గ్రేటర్ వరంగల్ లో పాత లైన్లతోనే పరేషాన్​!

  • రిపేర్లు చేసినా తరచూ లీకేజీలు
  • తాగునీటి సరఫరాకు ఇబ్బందులు 
  • జనాలకు తప్పని అవస్థలు 

హనుమకొండ, వెలుగు: గ్రేటర్ వరంగల్ నగరంలో తాగునీటి సరఫరాను లీకేజీల సమస్య వేధిస్తోంది. సిటీలో ఉన్న ప్రధాన పైపులైన్లలో సగానికిపైగా నాలుగు దశాబ్ధాల కిందట వేసినవే. అవి శిథిలావస్థకు చేరడంతో తరచూ లీకేజీలు ఏర్పడుతున్నాయి. ఫలితంగా నల్లాల్లో రంగు మారిన నీళ్లు వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే నగరంలో కొత్త కాలనీలకు డిస్ట్రిబ్యూటరీ వ్యవస్థ ఏర్పాటు చేయడంతోపాటు సిటీలో పాత లైన్లను మార్చేందుకు అధికారులు ప్రపోజల్స్ పంపించగా, ఇంకా మోక్షం లభించలేదు. దీంతో క్షేత్రస్థాయిలో లీకేజీల సమస్యల తీరకపోగా, కోట్ల రూపాయలతో వేసిన రోడ్లు లీకేజీల కారణంగా తవ్వాల్సిన పరిస్థితి 
ఏర్పడుతోంది. 

సగానికిపైగా 1982లో వేసినవే.. 

గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ దాదాపు 407 చదరపు కిలోమీటర్ల విస్తరించి ఉండగా, సుమారు 2.25 లక్షల ఇండ్లు, 11 లక్షలకు పైగా జనాభా ఉంది. బల్దియా ప్రజలకు తాగునీటిని అందించేందుకు ఇదివరకు 92 వాటర్ ట్యాంకులు, 27 కిలోమీటర్ల రా వాటర్ మెయిన్స్, 59.3 కిలోమీడర్ల ఫీడర్ మెయిన్స్, దాదాపు 1,400 కిలోమీటర్ల డిస్ట్రిబ్యూషన్ పైపులైన్లు ఉండేవి. 

కానీ, గత ప్రభుత్వం తీసుకొచ్చిన మిషన్ భగీరథ, కేంద్ర ప్రభుత్వ అమృత్ స్కీం కింద మొత్తంగా రూ.630 కోట్లతో కొత్తగా 33 వాటర్ ట్యాంకులు, 158 కిలో మీటర్ల ఫీడర్ మెయిన్స్, 1,380 కిలోమీటర్ల మేర డిస్ట్రిబ్యూటరీ లైన్లు వేశారు. కాగా, మిషన్ భగీరథ కంటే ముందే ఉన్న పాత లైన్లలో చాలావరకు 1982లో ఏర్పాటు చేసినవే. ఫీడర్ మెయిన్స్ వేసి దాదాపు నాలుగు దశాబ్ధాలు గడిచిపోవడం, వాటి మెయింటెనెన్స్ కూడా లేకపోవడంతో ఆ పైపులు కాస్త శిథిలావస్థకు చేరాయి. దీంతో వాటర్ ప్రెజర్ తట్టుకోలేక పైపులైన్లకు తరచూ లీకేజీలు ఏర్పడుతున్నాయి. 

లీకేజీలతో ఇబ్బందులు..

నగరంలో చాలాచోట్ల పైపు లైన్ల లీకేజీల సమస్య వేధిస్తోంది. ఒక్కో డివిజన్ లో కనీసం ఐదారు చోట్ల పైపులైన్​ లీకేజీలు ఉన్నట్లు క్షేత్రస్థాయి సిబ్బంది చెబుతున్నారు. దీంతో సిటీకి సప్లై అయ్యే 173 ఎంఎల్ డీ నీళ్లలో చాలావరకు వృథాగా పోతుండగా, లీకేజీల కారణంగా నల్లాల్లో కలుషిత, రంగు మారిన నీళ్లు వస్తున్నాయని ప్రజలు ఆరోపిస్తున్నారు. గతం నుంచే ఈ సమస్య ఉండగా, రెండేండ్ల కిందట హైదరాబాద్ మెట్రో వాటర్​ బోర్డుకు సంబంధించిన అధికారులతో వరంగల్ లో తాగునీటి వ్యవస్థ, లోపాలపై స్టడీ చేయించారు. 

అయినా ఇంతవరకు సమస్య మాత్రం తీరలేదు. నగరంలో ప్రధాన పైపులైన్లు చాలా ప్రాంతాల్లో మెయిన్​ రోడ్ల కింది నుంచే ఉన్నాయి. దీంతో లీకేజీలు ఏర్పడినప్పుడల్లా రోడ్లు కూడా దెబ్బతింటున్నాయి. రిపేర్ల కోసం రోడ్లను తవ్వాల్సివస్తోంది. ఫలితంగా రూ.కోట్లతో వేసిన రోడ్లు కొద్దిరోజులకే ధ్వంసం అవుతుండగా, ప్రజాధనం వృథా అవుతోంది. 

రూ.600 కోట్లతో ప్రపోజల్స్..

వరంగల్ ట్రై సిటీలో డైలీ వాటర్ సప్లై చేయాలనే డిమాండ్ ఉంది. ఈ మేరకు 2021 గ్రేటర్ ఎలక్షన్స్ కు ముందు అప్పటి మంత్రి కేటీఆర్ నగరంలో ఇంటింటికీ ప్రతిరోజు వాటర్​ సప్లై ప్రారంభించారు. కానీ, నగరంలో కొత్తగా ఏర్పడుతున్న కాలనీలకు వాటర్ సప్లై సిస్టం సరిగా లేకపోగా, ఇంకొన్ని చోట్ల శిథిలమైన పైపులైన్లు తరచూ లీకవుతూ సమస్యలు ఏర్పడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే గ్రేటర్ ఇంజినీరింగ్, పబ్లిక్ హెల్త్ ఆఫీసర్లు నగరంలో పైపులైన్లు, డిస్ట్రిబ్యూటరీ వ్యవస్థను డెవలప్​ చేయడంతో పాటు 24 గంటల వాటర్ సప్లై అందించేందుకు ప్రణాళికలు రెడీ చేశారు. 

ఈ మేరకు దాదాపు రూ. 600 కోట్ల అంచనా వ్యయంతో ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపించారు.  ఇందులో  అవసరం మేరకు మరిన్ని కొత్త ట్యాంకులు నిర్మించడం, ప్రధాన పైపులైన్ల మార్పులు, ఇతర రిపేర్లు చేయాలని నిర్ణయించారు. కానీ ఆ ప్రపోజల్స్ ప్రభుత్వం వద్దే పెండింగ్ లో ఉండటంతో క్షేత్రస్థాయిలో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఇప్పటికైనా శిథిలమైన పైపులైన్లను మార్చి, లీకేజీల సమస్యను పరిష్కరించాని గ్రేటర్ ప్రజలు కోరుతున్నారు.