సమర్థవంతమైన ప్రజాపాలనే.. కాంగ్రెస్​ సర్కార్​ లక్ష్యం

ప్రజాపాలనే కాంగ్రెస్​ ప్రభుత్వ ఆశయం, లక్ష్యం అని, మానవీయ కోణంలో ప్రజలకు సేవలు అందించాలని, ప్రజా సమస్యలను అర్థం చేసుకుని పరిష్కరించి, సామాన్య ప్రజలకు ఎప్పుడూ గుర్తుండేలా పనిచేయాలని అధికారిక సమావేశాలలో ముఖ్యమంత్రి రేవంత్​రెడ్డి తరచుగా మార్గనిర్దేశం చేస్తున్నారు. ఈ దిశగా డా. మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులను సమాయత్తం చేస్తోంది. 

సమాచార హక్కు:  ‘అధికార యంత్రాంగం ప్రజల భాషలో సమాచారం ఇవ్వాలి’ అని సమాచార హక్కు చట్టం నిర్దేశిస్తుంది. అధికార భాషలో సమాచారం కోరే హక్కుని పౌరులకు ఇస్తుంది.  ప్రజాసాధికారతకు పునాది వంటి సమాచార హక్కుపై సందేహ నివృత్తికి తెలుగువారి కోసం ప్రత్యేకంగా హెల్ప్ లైన్​ (917 740 1947, కార్యాలయ వేళల్లో ) సంస్థ నిర్వహిస్తోంది. భారత ప్రభుత్వ పర్సనల్ & ట్రైనింగ్ డిపార్ట్‌‌‌‌మెంట్ సౌజన్యంతో  సమాచార హక్కు చట్టం అమలుకు సంబంధించిన వివిధ అంశాలపై గత సంవత్సరం మొత్తం 47 శిక్షణా కార్యక్రమాలు సంస్థలో,  జిల్లా శిక్షణా కేంద్రాల్లో నిర్వహించగా 1,360 మంది అధికారులు, పౌర సమాజ ప్రతినిధులు శిక్షణ పొందారు.  తెలంగాణ రాష్ట్ర సమాచార కమిషనర్లకు ఓరియెంటేషన్ కార్యక్రమాలను కూడా సంస్థ నిర్వహించింది. 

ప్రచురణలు: సమాచార హక్కుపై తెలుగు, ఇంగ్లీషులో సంస్థ ప్రచురించిన పుస్తకాలు, కరదీపికలు  వెబ్ సైట్ లో (https://www.mcrhrdi.gov.in/rti_publications.html ) అందరికీ అందుబాటులో ఉన్నాయి.  ప్రపంచవ్యాప్తంగా విషయ నిపుణులు, మేధావులు  ఆలోచనలు  పంచుకునేందుకు ఆంగ్లంలో ‘సమృద్ధి’ (ఐఎస్ఎస్ఎన్: 2584-1033)  ఆన్‌‌‌‌లైన్‌‌‌‌ అర్ధ వార్షిక పత్రికను సంస్థ ఆరంభించింది.  గత ఏడాది కాలంలో ‘సమృద్ధి’ మూడు సంచికలు ప్రచురితమయ్యాయి.  తెలంగాణ చరిత్ర, వారసత్వం, సంస్కృతిపై పరిశోధన చేసి ఎపిగ్రాఫియా తెలంగానికా (4 సంపుటాలు) వంటి గ్రంథాలు ప్రచురించింది.

