భవిష్యత్తులో రోజుకు 25 గంటలు! భూమిపై వెన్నెల రాత్రులు ఉండవా..!

రోజుకు 24 గంటలు మీకు సరిపోవడం లేదా..!. బద్ధకం వల్ల జరగాల్సిన పనులను వాయిదా వేస్తున్నారా..! అయితే మీకో సంతోషకరమైన వార్త. భవిష్యత్తులో రోజుకు 25 గంటలు ఉండనున్నాయట. భూమి నుంచి చంద్రుడి నిదానంగా దూరం జరిగిపోతుండటం అందుకు ప్రధాన కారణం.

భూమి తన చుట్టూ తాను తిరుగుతూనే సూర్యుని చుట్టూ తిరుగుతుందన్న విషయం తెలిసిందే. ఇలా అనంత విశ్వంలో చంద్రుడితో పాటు ఇతర గ్రహాలు సూర్యుని చుట్టూ నిర్దిష్ట కక్ష్యలో తిరుగుతూ ఉంటాయి. అయితే, ఇప్పుడు చంద్రుడు.. సూర్యుని చుట్టూ తిరిగే వేగం కాలక్రమేణ తగ్గుతోందట. ఇదిలానే కొనసాగితే, భూమి, చంద్రుని మధ్య దూరం పెరిగి వెన్నెల రాత్రులు ఉండవని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. 

విస్కాన్సిన్-మాడిసన్ విశ్వవిద్యాలయ బృందం నిర్వహించిన ఒక పరిశోధన ప్రకారం, చంద్రుడు సంవత్సరానికి సుమారు 3.8 సెంటీమీటర్ల చొప్పున భూమి నుంచి దూరం జరుగుతున్నాడు. ఇదిలానే కొనసాగితే, 200 మిలియన్ సంవత్సరాల కాలంలో భూమిపై రోజుకు 25 గంటలు ఉండే అవకాశం ఉందని పరిశోధనలో వెల్లడైంది.

రోజుకు 18 గంటలు 

వాస్తవానికి సుమారు1.4 బిలియన్ సంవత్సరాల క్రితం భూమి మీద రోజుకు 18 గంటలు మాత్రమే ఉండేవి. వాతావరణంలో మార్పుల కారణంగా భూమి, చంద్రుని మధ్య దూరం పెరిగి.. సమయం పెరుగుతూ వచ్చింది. దాంతో, నెమ్మదిగా 24 గంటలకు చేరింది. రానున్న రోజుల్లో ఈ 24 గంటలు కాస్తా 25 గంటలు అయ్యే అవకాశం ఉందని విస్కాన్సిన్-మాడిసన్ విశ్వవిద్యాలయ బృందం అంచనా వేసింది. అయితే, రోజుకు 25 గంటల సమయాన్ని ప్రస్తుతం జీవించి ఉన్నవారెవ్వరూ చూసే అవకాశం లేదు. ఆ మార్పు జరగడానికి దాదాపు 200 మిలియన్ సంవత్సరాలు పడుతుందని అంచనా.