విద్యాతురాణామ్ న సుఖమ్ న నిద్ర
క్షుధాతురాణామ్ న రుచి న పక్వమ్
అర్థాతురాణామ్ న సుహృన్న బంధుః
కామాతురాణామ్ న భయం న లజ్జా
అని సుభాషితం చెప్తోంది.
అంటే...
విద్యయందు నిమగ్నమై ఉన్నవానికి నిద్ర, సుఖము గురించిన ఆలోచనే ఉండదు. ఆకలిగొన్నవానికి రుచి, పక్వముల గురించిన ధ్యాస ఉండదు. ధనసంపాదనలో ఉన్నవారికి బంధుమిత్రులంటూ ఎవరూ ఉండరు. కామమోహితుడైనవానికి భయము, సిగ్గు వంటివి ఉండవు... అని ఈ సుభాషితం మనకు చెప్తోంది.
భారతీయ ధర్మంలో ధర్మార్థకామమోక్షాలు అనే చతుర్విధ పురుషార్థాలు ఉన్నాయి.
ఇందులో మొదటిది ధర్మం. మానవునిగా జీవించి ధర్మాన్ని అనుసరించడం మన కర్తవ్యం. ఇక అర్థ కామాలు... ఈ రెండింటినీ ధర్మబద్ధంగానే సంపాదించుకోవాలి. అప్పుడే మోక్షమనేది వస్తుందనే విషయాన్ని పెద్దలు చెప్తున్నారు. అందుకే మొదటగా ధర్మాన్ని, చివరగా మోక్షాన్ని నిక్షేపించి, అర్థకామాలను మధ్యలో నిలబెట్టారు.
రావణుడు – కుబేరుడు
కుబేరుడు విశ్రవ రుషి పెద్ద కుమారుడు. విశ్రవుడికి ఇద్దరు భార్యలు. మొదటి భార్య కుమారుడు కుబేరుడు. రెండవ భార్య కుమారుడు రావణుడు. కుబేరుడు లంకను పరిపాలించేవాడు. తల్లి సూచన మేరకు రావణుడు కుబేరునిపై దాడి చేసి అతనిని ఓడించాడు. కుబేరుని లంక నుండి వెళ్లగొట్టారు. కుబేరుని పుష్పక విమానాన్ని, సంపదలను రావణుడు స్వాధీనపరచుకున్నాడు. కానీ అవి ఎక్కువ కాలం రావణుడు అనుభవించలేదు. అధర్మంగా సంపాదించిన రాజ్యంతో పాటు రావణుడు రాముడి చేతిలో హతమై ప్రాణాలు కూడా పోగొట్టుకున్నాడు.
రాక్షసులు – ఇంద్రుడు
రుగ్వేదంలో ఎక్కువగా సూచించిన దేవుడు ఇంద్రుడు. ఇతను క్రమశిక్షణ కలిగినవాడు. మానవ శ్రేయస్సు, ఆనందాలకు ఆటంకం కలిగించేవారిని సంహరిస్తూ ఉంటాడు. ఆ ఇంద్రుడు సర్వశక్తి సంపన్నుడు. అందువల్ల ఇంద్ర పదవి కోసం రాక్షసులు నిరంతరం తపస్సు చేసి, వరాలు పొందేవారు. వారి వల్ల దేవతలకు, సాధుసంతులకు ఇక్కట్లు వాటిల్లేవి. చివరకు విష్ణుమూర్తిని ప్రార్థించి రాక్షస సంహారం చేయటం ఇంద్రునికి నిత్యకృత్యమైపోయింది. ఇంత తపస్సు చేసినప్పటికీ రాక్షసులు అధర్మంగా వర్తించటం వల్ల వారు దానవులుగానే నిలిచిపోయారు. ఇంద్రుడు స్వర్గాధిపతిగా స్థిరపడ్డాడు.
భారత కథలో...
ధృతరాష్ట్రుడు, పాండురాజు అన్నదమ్ములు. ధృతరాష్ట్రుడు అంధుడు కావటం వలన పాండురాజు రాజ్యపరిపాలన చేశాడు. రాజ్యాన్ని విస్తరించాడు. ఆ తరువాత ధర్మరాజు రాజయ్యాడు. ధర్మరాజు రాజసూయ యాగం చేశాడు. కౌరవులను ఆహ్వానించాడు. పాండవుల సంపదలను చూసిన దుర్యోధనాదులకు ఇక నిద్ర పట్టలేదు. ఏదో ఒక విధంగా వారి సంపదలను హరించాలనుకున్నారు.
