ఈ ఏడు రంగుల పండ్లు, కాయగూరలు ఆరోగ్యానికి మేలు

 పండ్లు, కాయగూరలు కొనేటప్పుడు రెయిన్​బో రంగులు వెజిటబుల్​ బాస్కెట్​లో నింపాలి.   ఇంతవరకు తినని కొత్త పండు, కాయగూరలు తినాలి.    కాయగూరల, పండ్ల తొక్కు తీయకుండా తినాలి. పనికిరాదనుకుని పారేసే ఆ తొక్కలోనే ఫైటో న్యూట్రియెంట్స్​ బాగా ఉంటాయి. హెర్బ్స్​, స్పైస్​ల్లో కూడా ఫైటో న్యూట్రియెంట్స్​ ఉంటాయి. వాటిని కూడా వంటల్లో చేర్చితే రుచితో పాటు ఆరోగ్యం.తినేటప్పుడు పళ్లెంలో ఇంద్రధనుస్సును మిస్​ కానివ్వకుంటే చాలు ఆరోగ్యానికి ఢోకా ఉండదు అంటున్నారు న్యూట్రిషనిస్ట్​లు. ఆకాశంలో ఇంద్రధనుస్సుకి, నేల మీద ఉండే న్యూట్రిషనిస్ట్​లకు సంబంధం ఏంటి అనిపిస్తోందా? చాలా సింపుల్​ ఇంద్రధనుస్సులో ఉండే ఏడు రంగుల పండ్లు, కాయగూరలు తింటే చాలు. ఆరోగ్యానికి ఫుల్​ హామీ అన్నమాట.

ఎరుపు : ఈ రంగు పండ్లు, కూరగాయల్లో యాంటీ ఆక్సిడెంట్స్​ ఉంటాయి. రంగుల్లో ఉండే ఫైటో న్యూట్రియెంట్స్​ను కెరోటినాయిడ్స్ అంటారు. వాటిని లైకోపిన్, ఫ్లేవన్స్​, క్వెర్​సెటిన్​... అని రకరకాలుగా పిలుస్తారు. ఈ కెరోటినాయిడ్స్​ టొమాటో, యాపిల్, చెర్రీ, పుచ్చకాయ, ద్రాక్ష, స్ట్రాబెర్రీ, క్యాప్సికమ్​లో ఉంటాయి. వీటినే యాంటీఆక్సిడెంట్స్​ అంటారు. ఇవి ఫ్రీ రాడికల్స్​తో పోరాడతాయి. ఈ ఫ్రీ రాడికల్స్​ అతినీలలోహిత కిరణాల వల్ల​, పొగ, గాలి కాలుష్యం, పరిశ్రమల నుండి విడుదలయ్యే​ రసాయనాల వల్ల శరీరంలోకి చేరతాయి. ఫ్రీ రాడికల్స్​ అనేవి స్థిరంగా ఉండని అణువులు. ఇవి శరీరంలో చేరి ప్రొటీన్లు, కణ త్వచాలు, డీఎన్​ఎకు హానిచేస్తాయి. దీన్ని ఆక్సిడేషన్​ లేదా ఆక్సిడేటివ్​ స్ట్రెస్​ అంటారు. దీనివల్ల వయసు మీద పడినట్టు కనిపించడం, వాపు​, క్యాన్సర్​, గుండె జబ్బు వంటి వ్యాధులు వస్తుంటాయి. వీటి బారిన పడకుండా శరీరంలో తయారయ్యే ఫ్రీ రాడికల్స్​ను యాంటీ ఆక్సిడెంట్స్​ తుడిచిపెట్టేస్తాయి. అలాగే ఫ్రీ రాడికల్స్​ను కదలకుండా చేస్తాయి. దానివల్ల ఫ్రీ రాడికల్స్​ వల్ల డ్యామేజ్​ జరగదు. ఆహారంలో యాంటీఆక్సిడెంట్స్​ పెంచడం వల్ల ఆక్సిడేటివ్​ స్ట్రెస్​ తగ్గుతుంది. ఆర్థరైటిస్, టైప్​2 డయాబెటిస్, గుండె జబ్బులు, స్ట్రోక్​, క్యాన్సర్​ వంటి జబ్బులు దరిచేరవు.

ఆరెంజ్​ : ఈ రంగు పండ్లు, కూరగాయల్లో కెరోటినాయిడ్స్​ ఉంటాయి. ఎరుపు రంగు కూరగాయల్లో ఉండే కెరోటినాయిడ్స్​తో పోలిస్తే ఇవి కాస్త భిన్నం. వీటిలో ఆల్ఫా, బీటా కెరోటిన్​, కుర్​క్యుమినాయిడ్స్​ ఉంటాయి. క్యారెట్​, గుమ్మడికాయ, ఆప్రికాట్​, మాండరిన్, ఆరెంజ్​, పసుపులో ఇవి ఉంటాయి.
ఆల్ఫా, బీటా కెరోటిన్​లు శరీరానికి విటమిన్​–ఎను అందిస్తాయి. ఈ విటమిన్​ కంటి ఆరోగ్యానికి, కంటి చూపు బాగుండేందుకు అవసరం. విటమిన్​ –ఎ కూడా యాంటీఆక్సిడెంట్​. శరీరంలో లిపిడ్స్​(కొవ్వులు)తో తయారైన కణత్వచాల చుట్టూ చేరే  ఫ్రీ రాడికల్స్​ను విటమిన్–​ఎ టార్గెట్​ చేస్తుంది. దానివల్ల క్యాన్సర్​, గుండె జబ్బుల రిస్క్​ తగ్గుతుంది.

