జనగణనతో ఏ రాష్ట్రానికీ.. అన్యాయం జరగొద్దు

 2026 జనాభా లెక్కల తర్వాత జరగనున్న డీలిమిటేషన్ అనంతరం భారత పార్లమెంటులో సీట్ల సంఖ్య గణనీయంగా పెరగనుంది. లోక్‌‌‌‌సభలో ప్రస్తుత 543 స్థానాల నుంచి దాదాపు 888 స్థానాలకు పెరుగుతుందని అంచనా. దేశవ్యాప్తంగా రాష్ట్రాలకు న్యాయమైన ప్రాతినిధ్యాన్ని కల్పించాలి.  రాజ్యసభలో కూడా సంఖ్యాబలం ప్రస్తుత 245 నుంచి దాదాపు 

384 సీట్లకు పెరగనుందని భావిస్తున్నారు.

మన దేశంలో జనాభా గణనకు సంబంధించిన దాఖలాలు క్రీస్తు పూర్వం 3వ శతాబ్దంలో కౌటిల్యుడు రచించిన అర్థశాస్త్రంలో ప్రస్తావించడమైంది. అదేవిధంగా మొగలుల పాలనలో అక్బర్ పరిపాలనా నివేదిక ఐన్-ఇ-అక్బరీలో కూడా జనాభాకు సంబంధించిన గణన గురించి పేర్కొనడం జరిగింది. స్వాతంత్ర్యానికి పూర్వం1872లో మొదటి క్రమబద్ధమైన ప్రయత్నం వైస్రాయ్ లార్డ్ మాయో ఆధ్వర్యంలో జరగగా, పూర్తి సమకాలిక జనాభా గణన 1881లో నిర్వహించడం జరిగినది. 10 సంవత్సరాలకు ఒకమారు జనాభా గణన సంప్రదాయానికి తెరతీసింది. 

 స్వాతంత్ర్యానంతరం జన గణన నిర్వహించడానికి చట్టబద్ధమైన కార్యాచరణ కోసం 1948 జనాభా లెక్కల చట్టం రూపొందించడం జరిగింది. ఆ క్రమంలో చివరగా 2011లో జనగణన నిర్వహించారు. 2021లో జరగవలసిన జనాభా గణన కొవిడ్ 19 మహమ్మారి కారణంగా వాయిదా వేయడమైంది. అయితే నేడు సార్వత్రిక ఎన్నికలు జరిగి, బడ్జెట్ అనే ముఖ్యమైన అంకం ముగిసిన సందర్భంలో జనాభా గణనకు సంబంధించిన విస్తృత విధాన రూపకల్పన  కేంద్ర ప్రభుత్వం త్వరలోనే చేస్తుందని ఆశిద్దాం.

దేశాభివృద్ధికి జనగణన తప్పనిసరి

2011లో జరిగిన జనగణన ద్వారా ప్రపంచ జనాభాలో 17.5% జనాభా అనగా సుమారు 121 కోట్ల జనాభా ఉన్నట్లుగా రికార్డు చేయడం జరిగింది. అత్యధిక జనాభా కలిగిన రాష్ట్రాలుగా ఉత్తర ప్రదేశ్, మహారాష్ట్ర, బిహార్,  వెస్ట్ బెంగాల్ తొలి నాలుగు స్థానాల్లో ఉన్నాయి. అయితే, చివరిసారిగా పార్లమెంట్ స్థానాల పునర్విభజన 1971లో జరిగిన జనగణన ఆధారంగా 1977లో జరిగింది. ఆనాడు జనాభా ప్రాతిపదికన ఉత్తరప్రదేశ్​కు 80 పార్లమెంటు స్థానాలు, మహారాష్ట్రకు 48 స్థానాలు, వెస్ట్ బెంగాల్​కు 42 స్థానాలు, బిహార్​కు 40 స్థానాలు కేటాయించారు. 

జనాభా గణన ఆధారంగా ప్రభుత్వ పథకాలు, నిధుల కేటాయింపు, చట్టసభల ప్రాతినిధ్యం అను కీలక అంశాలు ముడిపడి ఉన్నాయి. అనేక ప్రభుత్వ పథకాలకు సంబంధించిన బ్లూప్రింట్ ముఖ్యంగా జాతీయ గ్రామీణ ఆరోగ్య మిషన్, సర్వ శిక్ష అభియాన్, జాతీయ గ్రామీణ ఉపాధి హామీ, పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టం వంటి పథకాల అమలు, మౌలిక సదుపాయాల కల్పన అనగా రహదారులు పాఠశాలలు, ఆసుపత్రుల నిర్మాణంకు జనాభా లెక్కలు తప్పనిసరి.

