తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ, ప్రైవేటు, రెసిడెన్షియల్ డిగ్రీ కళాశాలలో ప్రవేశాలకు నిర్వహించే ‘డిగ్రీ ఆన్‌లైన్ సర్వీసెస్, తెలంగాణ’ (దోస్త్) వల్ల అనేక ఉపయోగాలు ఉన్నాయి. కానీ, ఈ దోస్త్ ప్రవేశాల వల్ల చాలా కళాశాలల్లో దాదాపు సగానికి పైగా సీట్లు మిగిలిపోతున్నాయి. డిమాండ్ ఉన్న కోర్సులలో అడ్మిషన్లు జరుగుతుండగా, మిగతా కోర్సుల్లో పూర్తిస్థాయి అడ్మిషన్లు జరగడం లేదు.
ప్రభుత్వ కళాశాలల్లో కూడా కేవలం సైన్స్, డిమాండ్ ఉన్న కోర్సుల్లోనే దోస్త్ ద్వారా ప్రవేశాలు పొందుతున్నారు. మిగతా సబ్జెక్టులలో పూర్తిస్థాయి అడ్మిషన్లు కాకుండా సీట్లు మిగిలిపోయి ఆ కోర్సులు ఎటువంటి ఆదరణ లేకుండా మిగిలిపోతున్నాయి. పారదర్శకత ఉందని భావించినప్పటికీ ఎక్కువ సీట్లు మిగిలిపోవడం వల్ల స్థానిక కళాశాలలో డిగ్రీ అభ్యసించాలనుకున్న గ్రామీణ ప్రాంత విద్యార్థులకు దోస్త్ ఓరకంగా శాపంలా మారింది.
పేరొందిన కళాశాలలో, నగర ప్రాంత విద్యార్థులు పోటీ పడటం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి డిగ్రీ కళాశాలలో సీట్లు నిండక, స్థానిక విద్యార్థులు కూడా ప్రవేశాలు పొందలేక అనేక ఇబ్బందులు పడుతున్నారు. -2024 విద్యా సంవత్సరం లెక్కల ప్రకారం మన రాష్ట్రవ్యాప్తంగా అన్నీ కలిపి ప్రభుత్వ, ప్రైవేటు, రెసిడెన్షియల్ డిగ్రీ కళాశాలలు 1055 ఉన్నాయి. వీటిలో 4,57,704 సీట్లు ఉన్నాయి.
ఈ ఏడాది కేవలం 1,92,442, సీట్లు మాత్రమే నిండగా 2.61 లక్షల సీట్లు మిగిలిపోయాయి. గ్రామీణ ప్రాంతాల్లో160 ప్రభుత్వ కళాశాలలు ఉండగా అందులో 61.96 శాతం సీట్లు నిండాయి. 815 ప్రైవేటు కళాశాలలు ఉండగా వాటిలో కేవలం 38.39 శాతం సీట్లు నిండాయి, 79 రెసిడెన్షియల్ కళాశాలల్లో 38.87 శాతం సీట్లు నిండాయి. గ్రామీణ ప్రాంతాల కంటే పట్టణ ప్రాంతాలలోని ప్రభుత్వ డిగ్రీ కాలేజీల్లో ఎక్కువగా విద్యార్థులు చేరుతున్నారు.
దోస్త్ వల్ల ‘సామాజిక శాస్త్రాలకు’ తగ్గిన ఆదరణ
ఆన్‌లైన్ విధానంలో దోస్త్ ద్వారా ప్రవేశాలు జరుగుతున్నప్పటి నుంచి సైన్స్, కామర్స్ కోర్సులకి స్టూడెంట్ ఎన్రోల్మెంటులో ఎటువంటి సమస్యలు రాలేదు. కానీ, సామాజిక శాస్త్రాలకు ఆదరణ తగ్గింది. ఎందుకంటే గత కొన్ని సంవత్సరాలుగా సాధారణంగా డిగ్రీలో చరిత్ర, అర్థశాస్త్రం, రాజనీతి శాస్త్రం కాకుండా మిగిలిన సామాజిక శాస్త్రాలన్నీ ‘మూక్స్ ఆన్‌లైన్’ విధానంలో ఒక సబ్జెక్టుగా చేర్చడం ద్వారా ఎక్కువ మంది విద్యార్థులు ఈ సబ్జెక్టులను డిగ్రీ ప్రవేశాలలో తీసుకోలేదు.