పసుపు​ : ఈ రంగు పండ్లు, కూరగాయల్లో కూడా కెరోటినాయిడ్స్​ ఉంటాయి. కాకపోతే లూటిన్​, జెగ్జాంథిన్​, మీసో జెగ్జాంథిన్​, వయోలా గ్జాంథిన్​ వంటి ఫైటో న్యూట్రియెంట్స్​ ఇవి. యాపిల్​​, పియర్​​, అరటిపండు, లెమన్స్​, పైనాపిల్​​లో ఉంటాయి. లూటిన్​, జెగ్జాంథిన్, మీసో జెగ్జాంథిన్​లు ప్రత్యేకించి కంటి ఆరోగ్యానికి అవసరం. అలాగే వయసు వల్ల వచ్చే మాక్యులర్​ డీజనరేషన్​(సెంట్రల్​ విజన్​ మసకబారడం)ను తగ్గిస్తాయి. ఇవి కళ్ల మీద అల్ట్రా వైలట్​ కిరణాల ప్రభావం పడకుండా కళ్లకు సన్​స్క్రీన్​గా ఉంటాయి. ఎండవల్ల కళ్లు దెబ్బతినకుండా కాపాడతాయి.

ఆకుపచ్చ: ఈ రంగు పండ్లు, కూరగాయల్లో చాలా రకాల ఫైటోన్యూట్రియెంట్స్​ ఉంటాయి. క్లోరోఫిల్​, కాటెచిన్స్​, ఎపిగాల్లొకాటెచిన్​ గల్లాటె, ఫైటోస్టెరోల్స్, నైరేట్స్​తో పాటు ఫోలేట్​(విటమిన్​ బి9) అనే ముఖ్యమైన న్యూట్రియెంట్​ కూడా ఉంటుంది. ఎవకాడో, యాపిల్​, పియర్, గ్రీన్​టీ, ఆకుకూరల్లో ఉండే ఇవి యాంటీ ఆక్సిడెంట్స్​గా కూడా పనిచేస్తాయి. అంతేకాకుండా వాసోడిలేషన్ అనే ప్రక్రియ ద్వారా రక్తనాళాలను ఆరోగ్యంగా ఉంచుతాయి. రక్తనాళాలకు సాగేగుణం ఇస్తాయి ఇందులోని ఫైటోన్యూట్రియెంట్స్. దానివల్ల రక్తనాళాలు వెడల్పుగా అవుతాయి. దాంతోరక్త ప్రసరణ బాగా జరుగుతుంది. బీపీ తగ్గుతుంది. గుండె, ఇతర రక్త నాళాలు జబ్బుల బారిన పడకుండా కాపాడుతుంది. 
పుట్టబోయే పిల్లల్లో న్యూరల్​ ట్యూబ్​ డిఫెక్ట్స్​ రిస్క్​ రాకుండా తల్లి కావాలనుకున్న వాళ్లను ఫోలేట్​ వాడమంటారు. దీనివల్ల గర్భం దాల్చిన మొదటి కొన్ని వారాల్లో కడుపులో బిడ్డ నరాల వ్యవస్థ డెవలప్​ అవుతుంది. అలాగే కణాల విభజన ఆరోగ్యంగా జరుగుతుంది. డీఎన్​ఏ సంయోగం సరిగా ఉంటుంది.

నీలం, ఊదా: ఈ రెండు రంగులు ఇతర రకాల ఫైటోన్యూట్రియెంట్స్​ను ఉత్పత్తి చేస్తాయి. వాటిలో ఆంతోసియానిన్స్​, రిస్వరట్రోల్​, టానిన్స్​ వంటివి ఉన్నాయి. బ్లాక్​ బెర్రీ​, బ్లూ బెర్రీ​, ఫిగ్స్​ (అంజీర్​), ప్రూన్స్, ఊదా రంగు ద్రాక్ష​లో ఇవి ఉంటాయి. ఆంతోసియానిన్స్​లో కూడా యాంటీ ఆక్సిడెంట్​గుణాలు ఉంటాయి. వాటివల్ల క్యాన్సర్​, గుండె జబ్బులు, స్ట్రోక్​ రిస్క్​ తగ్గుతుంది. ఇవేకాకుండా జ్ఞాపకశక్తి మెరుగుపడుతుందని కొన్ని స్టడీలు చెప్తున్నాయి. మెదడు కణాల మధ్య సిగ్నలింగ్ మెరుగుపడుతుంది. దాంతో కొత్త సమాచారం మార్పు, అడాప్ట్​ చేసుకోవడం ఈజీ అవుతుంది. దీన్నే బ్రెయిన్​ ప్లాస్టిసిటీ అంటారు.

బ్రౌన్​, తెలుపు: ఈ రెండు రంగుల పండ్లు, కూరగాయల్లో ఫ్లేవొన్స్​ అనే ఫైటోన్యూట్రియెంట్స్​ గ్రూప్​ ఉంటుంది. వీటిలో ఎపిజెనిన్​, ల్యూటియోలిన్, ఐసోటిన్​  ఉంటాయి. ఇవి వెల్లుల్లి, ఆలుగడ్డ, అరటిపండ్లలో ఉంటాయి. ఈ రంగు కూరగాయల్లో మరో ఫైటో న్యూట్రియెంట్​ కూడా ఉంది. అదే వెల్లుల్లిలో ఉండే ఎల్లిసిన్​. ఎల్లిసిన్​కు​ యాంటీ బ్యాక్టీరియల్​, యాంటీ వైరల్​​ గుణాలు ఉంటాయి. అంతేకాకుండా ఎల్లిసిన్​ రక్తనాళాలను వెడల్పుగా చేస్తుంది. దానివల్ల అధిక రక్తపోటు సమస్య 
తగ్గిపోతుంది.