వనపర్తి జిల్లాలో వడ్ల కొనుగోలుపై నజర్

  • అనుకూలించిన వర్షాలతో పెరిగిన సాగు విస్తీర్ణం
  • వనపర్తి జిల్లాలో 5.29 లక్షల మెట్రిక్​ టన్నుల ధాన్యం వస్తుందని అంచనా
  • 300 కేంద్రాలు ఏర్పాటు చేయాలని అధికారుల నిర్ణయం

వనపర్తి, వెలుగు: వర్షాలు అనుకూలించడంతో ఈ ఏడాది ఖరీఫ్​లో వనపర్తి జిల్లాలో వరి సాగు విస్తీర్ణం గణనీయంగా పెరిగింది. అన్ని రకాల పంటలు కలిపి 2.50 లక్షల ఎకరాల సాధారణ విస్తీర్ణం కాగా, అందులో 1,87,135 ఎకరాల్లో వరి సాగు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం సన్నరకం వడ్లకు ఎంఎస్​పీపై అదనంగా రూ.500 బోనస్​ ఇస్తానని ప్రకటించింది. సాధారణంగానే జిల్లాలో ప్రతి సీజన్​లో సన్నాలు ఎక్కువగా పండిస్తారు. ఈసారి సన్నాల విస్తీర్ణం 50 శాతానికి పైగా ఉందని అగ్రికల్చర్​ ఆఫీసర్లు చెబుతున్నారు. 

పెరిగిన విస్తీర్ణాన్ని బట్టి 5 లక్షల మెట్రిక్​ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని, అందులో 3.89 లక్షల టన్నులు సన్నాలు, 1.40 లక్షల టన్నులు ఏ గ్రేడ్​ వడ్లు రావచ్చని  అగ్రికల్చర్​ ఆఫీసర్లు అంచనా వేశారు. ఇందులో -4 లక్షల టన్నులు కొనుగోలు చేయాలని సివిల్​ సప్లై ఆఫీసర్లు లక్ష్యంగా పెట్టకున్నారు. 

పీఏసీఎస్​ సెంటర్లే ఎక్కువ..

జిల్లాలో వడ్ల దిగుబడిని దృష్టిలో పెట్టుకుని 300 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అందులో పీఏసీఎస్ కు​187 సెంటర్లు కేటాయించారు.  ఐకేపీ 109, మెప్మా నాలుగు సెంటర్లు ఏర్పాటు చేయనున్నాయి. ఈ నెల మొదటి వారంలోనే కొనుగోలు కేంద్రాలను ప్రారంభించనుండగా, 268 సెంటర్లు తెరిచేందుకు సిద్ధంగా ఉన్నట్లు సివిల్​ సప్లై ఆఫీసర్లు చెబుతున్నారు. సన్నరకం, దొడ్డురకం వడ్లను వేర్వేరుగా కొననున్నారు. 

మిల్లర్ల పరిస్థితి ఏమిటి?

కొనుగోలు కేంద్రాల ద్వారా సేకరించిన వడ్లను బియ్యంగా మార్చి ఎఫ్​సీఐకి ఇచ్చేందుకు ప్రతి సీజన్​లో ప్రభుత్వం మిల్లర్లకు వడ్లను కేటాయిస్తుంది. క్వింటాల్​ వడ్లకు 67 కిలోల బియ్యాన్ని ఇవ్వాల్సి ఉంటుంది. అందుకు మిల్లర్లకు డబ్బులు చెల్లిస్తారు. ఇదిలాఉంటే మిల్లర్లలో చాలా మంది ప్రభుత్వం ఇచ్చిన వడ్లను అమ్ముకుని సీఎంఆర్​ బకాయిపడ్డారు. నాలుగేండ్లుగా సీఎంఆర్​ పెండింగ్​లో ఉంది. ప్రస్తుతం జిల్లాలో 172 రా రైస్​ మిల్లులు ఉన్నాయి. ఇందులో సీఎంఆర్​ పెండింగ్​ ఉన్న వారికి, మిల్లులు సీజ్​ అయిన వాటికి వడ్లు కేటాయించవద్దని నిర్ణయించారు. ఇక ఈసారి సన్న రకం వడ్లు ఉన్నందున మిల్లర్లు వడ్లు కేటాయింపు కోసం పడరాని పాట్లు పడుతున్నారు. 

గన్నీ బ్యాగులు సిద్ధం

ఖరీఫ్​ సీజన్​లో కొనుగోలు కేంద్రాల ద్వారా వడ్లు కొనేందుకు ప్రస్తుతం 25 లక్షల గన్నీ బ్యాగులు సిద్ధంగా ఉంచాం. ఇంకా బ్యాగుల కోసం ప్రపోజల్స్​ పంపించాం. టార్పాలిన్లు, తేమ యంత్రాలు, తాలు వేరు చేసే యంత్రాలను కొనుగోలు కేంద్రాల వద్ద అందుబాటులో ఉంచుతాం. జిల్లాలో ఒక కంప్లైంట్​ సెంటర్, కంట్రోల్​ రూమ్​ ఏర్పాటు చేస్తాం. – ఇర్ఫాన్, డీఎం సివిల్​ సప్లై