కొత్త క్రిమినల్​ చట్టాలతో గందరగోళం.. కాలయాపన : మంగారి రాజేందర్

మూడు  కొత్త  క్రిమినల్​చట్టాలు జులై 1 నుంచి అమల్లోకి రానున్నాయి. ఈ అమలుని వాయిదా వేయమని ప్రముఖ న్యాయవాది ఇందిరా జైసింగ్​తోపాటు వందమంది బ్యూరోక్రాట్లు ప్రభుత్వాన్ని కోరారు. కానీ, ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేదు. దేశంలోని చాలామంది మేధావులు ఈ చట్టాల అమలువల్ల తలెత్తే పరిస్థితులు గురించి ఆందోళన వ్యక్తం చేశారు. అయినా,  కేంద్రం ఏమాత్రం పట్టించుకున్నట్లు లేదు.  

25 డిసెంబర్ 2023 నాడు భారత రాష్ట్రపతి ఈ చట్టాలకు ఆమోద ముద్ర వేశారు.  భారతీయ నాగరిక సురక్ష 2023,  భారతీయ సురక్ష సంహిత 2023,  భారతీయ సాక్ష్య అధినియం 2023..ఈ మూడు చట్టాలు అమలువల్ల పాత చట్టాలు క్రిమినల్​ ప్రొసీజర్​ కోడ్​ 1973,  భారతీయ శిక్షాస్మృతి 1860,  భారతీయ సాక్ష్యాధారాల  చట్టం 1872 రద్దు అవుతాయి. ఈ మూడు చట్టాలు పూర్తిగా రద్దుకావు.  

జూన్​30 రాత్రి 11.59 గంటల వరకు నమోదైన కేసులకి వర్తిస్తాయి. ఆ కేసులు తుదిరూపు తీసుకునేవరకు ఈ చట్టాలు అమల్లో ఉంటాయి. అంటే దేశ ప్రజలమీద మరీ ముఖ్యంగా పోలీసులు, న్యాయవాదులు, ప్రాసిక్యూటర్లు, న్యాయమూర్తులపై ఈ బరువు ఉంటుంది. వారు ఈ రెండు చట్టాలను చదవాల్సి ఉంటుంది. 

కొత్త చట్టాలతో పెరగనున్న పనిభారం

గతంలో క్రిమినల్​ ప్రొసీజర్​ కోడ్​ 1895ని  తొలగించి ప్రభుత్వం కొత్త చట్టం క్రిమినల్​ ప్రొసీజర్​ కోడ్​ 1973ని  అమల్లోకి తెచ్చింది.  పాత క్రిమినల్​ ప్రొసీజర్​ కోడ్​ 1898ని  ఏజెన్సీ ప్రాంతాల్లో కొనసాగించింది. ఆ ప్రాంతాలకి  క్రిమినల్​ ప్రొసీజర్​ కోడ్​ 1973 వర్తించదు. ఆ ఏజెన్సీ ప్రాంతాల్లో పనిచేసే న్యాయమూర్తులు పాత క్రిమినల్​ ప్రొసీజర్​ కోడ్​ చదవాల్సిన పరిస్థితి ఉంటుంది. ఇప్పుడు దేశవ్యాప్తంగా అందరూ తొలగించబోతున్న పాత చట్టాలని, అదేవిధంగా అమల్లోకి రాబోతున్న కొత్త చట్టాలను చదవాల్సిన పరిస్థితి ఏర్పడుతున్నది. ఈ పరిస్థితిని అధిగమించాలంటే కనీసం ఓ యాభై సంవత్సరాలు పడుతుంది.  

విచారణల్లో జాప్యం మరింత పెరగొచ్చు

అసలే మన న్యాయవ్యవస్థ నత్తనడకగా నడుస్తున్నది. ఈ రెండు కొత్త చట్టాల వల్ల కోర్టుల్లో పనిభారం పెరుగుతుంది. కేసుల విచారణల్లో జాప్యం ఇంకా పెరిగే అవకాశం ఉంది. రాజ్యాంగం తరువాత అత్యంత ముఖ్యమైన చట్టాలు ఈ మూడు చట్టాలు. ఈ మూడు చట్టాలు ప్రజల జీవితాలతో ముడిపడి ఉన్నాయి. మరీ ముఖ్యంగా అట్టడుగు వర్గాల ప్రజల జీవితాలకు ఈ చట్టాలలోని చాలా నిబంధనలు మేలు చేయవు. 

