మొదటి రోజే.. సినిమా చూడకపోతే గొంతెండి చనిపోతారా ?

గత సంవత్సరం బుక్​ ఎగ్జిబిషన్లో ఎవరో పబ్లిషర్​ నాకు ఓ పాంప్లెట్​ ఇచ్చాడు.  కానీ, ఆ పాంప్లెట్​ మీద ఓ ప్రముఖ డైరెక్టర్​ బొమ్మ ఉంది. అది లేకపోతే బాగుండేదని నేను అన్నాను. అతను నావైపు వింతగా చూశాడు. ‘మా వేములవాడ కథలు’ రాసిన రచయిత నేనని అతనికి తెలియదు. నేను రచయితను అని కూడా అతనికి తెలియదు. తెలిస్తే ఆలోచించేవాడేమో నాకు తెలియదు. కానీ, అతని వింత చూపు నాకు ఇంకా గుర్తుంది.  మంచి పుస్తకాలు ప్రచురించే పబ్లిషరో  లేక రచయితో నాకు తెలియదు. కానీ, ఒక మాస్​ సినీ దర్శకుడి మీద అంత వ్యామోహం, బలహీనత ఉంటే మామూలు ప్రజల సంగతి చెప్పాల్సింది ఏముంది?  నా దగ్గర వందకోట్లు ఉన్నా.. పది రూపాయల బిస్కెట్​పాకెట్​ని పది రూపాయలకే  కొంటాను కానీ అంతకు మించి ఒక్క పైసా కూడా ఎక్కువ పెట్టను అంటాడు ఓ సినీ నటుడు.

డబ్బు అనేది ఒక అందమైన శక్తి.  అది నీరులాగ పంపిణీ అవుతూనే ఉండాలి. అతన్ని ఇంటర్వ్యూ చేసిన వ్యక్తి  ఒక మనిషిగా నన్ను గెలిచావని అతడిని కౌగిలించుకుంటాడు. ప్రేక్షకులందరూ చప్పట్లు కొడతారు. డబ్బు గురించి అది వాళ్ల దృక్పథం.  మనం రోడ్డుమీద  ప్రయాణం చేస్తున్నప్పుడు  చౌరస్తాల  దగ్గర వాహనాలు  ఆగగానే ముసలివాళ్లు అడుక్కోకుండా పెన్నులు ఇంకా అలాంటివి అమ్మడానికి వస్తుంటారు.  వాటి విలువ పది రూపాయలు కూడా ఉండదు. కానీ, యాభై రూపాయలు, వంద రూపాయలు పెట్టి కొన్న వ్యక్తులను ఎంతోమందిని చూశాను. మానవత్వం గురించి అది వాళ్ల దృక్పథం.

మనుషులకు చాలా బలహీనతలు ఉంటాయి
రేవతి మరణం తరువాత నాకు ఈ రెండు సంఘటనలు గుర్తుకు వచ్చాయి. మనుషులకు చాలా బలహీనతలు ఉంటాయి. కొంతమందికి డబ్బు బలహీనత ఉంటుంది. అధికార బలహీనత ఉంటుంది.  డ్రగ్స్, తాగుడు ఇట్లా ఎన్నో బలహీనతలు ఉంటాయి. కొంతమందికి మొదటిరోజు తమ హీరో సినిమా చూడాలన్న బలహీనత ఉంటుంది. ఈ బలహీనతలను ప్రోత్సహించే విధంగా ప్రభుత్వాలు పనిచేయకూడదు. 

‘వెయ్యి కోట్లు పెట్టాం కాబట్టి మొదటి రోజు లక్ష కోట్లు పిండుకోవాలి’  అన్నవిధంగా  సినిమావాళ్లుంటారు.  ఈ ఆధునిక దోపిడీ నిలువరించాల్సిందిపోయి  ప్రభుత్వాలు బెనిఫిట్​ షోలకు,  ప్రీమియర్​ షోలకు అనుమతులు ఇస్తున్నాయి. ఇవి ఎవరి బెనిఫిట్​ల కోసం? ఈ టికెట్ల ధర పెంపు ఎందుకోసం?  ప్రభుత్వాలు ఎందుకు ఆమోదం ఇస్తున్నాయి? 