కొంతమంది ఆన్లైన్లో ఒక సబ్జెక్టుగా ఎంపిక చేసుకున్నప్పటికీ వారికి ఆన్‌లైన్ విధానంలో బోధన చేసే అధ్యాపకులు, మౌలిక వనరులు కళాశాలలో లేకపోవడం వల్ల తిరిగి మళ్లీ రెగ్యులర్ విధానంలో ఉన్న సబ్జెక్టులని ఎంపిక చేసుకున్నారు. ఉదాహరణకు సోషియాలజీ సబ్జెక్టు సివిల్స్ లో చాలామంది తీసుకుంటారు. మూక్స్ విధానంలో పెట్టడం వల్ల ఎక్కువమంది విద్యార్థులు ఈ సబ్జెక్టును తీసుకోలేదు. అదేవిధంగా జర్నలిజం, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, సైకాలజీ లాంటి కోర్సులను ఆన్‌లైన్ విధానంలో పెట్టడం వల్ల వీటికి ఆదరణ తగ్గిపోయింది.
గ్రామీణ ప్రాంతాల కాలేజీల అభివృద్ధికి దోస్త్ ఆటంకం
దోస్త్ విధానం ఎత్తివేయడం వల్ల స్థానిక కళాశాలలో పూర్తిస్థాయిలో సీట్లు నిండుతాయి. దీనివల్ల గ్రామీణ ప్రాంతాలకు స్థానిక ప్రాంతాల్లో ఉన్న విద్యార్థులకు వారి దగ్గరలో నచ్చిన కళాశాలలో డిగ్రీ చదివే వెసులుబాటు లభిస్తుంది. గ్రామీణ ప్రాంతాలకు చెందినటువంటి విద్యార్థులకు పేరొందిన ప్రైవేటు కళాశాలలో సీట్లు రావడంలేదు.
దోస్త్ విధానంలో దూర ప్రాంతాలకు చెందిన విద్యార్థులు ఒక జిల్లాలో పుట్టి పెరిగి మరొక జిల్లాలో విద్యను అభ్యసించడానికి వెళ్తున్నారు. ఒకవేళ దోస్త్ ప్రక్రియను ఎత్తివేస్తే స్థానిక జిల్లాలో ఉన్నటువంటి కళాశాలలో ప్రవేశాలు తీసుకోవడం వల్ల రెగ్యులర్గా తరగతులకు హాజరయ్యే అవకాశం ఉంటుంది. గతంలో క్లస్టర్ విధానం ద్వారా ఒక కళాశాలలో అడ్మిషన్ తీసుకుంటే మరొక కళాశాలలో కూడా తరగతులు వినే వెసులుబాటును ప్రభుత్వం కల్పించినప్పటికీ ఆ విధానం పూర్తిగా విఫలమైంది. కాబట్టి, ప్రభుత్వం ప్రస్తుతం దోస్త్ విధానంలో ఉన్నటువంటి అంశాలను పరిగణనలోకి తీసుకొని గ్రామీణ విద్యార్థులకు వెసులుబాటు, సౌకర్యంగా ఉండే విధంగా ప్రభుత్వ కళాశాలలను బలోపేతం చేయాలి.
దోస్త్ లేకుండా..
దోస్త్ లేకుండానే డిగ్రీ ప్రవేశాలను చేపడితే సీట్లు మిగలకుండా ఎక్కువ సంఖ్యలో విద్యార్ధులు సాంకేతికత, వైద్య రంగాలకే కాకుండా డిగ్రీలో కూడా ఉన్నత విద్యని అభ్యసించే అవకాశం లభిస్తుందని మేధావుల, విద్యావేత్తల అభిప్రాయం. ఆ దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. వచ్చే విద్యా సంవత్సరం నుంచి దానికి సంబంధించినటువంటి విధానాలను ఉన్నత విద్యా మండలి అమలు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
15 శాతం మంది విద్యార్ధులు లేకపోతే కోర్సులను మూసివేసే దిశగా ప్రభుత్వం నిర్ణయించింది. కానీ, ఈ దోస్త్ విధానం ఎత్తివేస్తే ప్రైవేటు, ప్రభుత్వ కాలేజీల్లో స్థానికంగా ఉన్న విద్యార్ధులని అధిక సంఖ్యలో ప్రవేశాలు తీసుకోనేలా చర్యలు చేపడుతారు. దానివల్ల కోర్సుల మూసివేత జరగకుండా ఉంటుంది. ప్రభుత్వం కూడా ప్రభుత్వ కళాశాలల్లో నూతన కోర్సులను, స్కిల్ డెవలప్మెంట్, ఉపాధి, ఉద్యోగ అవకాశాలని కల్పించే మరిన్ని కోర్సులని ప్రవేశపెట్టాలి. మౌలిక సదుపాయాలను కూడా మెరుగుపరచాలి.
- డా. శ్రవణ్ కుమార్ కందగట్ల-