో సాయిచంద్​ పేరు ఖరారు చేసినా చివరి నిమిషంలో ఆయనను తప్పించి దామోదరరెడ్డికి అవకాశం ఇచ్చారు. అయితే , ఈ సారి బీసీలకు చాన్స్​ ఇస్తారని ప్రచారం జరుగుతున్నా పోటీకి ఎవరూ పెద్దగా ఆసక్తి చూపడంలేదు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత పెద్ద లీడర్లు ఎవరూ జిల్లా రాజకీయాల్లో చురుగ్గా ఉండడంలేదు. దీనికితోడు ఎన్నికల్లో భారీగా ఖర్చు చేయాల్సివస్తుందన్న కారణంగా నేతలు వెనక్కి తగ్గుతున్నట్టు తెలుస్తోంది. 

ఎంపీటీసీలు, కౌన్సిలర్లు నారాజ్​

బీఆర్​ఎస్​ అధికారంలో ఉన్నప్పుడు హైకమాండ్​ తీరుపై ఆ పార్టీ ఎంపీటీసీలు, కౌన్సిలర్లు నారాజ్​తో ఉన్నారు. చేసిన పనులకు బిల్లులు రాక అప్పుల్లో కూరుకుపోయామన్న ఆగ్రహంతో ఉన్నారు. 2021లోనే కొందరు ఎంపీటీసీలు రెబల్​గా బరిలోకి దిగేందుకు నామినేషన్లు వేయగా చివరి నిమిషంలో వారిని బుజ్జగించి విత్​ డ్రా చేయించారు. ఉమ్మడి జిల్లాలో మొన్నటి ఎన్నికల్లో బీఆర్​ఎస్​ ఘోరంగా ఓడిపోయింది. మున్సిపాల్టీల్లో కౌన్సిలర్లు తిరుగబాటు ప్రకటించారు.

మహబూబ్​నగర్​, కోస్గి మున్సిపాల్టీల్లో బీఆర్​ఎస్​ వాళ్లే అవిశ్వాసాలు పెట్టగా రెండింటిని కాంగ్రెస్​ కైవసం చేసుకుంది. మరికొందరు కౌన్సిలర్లు బీఆర్​ఎస్​కు రాజీనామా చేసి కాంగ్రెస్​లో చేరారు. లోకల్​బాడీ ప్రజాప్రతినిధులు చాలామంది కాంగ్రెస్​ ఎమ్మెల్యేలకు టచ్​లో ఉన్నట్టు చెప్తున్నారు. దీంతో ఈ ఎన్నికల్లో కాంగ్రెస్​కే గెలిచే చాన్స్​ఉంటుందన్న ప్రచారం జరుగుతోంది.