Health Alert: డ్రై ఐస్ తో జాగ్రత్త, తిన్నారంటే అంతే సంగతి..!

డ్రై ఐస్ గురించి అందరూ వినే ఉంటారు. ఐస్ క్రీమ్స్ ని, మెడిసిన్స్ ని ప్యాక్ చేసినప్పుడు వాటిని చల్లగా ఉంచటం కోసం ఈ డ్రై ఐస్ ని వాడుతుంటారు. ఇది చూడటానికి సాధారణ ఐస్ లాగానే కనిపించినప్పటికీ నార్మల్ ఐస్ కి, డ్రై ఐస్ కి చాలా తేడా ఉంది. డ్రై ఐస్ ని పొరపాటున తిన్నామంటే మన ప్రాణానికే ప్రమాదం సంభవించే అవకాశం ఉంది. ఇటీవల గుర్గావ్ లోని ఓ రెస్టారెంట్ లో జరిగిన సంఘటన ఇందుకు  ఉదాహరణగా చెప్పచ్చు. డ్రై ఐస్  -80 డిగ్రీల ఉష్ణోగ్రతతో ఉంటుంది. నార్మల్ ఐస్ ని నోట్లో పెట్టుకోగానే కరిగి నీటి రూపంలోకి వస్తుంది. కానీ, డ్రై ఐస్ ని నాలుక మీద పెట్టుకోగానే అది కార్బన్డయాక్సైడ్ రూపంలోకి మారి నాలుకతో పాటు మన నోటిని డ్యామేజ్ చేస్తుంది.

ఇటీవల గుర్గావ్ లోని ఓ రెస్టారెంట్లో సర్వర్ మౌత్ ఫ్రెష్నర్ కి బదులుగా డ్రై ఐస్ ని కస్టమర్స్ కి సర్వ్ చేశాడు. మౌత్ ఫ్రెష్నర్ అనుకోని డ్రై ఐస్ ని తిన్న ఐదుగురు కస్టమర్స్ కి నోట్లో రక్తస్రావమై పరిస్థితి విషమంగా మారింది. డ్రై ఐస్ ని నోట్లో పెట్టుకోగానే బర్నింగ్ సెన్సేషన్ వచ్చిందని, ఆ తర్వాత నోట్లో రక్తం రావటం స్టార్ట్ అయ్యిందని, కొంత మందికి వాంతులు అయ్యాయని హాస్పిటల్ లో చేరిన కస్టమర్స్ తెలిపారు. డ్రై ఐస్ ని వాడే సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని, దీనిని టచ్ చేయాల్సి వస్తే కూడా చేత్తో కాకుండా చేతికి గ్లౌజ్ కానీ, టవల్ చుట్టుకొని కానీ టచ్ చేయాలని నిపుణులు చెప్తున్నారు. లేకపోతే డ్రై ఐస్ వల్ల ప్రాణానికే ప్రమాదం వచ్చే అవకాశం ఉందని అంటున్నారు.