అరెస్టు భయం..?: ఆత్మహత్య చేసుకున్న ఈడీ అధికారి

అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఈడీ అధికారి అలోక్ రంజన్ ఆత్మహత్య చేసుకున్నారు. ఢిల్లీ సమీపంలోని సాహిబాబాద్‌లోని రైల్వే ట్రాక్‌పై అతని మృతదేహాన్ని కనుగొన్నారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. ఘటనా స్థలం వద్ద ఎలాంటి సూసైడ్ నోట్ లభించలేదని పోలీసులు తెలిపారు. రంజన్ అవినీతి కేసులో నిందితుడు.  

అసలేంటి ఈ కేసు..?

కొన్నిరోజుల క్రితం ముంబైకి చెందిన ఒక నగల వ్యాపారి ఇంటిపై ఈడీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఈడీ అసిస్టెంట్‌ డైరెక్టర్‌ సందీప్‌ సింగ్‌ యాదవ్‌ నేతృత్వంలో ఈ దాడులు జరిగాయి. ఆ సోదాల్లో ఏమీ లభించకపోగా.. రూ. 25 లక్షలు లంచం ఇవ్వాలని ఈడీ అధికారి సందీప్‌ సింగ్‌ వ్యాపారిని డిమాండ్‌ చేశాడు. లేదంటే నీ కొడుకుపై అక్రమ కేసు బనాయిస్తానని బెదిరించాడు. భయపడిపోయిన వ్యాపారి రూ. 20 లక్షలు ఇవ్వడానికి అంగీకరిస్తూనే. మరోవైపు సీబీఐ అధికారులను ఆశ్రయించాడు. ముంబైలోని ఓ రహస్య ప్రాంతంలో రూ.20 లక్షలు నగదు తీసుకుంటుండగా సీబీఐ.. ఈడీ అధికారిని అరెస్ట్‌ చేశారు.

అరెస్టు భయం..?

ఈ అవినీతి కేసులో అలోక్ కుమార్ రంజన్ పేరు కూడా ఉంది. దీంతో ఈడీ..  సీబీఐ ఎఫ్‌ఐఆర్‌ ఆధారంగా మనీలాండరింగ్‌ కేసు నమోదు చేసింది. 50 లక్షల లంచం కేసులో తన పేరు రావడంతో ఆయన ఎప్పుడూ ఆందోళనకరంగా కనిపించేవారని అతని సన్నిహితులు చెబుతున్నారు. అరెస్టు భయంతోనే ఆత్మహత్య చేసుకొని ఉండొచ్చని కథనాలు వస్తున్నాయి. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించి పోలీసులు ఎలాంటి అధికారిక ప్రకటన విడుదల చేయలేదు. రైల్వే ట్రాక్‌పై నుంచి మృతదేహాన్ని తీసి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. ఈ విషయమై అతని కుటుంబసభ్యులకు సమాచారం అందించారు.