మరో పెద్ద పండగొచ్చింది : తెలంగాణకు దసరా ఎంతో.. సంక్రాంతీ అంతే..

సంక్రాంతి వస్తోంది కదా.... ఇంటికి టికెట్ బుక్ అయ్యిందా? ఓసారి మళ్ళీ ఊరికి పోవాలనుంది కదా! ఊళ్ళో అమ్మనాన్న ఉన్నరు, దోస్తులున్నరు చిన్న నాటి జ్ఞాపకాలున్నాయ్ కానీ, ఇప్పుడు ఊరుందా? ఊరు ఊరులెక్కనే ఉన్నదా చిచ్చా!? సాయంత్రాలు వెన్నెల మాటలుండేటియి, దోస్తుల నవ్వులుండేటియి, ప్రేమలుండేటియి కానీ, ఇప్పుడు టీవీ వచ్చింది, పల్లెలోకూడా ఇస్మార్ట్ ఫోనొచ్చింది. మొత్తంగా పల్లెకు సిటీ దెయ్యం పట్టింది. పల్లె కన్నీటికి కూడా పట్నం డీజే రీమిక్స్ అంటుకున్నది. ఊరికి పోతున్నం కదా ఈసారికి పట్నాన్ని ఇక్కన్నే వదిలి మళ్ళీ ఊరిపోరగాండ్లమై పోదామా? 

సంక్రాంతి మనది కాదా ! 

తెలంగాణ వాళ్లకి సంక్రాంతి తెల్వదు అని ఒక రూమర్ ఉంది. కానీ దసరా ఎంతో మనకు సంక్రాంతి కూడా అంతే అని గుర్తు చేసుకుందాం. రేగ్గాయల భోగి స్నానం మనకు ఓ మూఢనమ్మకమే కావచ్చుగానీ చిన్నప్పుడు రేగుపండ్లని నీళ్లలో వేసుకొని స్నానం చేసినట్టు ఓసారి పిల్లలకి గుర్తు చేద్దాం. భోగి మంటకూడా మనకు మామూలు విషయమే కానీ ఓసారి అట్లా మంటదగ్గర చలి కాగుదాం. ఊరంతా వేసిన లింకుముగ్గులో పెట్టిన గొబ్బెమ్మల దగ్గర నవధాన్యాలని చూసుకుంటూ నడిచి ఎన్ని సంవత్సరాలైంది? ఒక్కసారి తెలంగాణా పల్లెని యాద్ జేసుకుందామా? పల్లె కన్నీరు పెడుతుందో అన్న గోరటి పాటలాగా కాదుగానీ... జస్ట్ ఓ నోస్టాల్జియాలాగా... పల్లెనీ, ఒకనాటి మన జీవితాలనీ మళ్ళీ గుర్తు చేసుకునే ప్రయత్నంచేద్దాం. 

సంక్రాంతి అంటేనే... 

పెద్ద పెద్ద ఇనుపరోళ్లని ఇంటిముందు పెట్టి చుట్టూ ఉన్న వాళ్ళు వచ్చి సకినాలకోసం పిండికొట్టేది. వారం ముందునుంచే చద్దర్లు పరిచి సకినాలు పోసేది. అంతకన్నా ఆర్టిస్టిక్ వర్క్ ఎక్కడైనా ఉందా? మళ్ళీ ఒకసారి పిండి కొట్టాలని లేదా! టీవీ ఆఫ్ చేసేసి దగ్గర ఉన్న రెండు మూడిళ్ళని కలుపుకొని చిన్న సరదా పార్టీ చేసుకుంటే ఎట్లుంటది? ఎట్లైనా పిల్లలని తీసుకొనే ఊరికి పోతారు కాబట్టి పిల్లలకు ఈ సిటీ వాతావరణంలో కనిపించని లైఫ్ని పరిచయం చేద్దాం. నువ్వులూ చక్కెరా కలిపి ఇల్లిల్లూ తిరిగి అందర్నీ పలకరించటం ఉండేది. ఏదో ఒక చానెల్లో వచ్చే ఒక స్పెషల్ ప్రోగ్రాం ఆ తర్వాత యూట్యూబ్లో అయినా చూడచ్చుగానీ మళ్ళీ ఓసారి అట్లా ఇల్లిల్లూ తిరిగి వద్దాం. మన ఊరికే మనం చుట్టాల్లా వెళ్తున్న ఈ కాలంలో పిల్లలకి పరిచయమే లేని మన పాత పని ముట్లనీ, అవి తయారు చేసే కొలిమినీ చూపించి ఒక చరిత్ర వాళ్లలో మిగిలి ఉండే ప్రయత్నం చేద్దాం. కొలిమి, పెద్దబాడిశతో నాగలి చెక్కటం మనమే మర్చిపోతున్నాం. అందుకే ఓసారి ఆనాటి తెలంగాణా పల్లెని జ్ఞాపకాల్లోంచి రియాలిటీలోకి తెచ్చి చూసుకుందాం.