 జనాభా ఆధారంగానే మన దేశంలో సంపదను అంటే పన్నుల రూపంలో వచ్చిన నిధులను కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు పంచడం జరుగుతున్నది. ముఖ్యంగా ఎన్నికల డిలిమిటేషన్ ప్రక్రియ కోసం అత్యంత కీలకమైన వనరుగా మనం జనగణనను పరిగణిస్తున్నాం.

కుల, జన గణనతో అన్ని వర్గాల అభివృద్ధి

2011లో జరిగిన జనాభా లెక్కలు ఇతర సర్వేల ద్వారా దేశంలో సుమారు 41% ఓబీసీలు, 19.59% షెడ్యూల్డ్ కులాలు, 8.63% షెడ్యూల్డ్ తెగలు, ఇతరులు 30.8% ఉన్నట్లుగా పేర్కొన్నారు. ఇతరులగా పేర్కొన్న 30% లో ఓసీల సంఖ్యను కూడా జత చేయడం జరిగింది. అయితే నేడు సమాజంలో నెలకొని ఉన్న ఆర్థిక అసమానతలను రూపుమాపడానికి జనాభా లెక్పింపును ఒక సమగ్రమైన వేదికగా భావిస్తూ సమాజంలో ఉన్న సామాజిక స్థితులను లోతుగా అధ్యయనం చేయడంలో భాగంగా కులగణనతో పాటుగా జనాభా గణన చేస్తూ భారతదేశంలో ఉన్న వివిధ వర్గాల లెక్కలను సరి చూడవలసిన అవసరం ఎంతైనా ఉన్నది. విద్య, ఆరోగ్య సంరక్షణ, మౌలిక సదుపాయాల కోసం నిధుల కేటాయింపు ఏ వర్గాలకు ఏ శాతంలో జరగాలి,  అసమానతల పరిష్కారం, జీవన పరిస్థితులను మెరుగుపరచడంలో తీసుకోవలసిన కార్యాచరణను సూచిస్తుంది. 

దేశ జీడీపీలో దక్షిణాది రాష్ట్రాలదే కీలక పాత్ర  

జనాభా గణన ఆధారంగా రాజకీయ ఆర్థిక, సామాజిక మార్పులు తప్పవు అనుకుంటే, దక్షిణాది రాష్ట్రాలకు రాజకీయ వాటా అంటే పార్లమెంటు స్థానాలు.. అదేవిధంగా ఆర్థిక వనరుల కేటాయింపు అనే అంశం కీలకం. 1980 దశకం నుంచి దక్షిణాది రాష్ట్రాలు జనాభా నియంత్రణకు కృషి చేస్తూ జనాభా నియంత్రిస్తూ ఆర్థిక ప్రగతిని సాధిస్తూ దేశ ఖజానాకు విదేశీ నిల్వలను అదేవిధంగా దేశ సమగ్ర అభివృద్ధికి కృషి చేశాయి. 

సుమారు 83.7 లక్షల కోట్ల జీఎస్ డీపీతో మన దేశ జీడీపీకి 30% దక్షిణాది రాష్ట్రాలు 2022–23లో అందజేశాయి. అయితే అదే స్థాయిలో బడ్జెట్ కేటాయింపులు, దక్షిణాది రాష్ట్రాల అభివృద్ధి జరగటం లేదు. దానికి గల ముఖమైన కారణాలలో నిధుల కేటాయింపు జనాభా ప్రాతిపదికన జరగుతుండడమే. 

విస్తృత చర్చ జరపాలి

మార్పులు పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా ఉంటాయి. ఈ మార్పులు జనాభాకు అనుగుణంగా జరిగినట్లయితే మెజారిటీ పార్లమెంటు, రాజ్యసభ స్థానాలు ఉత్తర భారతదేశంలో ఉన్న రాష్ట్రాలకు కేటాయించబడతాయి తద్వారా దేశంలో రాజకీయ అస్థిరత ఏర్పడుతుంది. సమతుల్యత దెబ్బతినే అవకాశం మెండుగా కనిపిస్తుంది. దీనిని తప్పక చర్చించవలసిన అవసరం ఉన్నది. అదేవిధంగా దేశ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని సరిగా ప్రాతినిధ్య చట్టాన్ని దేశంలో తీసుకురావాల్సిన అవసరం ఉన్నది. దీనికోసందేశంలో ఉన్నతవిశ్వవిద్యాలయాల్లో, సామాజిక వేదికలలో విస్తృతంగా చర్చ జరపాలి. జాతీయ అభివృద్ధిని కాంక్షించే ఒక రాజకీయ విధానాన్ని దేశంలో తీసుకురావాల్సిన అవసరం
ఎంతైనా ఉంది.

- ఏలే వెంకటనారాయణ, 
నిర్మాణ్ ఫౌండేషన్