కేసీఆర్ ధిక్కారం..బలం కాదు బలహీనత!

తెలంగాణలో ఆవరించిన చీకటిని నశింపచేస్తూ.. రాష్ట్ర పునర్నిర్మాణంలో  సీఎం రేవంత్ నాయకత్వంలో ఒక్కో పునాది వేసుకుంటూ అడ్డంకులను తొలగిస్తున్నకొద్దీ ఆ చీకటికి కారణమైన ప్రతిపక్ష నేతలలో  ప్రేతకళ ఆవరిస్తున్నది. దశాబ్ద కాలంపాటు అధికార భోగాలు అనుభవించి ఆఖరికి వృద్ధాప్య దశలో ప్రాప్తించిన అధికార విరహవేదన కేసీఆర్​కు భరింపశక్యం కాకుండా ఉంది. సమీప భవిష్యత్తులో అధికార పీఠాన్ని అందుకునే అవకాశం లేదనే వేదన పీడిస్తున్నది.  దీంతో జస్టిస్​ నరసింహారెడ్డి కమిషన్​ను  ఆయన ధిక్కరిస్తున్నారు. 

మతి గతి తప్పి బీఆర్ఎస్​ నాయకులు నానా వికారాలకు  గురవుతున్నారు. తాడు బొంగరం లేని వాదనలకు దిగుతున్నారు.  తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ అయినా రాష్ట్రంలో బీఆర్ఎస్​నే ఛాంపియన్ గా తొలుత ప్రజలు గుర్తించారు. కాంగ్రెస్ పాత్రే లేదని, తామే పోరాటం చేసి తెచ్చుకున్నామని డంబాచారం చేసినా తెలంగాణ సమాజం అడ్డు చెప్పలేదు. ఉమ్మడి రాష్ట్రంలో అరవై ఏండ్లుగా  తెలంగాణ పడ్డ గోసను కళ్లారా చూశారు కాబట్టి, కేసీఆర్​కు ఒక అవకాశం ఇవ్వాలని రెండు పర్యాయాలు అధికారం కట్టబెట్టారు. 

కానీ, ప్రజలను నమ్మించి మోసం చేశారు. కాళేశ్వరం ప్రాజెక్ట్  అవినీతి, కవిత లిక్కర్ స్కాం,  ప్రత్యర్థుల ఫోన్ ట్యాపింగ్​తో సతమతమవుతున్న  కేసీఆర్ విద్యుత్ విచారణను ఎదుర్కోలేక ఎదురుదాడి చేస్తున్నారు. జస్టిస్ ఎల్. నరసింహారెడ్డి ఏకపక్షంగా వ్యాఖ్యలు చేసినట్టు ఆధారాలు లేకపోయినా ఆరోపణలు చేయడం, అభియోగాలు మోపడం, బ్లాక్ మెయిల్ రాజకీయాలు చేయడం ఉద్యమనేత బలహీనతను బట్టబయలు చేస్తోంది.

కమిషన్​ ఎదుట.. హాజరవడానికి నామోషీ ఏమిటో?

బీఆర్ఎస్ ప్రభుత్వం రైతుల మేలు కోసం 24 గంటల కరెంట్ ఇస్తున్నామంటే కేసీఆర్ కు పాలా భిషేకం చేశారు. విద్యుత్ కొనుగోలులో అక్రమాలు జరిగాయని, యాదాద్రి, భద్రాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ల నిర్మాణాల్లోని లోటుపాట్లపై విచారించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కమిషన్ ఏర్పాటు చేస్తే జస్టిస్ నరసింహారెడ్డికి అర్హత లేదంటూ ధిక్క రించి కోర్టు మెట్లు ఎక్కారు. విద్యుత్ కొనుగోలులో కేసీఆర్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలన్నీ చట్టబద్ధమే అని చెప్పినప్పుడు కమిషన్ ఎదుట హాజరుకావడానికి వచ్చిన నామోషీ ఏమిటో?  గత ప్రభుత్వ నిర్ణయాలపై విచారణకు కమిషన్ ఆఫ్ ఎంక్వయిరీస్ యాక్ట్ -1952 కింద  రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏర్పాటు చేసిన జస్టిస్ ఎల్.నరసింహారెడ్డి కమిషన్​కు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 

తప్పులెన్నువాడు తన తప్పులెరుగడు' అని ఒక శతకకారుడు ఎన్నడో అన్నాడు. గురివిందకు తన నలుపు కనిపించదు. ఎందుకంటే 2018లో  రెండవ పర్యాయం అధికారం చేపట్టిన తర్వాత ఫిరాయింపులకు, అన్యాయాలకు, అక్రమాలకు, అవినీతి చర్యలకు, అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారంటే కేసీఆర్​ విస్మరించారు. అదే విషయాన్ని అసెంబ్లీ సాక్షిగా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రస్తావిస్తే నాటి విద్యుత్ మంత్రి  మీరు సిట్టింగ్ జడ్జ్ తో కానీ, కమిషన్ వేసికానీ విచారణ చేసుకోండి? మేం సిద్ధమేనంటూ సవాలు విసిరి,  ఇప్పుడు తప్పించుకోవడానికి కోర్టు మెట్లు ఎక్కడం దేనికి సంకేతం?  తెలంగాణ ఉద్యమంలో వెన్నుదన్నుగా నిల్చిన రిటైర్డ్ జస్టిస్ నరసింహారెడ్డిని కించపర్చేలా మాట్లాడడం విడ్డూరంగా ఉందని ప్రజాస్వామ్యవాదులు ప్రశ్నిస్తున్నారు. 

బీఆర్ఎస్​ను పాతాళంలోకి తొక్కిన కాళేశ్వరం

నీళ్లు, నిధులు, నియామకాలు అనే కోణంలో కేసీఆర్ ముందుకు సాగుతున్నారని, లక్ష కోట్లతో కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంతో ప్రజలను కేసీఆర్​ సర్కారు ప్రజలను మభ్యపెట్టింది.  ఎన్నికల ముందు మేడిగడ్డ పియర్స్ కుంగిపోయి ఆగమాగమైంది.  కాళేశ్వరం ప్రాజెక్టు ఎన్నికల సమయంలో బీఆర్ఎస్​ను పాతాళంలోకి తొక్కింది. నిధుల సమీకరణ కోసం వేలాది ఎకరాలు అమ్ముకున్నా పట్టించుకోలేదు, ఎందుకంటే సంక్షేమ పథకాలు అందరికీ అందాలంటే తప్పదు అనే ఆలోచనతో సర్ధుకుపోయారు. 

మిగులు రాష్ట్రాన్ని అప్పుల కొలిమిగా మార్చినా అభివృద్ధి కావాలంటే అప్పులు తప్పవనే భావనకు వచ్చాం.  నియామకాల విషయంలో ఇంటికో ఉద్యోగం ఇస్తామని చెప్పిన కేసీఆర్.. టీఎస్పీఎస్సీ నిర్వహించిన అన్ని ప్రశ్నపత్రాలు అంగట్లో సరుకులా మార్చింది. అసమర్థులను అందలం ఎక్కించి, నిరుద్యోగ యువతను రోడ్డున పడేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిషన్ రాజ్యాంగబద్ధ వ్యవస్థ అన్న  స్పృహ లేకపోవడం రాజ్యాంగ స్ఫూర్తికి పూర్తి విరుద్ధం.

డాక్టర్ సంగని మల్లేశ్వర్,
కాకతీయ యూనివర్సిటీ