తొక్కిసలాటలు, విషాదకరమైన సంఘటనలు జరిగిన తరువాత కానీ ప్రభుత్వాలు ఈ బెనిఫిట్​ షోల గురించి ఆలోచించడం మొదలుపెట్టాయి.  ఇకపై హైదరాబాద్లో  బెనిఫిట్​ షోలకి అనుమతులు ఉండవని మంత్రి ప్రకటన. ఒక ప్రాణం పోయిన తరువాతనైనా ప్రభుత్వం కళ్లు తెరిచిందని చాలామంది అనుకుంటున్నారు.  ప్రి రిలీజ్ సినిమా ఫంక్షన్లకి అనుమతులు కొంతకాలం ఇవ్వకపోవచ్చు. కాలక్రమంలో ఈ మరణం, ఈ సంఘటన మరుగునపడుతుంది. అప్పుడు మళ్లీ సినిమా లాబీ, పైరవీలు చేయకుండా ఉంటుందా?  ప్రభుత్వాలుఈ నిర్ణయం మీదే స్థిరంగా ఉంటాయా?  మరిన్ని మరణాలు సంభవించకుండా ఉంటాయా? ఈ ప్రశ్నలకు సమాధానాలు అంత సులువుగా దొరకవు.

సినిమా అనేది ఓ వ్యాపారం
మొదటిరోజే.. సినిమా చూడకపోతే  గొంతెండి చనిపోతారా?  సినిమా చూడమని మిమ్మల్ని ఎవరైనా బెదిరిస్తున్నారా?  ఇలాంటి ప్రశ్నలు వాటిని సమర్థిస్తూ కొన్ని వ్యాఖ్యానాలు కనిపిస్తాయి. డ్రగ్స్​ తీసుకొమ్మని మిమ్మల్ని ఎవరైనా అంటున్నారా? అనడం లేదు కానీ డ్రగ్స్​తీసుకోవడం నిషిద్ధం. అది నేరం. మన దేశం క్యాప టిలిస్ట్​ దేశం కాదు. సంక్షేమం వైపు మన ప్రయాణం. మనుషుల బలహీనతలకి అడ్డుకట్ట వేయాల్సిన బాధ్యత ప్రభుత్వాలమీద ఉంది.  నా దృష్టిలో ఈ బెనిఫిట్​ షోలు,  ఈ  ప్రీ రిలీజ్​ ఫంక్షన్లు  డ్రగ్స్​ కన్నా ప్రమాదకరమైనవి. వీటి బందోబస్తులకు వందలాది పోలీసులు అవసరం.  సినిమా అనేది ఓ వ్యాపారం. 

Also Read : సమాచార రంగంలో విప్లవం వికీపీడియా

ఇంకా చెప్పాలంటే  ప్రజల బలహీనతలని ఆధారం చేసుకొని,  చెడుని ప్రవహింపజేస్తున్న సాధనం.  దీనికి  సంక్షేమ ప్రభుత్వాలు పనిముట్లు కావడం ఎందుకు?  వాళ్ల లాభాల కోసం,  స్వార్థం కోసం  ప్రమోషన్​ మీటింగ్​లు పెట్టి,  భారీగా ఫ్యాన్స్​ను  పిలిచి హంగామా చేయడానికి  ప్రభుత్వాలు  ఎందుకు సహకరించాలి?    ఊరి బయట , నగరం బయట  ఈ మీటింగ్​లకు  అనుమతి ఇస్తే మంచిదేమో.  ఈ బహిరంగ సభల్లాంటి  మీటింగ్​లు అనవసరం.  వీటిని తగ్గించాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉంది. 

భారీ సినిమాలను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాలదా?
గ్యాస్​ సిలిండర్​ ధర పెరిగినా, పెట్రోలు ధరలు పెరిగినా ధర్నాలు చేసే రాజకీయ పార్టీలు, మేధావులు ఈ సినిమా ధరలు పెంచినప్పుడు, ఆవిధంగా పెంచుకోవడానికి అనుమతులు ఇచ్చినప్పుడు ఎందుకు మౌనంగా ఉంటున్నారు? భారీ బడ్జెట్​ సినిమాలని ఆదుకోవాల్సిన  బాధ్యత  ప్రభుత్వాలకు ఎందుకు?   సినిమా విడుదలైన  వారం రోజుల్లో తమ పెట్టుబడులు తిరిగి పొందాలనే లక్ష్యంతో  చిత్ర పరిశ్రమ పనిచేస్తుంది.  అందుకు  ప్రభుత్వం దోహదపడుతోంది. ఇందుకోసమే బెనిఫిట్​ షోలు, ప్రమోషన్​ మీటింగ్​లు.  దీనివల్ల యువతలో పెడధోరణి ఎక్కువ అవుతోంది. 