ఫిర్యాదుల సత్వర పరిష్కారం: ప్రజల సమస్యలు, ఫిర్యాదుల సత్వర పరిష్కారం కోసం మహాత్మా జ్యోతిబా పూలే ప్రజా భవన్ లో ప్రభుత్వం సీనియర్ అధికారులతో ‘ప్రజావాణి’   ప్రారంభించింది.  సమర్థవంతమైన ప్రజా ఫిర్యాదుల పరిష్కార యంత్రాంగం కోసం ప్రతి కార్యాలయంలో సమస్యా పరిష్కార అధికారులను గుర్తించి వారికి శిక్షణ ఇవ్వాలనే లక్ష్యంతో భారత ప్రభుత్వ డిపార్ట్ మెంట్ ఆఫ్ అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ అండ్ పబ్లిక్ గ్రీవెన్స్ (డీఏఆర్ పీజీ) సౌజన్యంతో సంస్థ ‘సేవోత్తమ్’ శిక్షణా కార్యక్రమాలను నిర్వహిస్తోంది. 

మహిళాశక్తి:  ప్రభుత్వ ప్రాధాన్యతాంశాలలో ‘మహిళా శక్తి’ కీలకమైనది.  మహిళా సాధికారత లక్ష్యంగా,  మహిళాభివృద్ధి, శిశు సంక్షేమశాఖకు చెందిన 5,562 మంది ఉద్యోగుల సామర్థ్యాన్ని పెంపొందించే శిక్షణా కార్యక్రమాలను సంస్థ నిర్వహించింది. సీడీపీవోల నుంచి ఆశావహ జిల్లాలలోని అంగన్ వాడీ టీచర్ల వరకు శాఖకు చెందిన మొత్తం సిబ్బందికి శిక్షణ ఇచ్చారు.  గత డిసెంబర్ నాటికి, ఈ పథకం కింద సంస్థ 126 శిక్షణా కార్యక్రమాలను నిర్వహించింది.  ఒక శాఖ సేవలు సమర్థవంతంగా ఉండాలంటే  ఆ శాఖలో పనిచేసే ప్రతి ఉద్యోగికి శిక్షణ ఇచ్చే  ‘అందరికీ శిక్షణ’ బృహత్ పథకాన్ని భారత ప్రభుత్వం, పర్సనల్ & ట్రైనింగ్ డిపార్ట్‌‌‌‌మెంట్ (డిఓపిటి) స్పాన్సర్ చేసింది.

