కరీంనగర్ ఆర్టీఏ ఆఫీసులో .. నిరుపయోగంగా  డ్రైవింగ్ టెస్ట్ ట్రాక్ 

  •  రూ.లక్షలతో నిర్మించిన ట్రాక్‌‌‌‌ ప్రారంభించకముందే శిథిలావస్థకు.. 
  •  ముళ్లపొదలతో నిండిన  పట్టించుకోని ఆఫీసర్లు

కరీంనగర్, వెలుగు: కరీంనగర్ ఆర్టీఏ ఆఫీసులో నిర్మించిన డ్రైవింగ్ టెస్ట్ ట్రాక్ నిరుపయోగంగా మారింది. లక్షలాది రూపాయలు వెచ్చించి నిర్మించిన ట్రాక్ ను ప్రారంభించకపోవడంతో చెట్లు ఏపుగా పెరిగి చిట్టడవిని తలపిస్తోంది. ట్రాక్ మొత్తం ముళ్లపొదలతో నిండిపోయి శిథిలావస్థకు చేరుకుంటోంది. రోజూ ఈ ట్రాక్ కళ్ల ముందే కనిపిస్తున్నా ఆర్టీఏ ఆఫీసర్లు పట్టించుకోవడం లేదు. నిధుల లేమితో సీసీ కెమెరాలు, సిగ్నల్స్, ఇతర సౌకర్యాలు కల్పించకపోవడం వల్లే వినియోగంలోకి రాలేదని చెప్తున్నారు. ట్రాక్ ప్రారంభించకపోవడంతో సమీపంలోని ఖాళీ ప్లేస్ లోనే డ్రైవింగ్ టెస్టులు నిర్వహిస్తున్నారు. వర్షాకాలంలో ఆ ప్రాంతమంతా నీళ్లు, బురద నిండిపోతోంది. దీంతో ఇటు వాహనదారులు, అటు ఎంవీఐలకు ఇబ్బందులు తప్పడం లేదు. 

నాలుగేళ్లు దాటినా పనులు పూర్తి కాలే..

కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ లోని ఆర్టీఏ ఆఫీసులో 2019లో అప్పటి ప్రభుత్వం ట్రాక్ నిర్మాణ పనులు చేపట్టింది. ఇందులో భాగంగా రోడ్లు, డివైడర్ల నిర్మాణం పూర్తి చేశారు. ఇందులో ముఖ్యమైన ‘8’, ‘హెచ్’ ట్రాక్‌‌‌‌ల నిర్మాణం పూర్తి కాలేదు. అలాగే సీసీ కెమెరాలు, సిగ్నల్స్ ఏర్పాటు చేయాల్సి ఉంది. అప్పటి ప్రభుత్వం పూర్తిగా నిధులు విడుదల చేయకపోవడంతో ఎక్కడికక్కడ పనులు నిలిచిపోయాయి. మరో రూ.15 లక్షలు మంజూరు చేస్తే పెండింగ్ వర్క్స్ పూర్తి చేయొచ్చని అప్పట్లో ఆఫీసర్లు అంచనా వేసి సర్కార్ కు ప్రతిపాదనలు పంపారు. కానీ ప్రభుత్వం నిధులు మంజూరు చేయకపోవడంతో పనులు పూర్తి కాలేదు. రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ నిధులు మంజూరు చేయించి, ట్రాక్ ను అందుబాటులోకి తీసుకురావాలని వాహనదారులు కోరుతున్నారు. 

ఖాళీ ప్లేస్ లో డ్రైవింగ్ టెస్టులు.. 

ఉమ్మడి జిల్లా కేంద్రంగా ఉన్న కరీంనగర్ లో ఇప్పటి వరకు డ్రైవింగ్ టెస్ట్ ట్రాక్ లేదు. కరీంనగర్ జిల్లా పరిధిలోని 16 మండలాల ప్రజలు డ్రైవింగ్ టెస్టులు, లైసెన్స్ రెన్యూవల్స్, వెహికిల్స్ రిజిస్ట్రేషన్ల కోసం ఇక్కడి ఆర్టీఏకు వస్తుంటారు. డ్రైవింగ్ పర్ఫెక్ట్​గా వచ్చిందా?  లేదా? అని అంచనా వేసేందుకు ‘8’, ‘హెచ్’ ట్రాక్ లపై డ్రైవింగ్ చేయాల్సి ఉంటుంది. కానీ ఆ ట్రాక్ ల నిర్మాణం పూర్తి కాకపోవడంతో ట్రాక్ అవతల ఉన్న ఖాళీ స్థలంలో టెస్టులు నిర్వహిస్తున్నారు. రాళ్లను హద్దులుగా పెట్టి డ్రైవింగ్ టెస్టులు చేయిస్తుండడం గమనార్హం.