బతికుండగానే శ్మశానంలో పడేశారు! 

  • వృద్ధురాలి బంధువుల అమానుషం
  • సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లిలో ఘటన

తంగళ్ళపల్లి, వెలుగు : బతికుండానే వృద్ధురాలిని బంధువులు శ్మశానంలో పడేసిన అమానుష ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లాలో జరిగింది. స్థానికులు తెలిపిన ప్రకారం.. తంగళ్లపల్లి మండల కేంద్రానికి చెందిన కూకట్ల రాజవ్వ(75) శానిటేషన్  కార్మికురాలిగా పని చేసింది. కొంతకాలం కింద ఆమె భర్త మరణించాడు. పిల్లలు లేకపోవడంతో ఆమె తన అన్న ఇంట్లో ఉంటుంది. కొద్ది రోజుల కింద రాజవ్వ అనారోగ్యంతో మంచం పట్టింది. దీంతో మేనల్లుడు తిరుపతి  తీసుకెళ్లి శ్మశానంలో పడేసి వెళ్లిపోయాడు.

గ్రామస్తులు రాజవ్వ పరిస్థితి చూసి మంగళవారం మేనల్లుడిని నిలదీయగా.. ఆమె సోదరి పిల్లలు తాము చూసుకుంటామని తీసుకెళ్లారని.. అయితే.. శ్మశానంలో వదిలేసి వెళ్లారని చెప్పాడు. ఇలా బతికుండగానే అన్న, సోదరి పిల్లలు శ్మశానానికి చేర్చిన ఘటన  స్థానికులను కలచివేసింది. సమాచారం అందడంతో పోలీసులు వెళ్లి ఆరా తీశారు. రాజవ్వ బంధువులతో మాట్లాడి ఆమె బాగోగులు చూసుకునేలా ఒప్పించేందుకు ప్రయత్నిస్తున్నారు. లేదంటే ఏదైనా వృద్ధాశ్రమంలో చేర్పించే అవకాశం ఉంది.