వారి జీవితాలను ఇంకా క్లిష్టతరం చేస్తాయి. పార్లమెంటులో ఎలాంటి చర్చ జరగకుండా ఈ చట్టాలని ఆమోదించారు. ప్రతిపక్షాలను బయటకు పంపించివేసి పార్లమెంటులో ఈ చట్టాలను ప్రభుత్వం ఆమోదించింది. దానివల్ల చాలా ప్రశ్నలకు సమాధానాలు లేకుండా పోయింది. 

పోలీసులకి విశేష అధికారాలు

ఈ కొత్త చట్టాల ప్రతిపాదన వచ్చినప్పటి నుంచి వాటి ముసాయిదా ప్రతిని ఆగస్టు 2023లో పెట్టినప్పటి నుంచి ప్రజల్లో విస్తృతమైన ఆందోళన మొదలైంది. ప్రజల నుంచి వ్యక్తమైన ఏ ఆందోళనని ప్రభుత్వం పట్టించుకోలేదు. బాధితులను ఈ చట్టాలు పట్టించుకున్నాయని, వారికి పెద్దపీట వేశాయని ప్రభుత్వం చెప్పింది. కానీ, వాస్తవంలో నిబంధనలు ఎక్కువగా కనిపిస్తాయి. ఈ కొత్త చట్టాల్లోని చాలా నిబంధనలు ‘రాజ్యానికి’ (స్టేట్)కు అనుకూలంగా ఉన్నాయి. పోలీసులకి విశేష అధికారాలను ఈ చట్టాలు ఇస్తున్నాయి. 

కొత్త చట్టాల వల్ల చాలా సమస్యలు ఉన్నాయి

ప్రథమ సమాచార నివేదిక (ఎఫ్ఐఆర్)ని నమోదు చేయించుకోవాలంటే బాధితులకు తలకిందకిపెట్టి తపస్సు చేసే పరిస్థితి ఏర్పడుతుంది.  ఈ మూడు కొత్త చట్టాల వల్ల ఇంకా చాలా సమస్యలు ఉన్నాయి. అవి ప్రధానంగా మూడు ప్రజాస్వామ్యయుతంగా కూడా ప్రజలు తమ అసమ్మతిని తెలియజేయడానికి అవకాశం లేదు. అసమ్మతిని వ్యక్తం చేయడం నేరమవుతుంది. రాజద్రోహాన్ని తొలగించి దానిస్థానంలో అదే మాదిరిగా, అంతకన్నా ఎక్కువ కఠినంగా ఉండే దేశద్రోహ నేరాన్ని తీసుకువచ్చారు. ఈ కొత్త చట్టాలు అమాయక పౌరులను, నిజాయితీ ప్రభుత్వ ఉద్యోగులను భయభ్రాంతులకు గురిచేస్తాయి. పోలీసులకి ఉన్న అపరిమిత అధికారాల వల్ల ఎవరినైనా అరెస్టు చేయడానికి వీలవుతుంది.

ప్రజాస్వామ్య వాతావరణం?

దర్యాప్తు సమయంలో పోలీసులు గతంలో మాదిరిగా రిమాండ్ అయిన మొదటి 15రోజుల్లో కాకుండా 90రోజుల్లో, 60 రోజుల్లో ఎప్పుడైనా పోలీసులు ముద్దాయిలను తమ కస్టడీలోకి తీసుకోవచ్చు. అంతేకాదు అసమ్మతిని వ్యక్తపరిచే వ్యక్తులను తీవ్రవాదులుగా, దేశద్రోహులుగా గుర్తించి ముద్రవేసి ప్రాసిక్యూట్ చేసే అధికారాలు రాజ్యానికి ఉన్నాయి. ఇవే కాకుండా అసాధారణ పరిస్థితుల్లో ఉపయోగించే నిబంధనలు మామూలు పరిస్థితుల్లోనే ఉపయోగించుకునే పరిస్థితి ఏర్పడుతుంది. 

ఈ చట్టాలు అమల్లోకి వచ్చిన తరువాత దేశంలో ప్రజాస్వామ్య వాతావరణం పోతుంది. చట్టం ద్వారా ఏర్పరచిన ప్రక్రియ ద్వారా తప్ప ఏ వ్యక్తి జీవితాన్నిగానీ, వ్యక్తిగత స్వేచ్ఛని హరించడానికి వీల్లేదు. ఇది ఆర్టికల్​ 21 ద్వారా రాజ్యాంగం అభయం ఇచ్చిన హక్కు. ఈ ప్రక్రియను ప్రధానంగా క్రిమినల్​ ప్రొసీజర్​ కోడ్​లో చెప్పారు. ఇప్పుడు ఆ చట్టం తన ఉనికిని కోల్పోతుంది. కొత్త చట్టాలు అమల్లోకి వస్తాయి. 

