ఈ సారి ఎన్నికల్లో హుజురాబాద్‍, మునుగోడు ఎఫెక్ట్‌‌  ఎంత? 

ఈసారి జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికలపై హుజురాబాద్‍, మునుగోడు ఎలక్షన్ల ఎఫెక్ట్‌‌ పడింది. ఇదే విషయాన్ని అధికార పార్టీ నుంచి బరిలో ఉన్న అభ్యర్థులే ఒప్పుకుంటున్నారు. పార్టీ కండువా కప్పుకునే లీడర్లను లక్షల రూపాయలు పెట్టి అడ్డగోలుగా కొనే సంస్కృతి అక్కడి నుంచే వచ్చింది. అందుకే ఖర్చు తడిసి మోపెడవుతోందని పేరు చెప్పడానికి ఇష్టపడని ఓ సిట్టింగ్‍ ఎమ్మెల్యే తల పట్టుకున్నాడు.

ఇదే అదనుగా ఓటర్లను ఎక్కువ స్థాయిలో ప్రభావితం చేసే ఎంపీటీసీలు, సర్పంచులు, జడ్పీటీసీలు, ఎంపీపీలు, సిటీలో కార్పొరేటర్లు, మాజీ కార్పొరేటర్లు తమ సేవలు అందించేందుకు ఓ రేట్ అడుగుతున్నారు. పోటీలో ఉండే పార్టీలు అవసరానికి అనుగుణంగా వారిని కొనుగోలు చేసి కండువా వేస్తున్నారు. గతంలో ఓటుకు 500 రూపాయలు ఇచ్చే స్థానాల్లోనూ హుజురాబాద్‍, మునుగోడు ఎన్నికల తర్వాత తక్కువలో తక్కువ రెండు వేల రూపాయల నుంచి మూడు వేల రూపాయలు ఎక్స్​పెక్ట్​ చేస్తున్నారని చెప్తున్నారు. దీనికితోడు గతంలో ఎన్నికలకు రెండు, మూడు రోజుల ముందు లిక్కర్‍ వంటి ప్రలోభాలు ఉండగా.. ఇప్పుడు షెడ్యూల్‍ మొదలైన మొదటిరోజు నుంచే ఖర్చు పెట్టాల్సి వచ్చిందట!