సమాచారం లేకుండా మూసీ గేట్లు ఓపెన్‌‌‌‌‌‌‌‌.. నీటిలో చిక్కుకున్న కూలీలు

  • మూడు గంటలపాటు శ్రమించి ఒడ్డుకు చేర్చిన పోలీసులు 
  • నీటిలో కొట్టుకుపోయిన 20 పశువులు

సూర్యాపేట, వెలుగు : ఆఫీసర్లు ఎలాంటి ముందస్తు హెచ్చరికలు చేయకుండా మూసీ ప్రాజెక్ట్‌‌‌‌‌‌‌‌ గేట్లను ఓపెన్‌‌‌‌‌‌‌‌ చేయడంతో ఎనిమిది మంది కూలీలు నీటిలో చిక్కుకున్నారు. స్థానికులు, పోలీసులు మూడు గంటల పాటు శ్రమించి అందరికీ ఒడ్డుకు చేర్చారు. కానీ వరద ఉధృతికి 20 పశువులు కొట్టుకుపోయాయి. ఈ ఘటన నల్గొండ జిల్లా కేతేపల్లి మండలం భీమారంలో ఆదివారం జరిగింది. హైదరాబాద్ నగరంలో భారీ వర్షం పడడంతో మూసీ ప్రాజెక్ట్‌‌‌‌‌‌‌‌కు వరద ఉధృతి పెరిగింది.

 రిజర్వాయర్‌‌‌‌‌‌‌‌ పూర్తిస్థాయి నీటిమట్టానికి చేరుకోవడంతో ఆదివారం మధ్యాహ్నం ఆఫీసర్లు ఎలాంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండా, కేవలం సైరన్‌‌‌‌‌‌‌‌ మోగించి మూడు గేట్లను ఓపెన్‌‌‌‌‌‌‌‌ చేసి 4,400 క్యూసెక్కుల నీటిని దిగువకు వదిలారు. దీంతో ప్రాజెక్ట్‌‌‌‌‌‌‌‌ దిగువన కేతేపల్లి మండలం భీమారం సమీపంలో మూసీలో పశువులను మేపుతున్న కాపరులు, ఇసుక తీసేందుకు వెళ్లిన కూలీలు నీటిలో చిక్కుకున్నారు. వరద ఒక్కసారిగా చుట్టుముట్టడంతో 20 పశువులు కొట్టుకుపోగా ఎనిమిది మంది నీటిలో చిక్కుకుపోయారు. వీరంతా మూసీ మధ్యలో ఉన్న ఓ పెద్ద బండరాయిని ఎక్కి సహాయం కోసం కేకలు వేశారు. 

సమీపంలోని రైతులు గమనించి జేసీబీ సాయంతో ఆరుగురిని ఒడ్డుకు చేర్చారు. కానీ భీమారానికి చెందిన గంగయ్య, బాలయ్య నీటిలో నుంచి బయటకు రాలేకపోవడంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. కేతపల్లి పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని, మూసీ ప్రాజెక్ట్‌‌‌‌‌‌‌‌ ఆఫీసర్లకు సమాచారం ఇవ్వడంతో వారు నీటి విడుదలను తగ్గించారు. దీంతో పోలీసులు జేసీబీ సాయంతో వరదలో చిక్కుకున్న మిగిలిన ఇద్దరినీ ఒడ్డుకు తీసుకొచ్చారు. 

కృష్ణా నదిలో కొట్టుకుపోతున్న ముగ్గురిని కాపాడిన మత్స్యకారులు

గద్వాల, వెలుగు : కృష్ణా నదిలో కొట్టుకుపోతున్న ముగ్గురు యువకులను స్థానిక మత్స్యకారులు కాపాడారు. గద్వాల పట్టణానికి చెందిన ముగ్గురు యువకులు ఆదివారం చిన్న అగ్రహారంలోని కృష్ణానది ఒడ్డుకు వెళ్లారు. అక్కడ సరదాగా ఈత కొడుతూ నది మధ్యలో ఓ ప్లేస్‌‌‌‌‌‌‌‌కు చేరుకున్నారు. తర్వాత తిరిగి పుష్కర ఘాట్‌‌‌‌‌‌‌‌కు వస్తుండగా ఈత కొట్టలేక నీటిలో కొట్టుకుపోసాగారు. గమనించిన స్థానిక మత్స్యకారులు గోపి, పరుష, శివకుమార్‌‌‌‌‌‌‌‌, ధర్మరాజ్‌‌‌‌‌‌‌‌ స్పందించి మూడు పుట్టీలను వేసుకొని వెళ్లి యువకులను కాపాడారు.