న్యాయవ్యవస్థపై ప్రతికూల ప్రభావం

నేరం చేసిన వ్యక్తిమీద కేసు పెట్టేది ‘రాజ్యం’.  పాత క్రిమినల్​ చట్టాలు చాలా సంవత్సరాలుగా అమల్లో ఉన్నాయి. ప్రతి నిబంధనని హైకోర్టులు, సుప్రీంకోర్టులు వ్యాఖ్యానించాయి. ఈ నేర చట్టాల నిబంధనలు సుప్రీంకోర్టు తీర్పుల వల్ల దాదాపు ఒక నిశ్చయతకి వచ్చాయి. ఇప్పడు మళ్లీ అనిశ్చితి ఏర్పడే అవకాశం ఉంది. జులై 1వ తేదీ నుంచి రెండు వేర్వేరు  నేర, సాక్ష్యాలు, ప్రొసీజర్లు ఉంటాయి. దీనివల్ల నేర న్యాయవ్యవస్థ మీద ప్రతికూల ప్రభావం ఏర్పడుతుంది. 

అవినీతి పెరుగుతుంది

పెద్దపెద్ద అకాడమీలు ఏర్పాటు చేసి పోలీసు లకు శిక్షణ ఇచ్చినా కూడా వాళ్ల దర్యాప్తు పరిధి భారతీయ సాక్ష్యాధారాల చట్టంలోని సె.27ని దాటలేదు. ఇప్పడు ఈ అపరిమిత అధికారా లతో అది సె.27ని దాటుతుందని ఆశించడం అత్యాశే అవుతుంది. క్రిమినల్​ ప్రొసీజర్​ కోడ్​ ప్రకారం బాధితులు కేసు నమోదు చేయాలం టేనే ఎంతో పైరవీ చేయాల్సి వస్తుంది. అవినీతి గురించి నేను మాట్లాడదల్చుకోలేదు. అది ప్రజలందరికీ తెలుసు. అది ఇప్పడు ద్విగుణీ కృతం  అవుతుంది. అంతులేకుండా పోతుం ది.  ఇప్పుడు ప్రతి నిబంధన సవాలుకి గురవు తుంది. సుప్రీంకోర్టు దాకా వెళ్లాల్సి వస్తుంది. ఈ వివాదాలు సుప్రీంకోర్టుకు చేరుకోవడానికి ఎంత సమయం తీసుకుంటాయో చెప్పలేం. అప్పటివరకు వ్యక్తి స్వేచ్ఛ, జీవించే హక్కు అనిశ్చితికి లోనవుతాయి.

కేసుల పరిష్కారంలో జాప్యం

అధిక భారంతో ఉన్న న్యాయవ్యవస్థపై  భారం ఇంకా ఎక్కువై అంతులేని జాప్యం కొనసాగుతుంది. క్రిమినల్​ ప్రొసీజర్​ కోడ్​ వలస చట్టం కాదు. అది 1973లో మనం తయారుచేసుకున్న చట్టం. 1ఏప్రిల్​1973 నుంచి అమల్లోకి వచ్చిన చట్టం.  ఇందులో అవసరమైన నిబంధనలను చేరిస్తే సరిపోయేది. అలా చేయకుండా చట్టాన్ని మొత్తంగా మార్చేశారు. 

వలస చట్టాలుగా పేర్కొన్న ఇండియన్​ పీనల్​కోడ్​లో కూడా పెద్దగా మార్పులేమీ చేయలేదు. రాజ్యానికి అవసరమైన కొన్ని కొత్త నిబంధనలను చేర్చినారు. అవికూడా ప్రజలను అణచివేసేవి.  భారతీయ సాక్ష్యాధారాల చట్టంలో చేసిన మార్పులు తక్కువే. ఈమాత్రం దానికి కొత్త చట్టాలు అవసరమా? పాతవాటి పేర్లు మార్చేసి సంతృప్తి చెందితే సరిపోయేది. ఇప్పడు అనవసర గందరగోళం. అనవసర జాప్యం, అణచివేత. ఇక ఏం జరుగుతుందో వేచి చూడాల్సిందే. 

- డా. మంగారి రాజేందర్,
జిల్లా జడ్డి (రిటైర్డ్)