ఈ పరిస్థితి ఎక్కువగా దక్షిణాదిలోనే  కనిపిస్తుంది. ఈ మధ్య ఓ పత్రికలో చదివాను. ఆ వార్త ప్రకారం కేరళలోని ఓ పట్టణంలో ఓ సినిమా హీరో అభిమాని ఉన్నాడు. అతను కొంతబాధలో ఉన్నప్పుడు అతని గదిలో అంగుళం, అంగుళం అంటించిన  ఆ హీరో బొమ్మలతో మాట్లాడుతుంటాడట. అతని మాదిరిగా అంటే సినిమాలో మాదిరిగా ఎదగాలని అనుకుంటాడట, హీరోలాగ డ్రెస్సులు వేసుకోవడం, నడవడం, హావభావాలను వ్యక్తపరచడం వరకు అయితే ఫర్వాలేదు. ఆ సినిమాలో  మాదిరిగా  ఎదగాలని అనుకోవడంలోనే ఉంది సమస్య. 

సొమ్ముని కొల్లగొట్టే విధానాన్ని ప్రభుత్వం ఇకనైనా ఆపాలి
సినిమా హీరో, ఇతర నటులు అక్కడికి వస్తున్నారన్న సమాచారాన్ని ఇవ్వడంలో థియేటర్​ యాజమాన్యం విఫలమైనట్టు వార్తలు వస్తున్నాయి. సినిమా నటులను చూసేందుకు విపరీతమైన జనం గుమిగూడినారని, భద్రతకు సంబంధించి సరైన చర్యలు తీసుకోలేదన్న వార్తలు వినిపిస్తున్నాయి. కారణాలు ఏవైనా ఆ తొక్కిసలాటలో  రేవతి అనే మహిళ మరణించింది. తప్పు ఎవరిది అన్న ప్రశ్న వేసుకుంటే సమాధానం దొరకడం కష్టం. చేప ఎందుకు ఎండలేదో చెప్పడానికి  ఆ కథలో చీమ ఉంది. ఈ సంఘటనలో చీమ లేదు. 

ఎవరికి తోచింది వారు ఊహించుకోవచ్చు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా తగు చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంమీద ఉంది. ప్రజల బలహీనతలను ఆసరా చేసుకుని సొమ్ముని కొల్లగొట్టే విధానాన్ని ప్రభుత్వాలు ఇకనైనా ఆపాలి.  భారీ బడ్జెట్​ సినిమాల దోపిడీకి  ప్రభుత్వం ఎందుకు సహకరించాలి?  ఎన్నింటినో రెగ్యులైజ్​ చేసే ప్రభుత్వాలు ఈ టికెట్ల విషయంలో ఎందుకు ఉదారంగా వ్యవహరిస్తున్నాయి? ఇవీ ప్రశ్నలు.  బిస్కెట్​ పాకెట్​ విలువ పది రూపాయలే అయినా కొన్నిసార్లు వంద రూపాయలు పెట్టి కొనాల్సి వస్తుంది.  ఒక బాటిల్ నీరును వెయ్యి రూపాయలుపెట్టి కొనాల్సిరావచ్చు!

అభిమానులపై సినిమా భారం
సినిమా విజయం అనేది ఎక్కువగా ఈ అభిమానుల మీద ఆధారపడి ఉంది.  ఈ అభిమానులు తమ హీరోల పట్ల తీవ్రమైన నిబద్ధత కలిగి ఉంటారు. అందుకుని అభిమాన సంఘాలను ప్రోత్సహిస్తున్నారు. అందుకోసమే ఈ ప్రమోషన్  మీటింగ్​లు,  ప్రదర్శనలు. సినీతారలను చూడటానికి అభిమానులు ఎగపడటంలాంటివి  జరుగుతున్నాయి.  అభిమానుల హింసాత్మక గొడవల మధ్య ప్రాణాలు కోల్పోయిన వ్యక్తులు కూడా ఉన్నారు.

రేవతి మరణానికి కారణం వేరు. అక్కడ జరిగిన తొక్కిసలాటలో ఆమె మరణించింది. థియేటర్​  యాజమాన్యం తగు చర్చలు తీసుకుందా, సినిమా బృందం సరైన ముందస్తు చర్యలు తీసుకున్నారా అన్న విషయం పోలీసుల దర్యాప్తులో తేలవచ్చు. కొంతకాలం తరువాత  మరో సంఘటన జరుగుతుంది.  ప్రజలు ఈ విషయాన్ని మరిచిపోవచ్చు. పోలీసులు సినీహీరో మీద, థియేటర్​ యాజమాన్యం మీద కేసులు పెట్టినట్టు, కొంతమందిని రిమాండ్​ చేసినట్టుగా మీడియాలో  వార్తలు కనిపించాయి.  నిజానికి పోలీసులు పెట్టిన సెక్షన్లతోబాటు  కుట్ర సెక్షన్ని కూడా పెట్టాల్సిన అవసరం ఉందేమో.

డా. మంగారి రాజేందర్