మేనమామ శకుని సలహా, సూచనల మేరకు ధర్మరాజుతో మోసపూరితంగా ద్యూత క్రీడ నడిపాడు. ఆ క్రీడలో ధర్మరాజు సర్వం కోల్పోయాడు. ఒప్పందం ప్రకారం పన్నెండు సంవత్సరాలు అరణ్యవాసం, ఒక సంవత్సరం అజ్ఞాత వాసం పూర్తి చేసుకుని వచ్చి, వారి రాజ్యాన్ని వారికి ఇమ్మని కోరినప్పటికీ.. అత్యాశపరుడైన దుర్యోధనుడు అందుకు తిరస్కరించాడు. ఇరువురి మధ్య కురుక్షేత్ర యుద్ధం నడిచింది. కౌరవులు నూరుగురు ఆ యుద్ధంలో కన్నుమూశారు. అధ్మరంగా సంపాదించిన సొమ్ము ఒక్క పైసా వారి వెంట రాకపోగా, చరిత్రలో దుష్టులుగా మిగిలిపోయారు. ధర్మరాజాదులు ధర్మానికి ప్రతినిధులుగా ఖ్యాతి గాంచారు.
భారతదేశ చరిత్ర మాత్రమే కాకుండా, ప్రపంచ చరిత్ర పరిశీలిస్తే సంపదల కోసం యుద్ధాలు జరిగాయి. జరుగుతున్నాయి. జరుగుతూనే ఉంటాయి. భారతదేశం రత్నగర్భ. ఇక్కడ సంపదలకు లోటు లేదు. ఆ సంపదలను దోచుకోవటానికి ఆంగ్లేయులు, మొఘలులు, ఫ్రెంచి, డచ్చివారు... ఎన్నో దేశాలవారు భారతదేశం మీద దండయాత్రలు చేశారు. భారతీయ సంపదలను అపహరించుకుపోయారు. వారి అధర్మ వర్తనం కారణంగా యుద్ధాలలో ఓడి పోయి పారిపోయారు. భారతదేశం ఇప్పటికీ ధర్మానికి మారుపేరుగానే నిలబడింది.
రాజులు... పొరుగు రాజ్య సంపదలను అపహరించాలనే కోరికతో ఒకరిని ఒకరు చంపుకుంటూ సామ్రాజ్యాలను విస్తరించేవారు. ధర్మబద్ధంగా యుద్ధం చేసిన శ్రీకృష్ణదేవరాయలు వంటి వారు చరిత్రలో నిలిచిపోతే, అధర్మంగా పరిపాలించిన నవనందులు కాలగర్భంలో కలిసిపోయారు.
నలుడు – తమ్ముడు
నలమహారాజు సర్వ లక్షణ సంపన్నుడు. దేవతలందరూ నలుడి లక్షణాలను ప్రశంసించేంత ఉత్తముడు. నలుడి తమ్ముడు పుష్కరుడు. అన్నగారి సంపదలను అపహరించాలనే తలంపుతో.. అన్నగారితో మోసపూరితంగా పాచికల ఆట ఆడి ఓడించాడు. అయితేనేం... కొంతకాలానికి నలుడు తన రాజ్యాన్ని సుభిక్షంగా పరిపాలించాడు. పోగొట్టుకున్న తన భార్య దమయంతిని తిరిగి పొందాడు.
విశ్వామిత్రుడు – వశిష్ఠుడు
విశ్వామిత్రుడు ఒకరోజు తన అక్షౌహిణి సైన్యంతో వేటకై వెళ్ళి, అలసి, వశిష్ఠ మహర్షి ఆశ్రమానికి చేరుకున్నాడు. వశిష్ఠుడు కామధేనువు సంతతికి చెందిన శబల అనే గోవు సహాయంతో వారివారి ఇచ్ఛానుసారం పదార్ధాలు తయారు చేసి, విందు ఏర్పాటుచేశాడు. శబల చేసిన అతిథి సత్కారాలు చూసిన విశ్వామిత్రుడు ఆశ్చర్య చకితుడై ఆ శబలను తనకు ఇవ్వమన్నాడు. అందుకు ప్రతిగా రెట్టింపు సంపద ఇస్తానన్నాడు. వశిష్ఠుడు నిరాకరించాడు. దానితో విశ్వామిత్రుడు యుద్ధం చేశాడు. ఓడిపోయాడు. అధర్మంగా శబలను తోడ్కొని పోవాలనుకున్న విశ్వామిత్రుడు ఓటమిపాలయ్యాడు.
ఇంతమందినీ పరిశీలిస్తే... వీరందరికీ అధర్మంగా సంపదలు హరించాలనే కోరిక కలిగినట్లు అవగతమవుతుంది. అటువంటి సంపద నిలవదని గ్రహించాలి
డా. పురాణపండ వైజయంతి ఫోన్ : 80085 51232