పట్నం రోడ్లమీద కనిపించని చెట్లూ, ఇక్కడ ఉండని పొలాలూ ఓసారి తిరిగి వద్దాం. ఇంకా అక్కడో ఇక్కడో ఎద్దులనీ, నాగలినీ ప్రేమించే రైతు - ఒక్కడైనా ఉండక పోడా... అలా వెళ్ళి ఇంకొక్కసారి మనం ఎలా ఎదుగుతూ వచ్చినమో ఓసారి గుర్తు చేసుకుందాం. దున్నటానికి ట్రాక్టర్లూ, కోత కోయటానికి హార్వెస్టర్లూ వచ్చాక మనం మర్చిపోతున్న వ్యవసాయ పనుల్లో పాడుకునే పాటలని మళ్ళీ ఓసారి రివైండ్ చేసుకుందాం. ఎడ్లబండీ, కచ్చురం చూడటానికి 'శిల్పారామం' పోయే మనం ఓసారి మళ్ళీ ఆ బండిమీద అలా తిరిగితే ఎంత బాగుంటుంది. యంత్రాలు వచ్చాక పని సులభమైపోయింది కానీ మనుషులు ఆ యంత్రాల్లో పడి చిన్న చిన్న ఎమోషన్లని మిస్ అవుతున్నాడు. అందుకే ఎద్దులనీ, బర్రెలనీ పిల్లలకి దగ్గరగా చూపించండి. పాలు పిండటం, కట్టెలపొయ్యి వెలిగించటం చూపించండి.

సంక్రాంతి పల్లె..

చరిత్ర పుస్తకాల్లో చదివేది కాదు మన జీవితాలకి మూలం అని తెలియాలంటే ఊరికి దగ్గరలో ఉన్న పాత గడీ, కోటగోడ, పాతగుడి లాంటివి, మనం చిన్న నాడు చదువుకున్న స్కూల్, ఈతకొట్టిన పెద్ద బావి లాంటి ప్రదేశాలన్నీ పిల్లలతో మళ్ళీ ఓ రౌండేయ్యండి. పెంకుటిళ్ళూ, మట్టిగోడలూ దాటుతున్నప్పుడూ వాటిమీద దృష్టి పడేలా చెయ్యండి.

ఒకప్పుడు మనం తిరిగిన పల్లె ఎలా మారిపోతోందో ఒకసారి గుర్తు చేసుకోండి. మన ఊరి అభివృద్ధి కోరుకుంటూనే పాత జ్ఞాపకాలలో అలా ఒక నోస్టాల్జియాని దాచుకొని మళ్ళీ పట్నం బస్సెక్కి వచ్చేయండి. అప్పుడప్పుడూ ఆ రోజుల్లోకి వెళ్ళిపోవటం ఇప్పుడు వినటానికి చికాకుగా ఉన్నా గుర్తు చేసుకున్నప్పుడు బాగుంటుంది.... అదే కాదు ఒక్కసారి పిల్లలకి ఇవన్నీ చూపించాక వాళ్ళ ఆలోచనా తీరు ఎలా మారిపోతుందో మీరే గమనించొచ్చు. ఏదో పనిమీద ఊరికి వెళ్ళిరావటంలాగా కాదు, పండక్కి కనీసం మూడు రోజులు వెళ్తాం. కాబట్టి ఈసారి మనకోసమే మనం ఊరికి పోయివద్దాం... కొన్ని సార్లు మనల్ని మనం వెతుక్కున్నట్టు ఊరిని చూడటం ఎంత బాగుంటదో ఈసారి ట్రై చేద్దాం... ఊరి జీవితం ఇప్పుడు నోస్టాల్జియా కావచ్చు. కానీ, అది మనలో ఎప్పటికీ మిగిలిపోయే మన బతుకు కదా!