సమతాభాష (జెండర్- ఇంక్లూసివ్ భాష):  మహిళలు, ఇతరుల పట్ల వివక్ష, అణచివేత ధోరణి చూపకుండా మాట్లాడటం, వ్రాయడం, సమానత్వాన్ని ప్రోత్సహించడానికి శక్తిమంతమైన మార్గమని భావించి, శిక్షణా కార్యక్రమాలను నిర్వహిస్తోన్న దక్షిణ భారత దేశంలోని ఏకైక సంస్థగా.. లాల్ బహదూర్ శాస్త్రి జాతీయ పరిపాలనా అకాడెమీ (ముస్సోరి) నుంచి ఎంసీఆర్​హెచ్​ఆర్డీఐ అభినందనలు అందుకుంది. ఇంగ్లీషు, తెలుగు భాషలలో మౌఖిక, లిఖిత, అధికారిక, అనధికారిక కమ్యూనికేషన్లలో జెండర్- ఇంక్లూసివ్ భాష ఉపయోగించడంపై తగిన పరిజ్ఞానం, నైపుణ్యాలను అందించడం ఈ కార్యక్రమం లక్ష్యం. 
నూతన సాంకేతికత:  ప్రజలతో నేరుగా సంబంధాలు కలిగి ఉండే క్షేత్రస్థాయి ఉద్యోగుల వ్యక్తిగత, వృత్తిపరమైన సామర్థ్యాన్ని పెంపొందించడం లక్ష్యంగా ముఖాముఖి శిక్షణతో పాటు ఈ-–లెర్నింగ్ కూడా అందించే  ‘కాంప్రహెన్సివ్ ఆన్ లైన్ మాడిఫైడ్ మాడ్యూల్స్ ఇండక్షన్ ట్రైనింగ్’ (కమిట్) ప్రాజెక్ట్ జిల్లా స్థాయిలో 15 మాడ్యూళ్లతో శిక్షణను అందిస్తోంది. అదనంగా, సంస్థ తన వెబ్ సైట్ సమర్థతను పెంచి, ఆయా ప్రభుత్వ శాఖల ద్వారా ఆన్​లైన్​ నామినేషన్లను సులభతరం చేయడానికి ట్రైనింగ్ ఇన్ఫర్మేషన్ మేనేజ్మెంట్  పోర్టల్ ఆధునీకరించి, శిక్షణార్థులుకార్యక్రమాలపై తమ అభిప్రాయాలను ఆన్​లైన్ ద్వారా  ఇచ్చే వ్యవస్థను క్రమబద్ధీకరించారు.  సీఎం రేవంత్ రెడ్డి మార్గదర్శకత్వంలో  డా. శశాంక్ గోయల్, ఐఏఎస్,  డైరెక్టర్ జనరల్.. సంస్థను  ప్రజాపాలనా విధానాలపై దృష్టి సారించేటట్లు  తీర్చిదిద్దారు. వివిధ ప్రభుత్వ శాఖల విభిన్న అవసరాలను తీర్చే సమగ్ర శిక్షణా కార్యక్రమాల రూపకల్పన కోసం  ఫ్యాకల్టీ విభాగాలు పునర్వ్యవస్థీకరించడమైంది. కొత్తగా, అంతర్జాతీయ సంబంధాలు, సమస్యలపై అధ్యయనం కోసం  ‘సెంటర్ ఫర్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ అండ్ సెక్యూరిటీ’ స్థాపించబడింది.  మొదటిసారిగా సంస్థలోని ఫ్యాకల్టీ విభాగాలకు వివిధ రాష్ట్ర ప్రభుత్వ శాఖల శిక్షణావసరాల విశ్లేషణ (ట్రైనింగ్ నీడ్స్ అనాలిసిస్) నిర్వహించే బాధ్యతను అప్పగించారు. 

పాలనలో నిబద్ధతకు కృషి

సంస్థ అధ్యాపకులు ఆయా శాఖలను సందర్శించి, అధికారులతో సంప్రదింపుల ద్వారా వారి నిర్దిష్ట శిక్షణ అవసరాలను అంచనా వేసి, అందుకు తగిన శిక్షణా కార్యక్రమాలను రూపొందించారు. ఈ చొరవ వల్ల సంస్థ నిర్వహించే శిక్షణా  కార్యక్రమాలు వివిధ ప్రభుత్వ విభాగాలు ఎదుర్కొంటున్న, మారుతున్న అవసరాలు, సవాళ్లకు అనుగుణంగా, ప్రభావవంతంగా ఉంటున్నాయి. అంతేకాక, శిక్షణా కార్యక్రమాల సంఖ్య కూడా  గణనీయంగా పెరిగింది.  గత సంవత్సర కాలంలో సంస్థ నిర్వహించిన  322 శిక్షణా కార్యక్రమాలలో 10,506 మంది ఉద్యోగులు పాల్గొన్నారు.   కఠినమైన మూల్యాంకన ప్రక్రియ తరువాత నేషనల్ అక్రిడిటేషన్ బోర్డ్ ఫర్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ (NABET) నుంచి  సంస్థ ‘ఉత్కృష్ట్’  అక్రిడిటేషన్ పొందింది.  ప్రజాపాలనను అందించాలనే రాష్ట్ర  ప్రభుత్వ లక్ష్యంతో మమేకమయ్యేందుకు,  నిబద్ధతను, జవాబుదారీతనాన్ని పెంపొందించేందుకు డా. మర్రి  చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థ కృషి  చేస్తోంది. 

శ్రీనివాస్ మాధవ్, 
కన్సల్టెంట్, డా. మర్రి చెన్నారెడ్డి 
మానవ వనరుల అభివృద్ధి సంస్థ