ఆకాశంలో గరుడదళం గస్తీ.. జనవరి నుంచే ఆన్‌‌డ్యూటీ!

  • ఇంటెలిజెన్స్‌‌ డ్యూటీలో  నాలుగు డేగలు
  •  మూడేండ్ల ట్రైనింగ్‌‌ పూర్తి
  • ప్రత్యేక హ్యాండ్లర్స్‌‌, మైక్రో కెమెరాలతో ఆకాశంలో నిఘా
  • జనవరి నుంచే ఈగల్‌‌ ఆన్‌‌డ్యూటీ!

హైదరాబాద్‌‌, వెలుగు: రాష్ట్ర పోలీస్ డిపార్ట్‌‌మెంట్‌‌లోకి కొత్తగా గరుడదళం(ఈగల్‌‌స్క్వాడ్‌‌) చేరుతున్నది. 4 డేగలతో కూడిన స్పెషల్ స్క్వాడ్‌‌‘ఈగల్‌‌’ ఆపరేషన్స్‌‌కు రెడీ అవుతున్నది. మొయినాబాద్‌‌లోని ఇంటిగ్రేటెడ్ ఇంటెలిజెన్స్ ట్రైనింగ్ అకాడమీలో శిక్షణ పూర్తి చేసుకుని ఇంటెలిజెన్స్‌‌ విధులు నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నది. ఇందులో భాగంగా ఇప్పటికే సీఎం రేవంత్‌‌రెడ్డి ఇంటి పరిసర ప్రాంతాలతో పాటు వీవీఐపీ జోన్స్‌‌లో డెమో నిర్వహించినట్టు తెలిసింది. జనవరి నుంచి ఇంటెలిజెన్స్ సెక్యూరిటీ వింగ్‌‌లో కీలక బాధ్యతలు నిర్వహించనున్నది. ఆకాశంలో ఎగురుతూ భూమిపై ఉపద్రవాలను గుర్తించేందుకు డాగ్‌‌స్క్వాడ్‌‌తో కలిసి మెరుగైన సేవలు అందించనున్నది. వీఐపీ జోన్స్‌‌లో డ్రోన్స్‌‌, బాంబులు, అనుమానిత స్థావరాలు, మావోయిస్టులపై గరుడదళం నిఘా పెట్టనున్నది. సీక్రెట్‌‌ఆపరేషన్స్‌‌లో భాగంగా జనవరి నుంచి గరుడదళాన్ని రంగంలోకి దింపనున్నట్టు తెలిసింది.

గగనతలం నుంచి నిఘా..

మారుతున్న కాలానికి తగ్గట్టుగా అత్యాధునిక టెక్నాలజీతో విధ్వంసాలు జరుగుతున్నాయి. సాంకేతిక, డ్రోన్స్‌‌తో  భద్రతకు ముప్పు పెరిగిపోతున్నది. గగనతలంలో ఎగిరే డ్రోన్లను ఉపయోగించి టెర్రరిస్టులు, సంఘ విద్రోహక శక్తులు విధ్వంసాలకు పాల్పడే అవకాలు ఉన్నాయి. ఇలాంటి ముప్పును తిప్పి కొట్టేందుకు దేశంలోనే తొలిసారిగా ఈగల్ స్క్వాడ్‌‌ను వినియోగించనున్నారు. విదేశాల్లో మినహా దేశంలోని ఏ రాష్టంలోని పోలీసులు ఈ గరుడ దళాన్ని వినియోగించడం లేదు. ఈగల్‌‌ స్క్వాడ్‌‌ ను ఏర్పాటు చేసేందుకు 2020లోనే హోంశాఖ చర్యలు చేపట్టింది. గత మూడేండ్లుగా వివిధ ప్రాంతాల నుంచి సేకరించిన డేగలకు ప్రత్యేక ట్రైనింగ్ ఇచ్చారు. నల్లమలసహా ఇతర అటవీ ప్రాంతాల్లో జీవించే మేలురకం డేగలను చిన్నతనంలోనే అకాడమీకి తరలించారు.వాటికి అనువైన వాతావరణంలో పెంచారు.

4 డేగలకు అధునాతన శిక్షణ 

డేగలకు చిన్ననాటి నుంచే శిక్షణ ఇవ్వడం ప్రారంభించారు. ప్రాజెక్ట్‌‌ ఈగల్‌‌ స్క్వాడ్‌‌ కోసం ఇద్దరు పోలీస్‌‌ అధికారులకు స్పెషల్ ట్రైనింగ్‌‌ ఇచ్చారు. కోల్‌‌కతా, రాజస్థాన్‌‌లకు చెందిన స్పెషల్‌‌ ఇన్‌‌స్ట్రక్టర్స్‌‌తో డేగలకు శిక్షణ ఇప్పించారు. ప్రస్తుతం నాలుగింటితో ఈగల్‌‌ స్క్వాడ్‌‌ను ఏర్పాటు చేశారు. డ్రోన్‌‌లను గుర్తించి నేలకూల్చడం, ఆకాశం నుంచి నిఘా పెట్టడంలో వీటికి అత్యుత్తమ శిక్షణ ఇచ్చారు. పోలీస్ జాగిలాలు, పోలీసులు వెళ్లలేని అటవీ ప్రాంతాల్లో  గస్తీ నిర్వహించేలా ట్రైనింగ్‌‌ ఇచ్చారు.

జీపీఎస్ ట్రాకర్, మైక్రో కెమెరాలు 

నిర్ధేశిత ప్రాంతాలను టార్గెట్‌‌  చేరుకోవడం ఆ తర్వాత తిరిగి హ్యాండ్లర్ వద్దకు చేరుకోవడానికి ప్రాధాన్యత ఇచ్చారు. గరుడదళానికి జీపీఎస్‌‌ ట్రాకర్‌‌‌‌, మెడ, కాళ్లు, రెక్కలకు అత్యాధునికి మైక్రో కెమెరాలను అమర్చుతారు. ఆకాశంలో ఎగురుతూ నిర్ధేశిత ప్రాంతాల్లో టార్గెట్స్‌‌ కదలికలపై నిఘా పెడతారు. డేగకు అమర్చిన మైక్రో కెమెరాలు, చిప్‌‌ను హ్యాండ్లర్‌‌‌‌ చేతిలోని సెన్సార్‌‌‌‌కు అనుసంధానం చేస్తారు. కెమెరాల ద్వారా సేకరించే వీడియో ఫుటేజ్‌‌ను  హై క్వాలిటీ రెజల్యూషన్‌‌తో పరిశీలిస్తుంటారు. సాధారణంగా ఒక్కో డేగ రెండు కిలోల వరకు బరువుమోయగలుగుతుంది. దీంతో ఆకాశంలో ఎగిరే డ్రోన్స్‌‌ను ఎత్తుకురావడంతోపాటు అవసరమైతే ధ్వంసం చేసే విధంగా ఈగల్ స్క్వాడ్‌‌కు ట్రైనింగ్ ఇచ్చారు. వీఐపీల మూవ్‌‌మెంట్స్‌‌, మావోయిస్టు ఆపరేషన్లకు ఈ గరుడదళాన్ని వినియోగించేందుకు చర్యలు చేపట్టారు.