కష్టకాలంలో కూడా ధర్మమార్గాన్ని విడనాడక ఉండుట మంచి నడవడి అనిపించుకుంటుంది. పేదవాడైనా దానం చేసేవాడు పుణ్యపురుషుడు అనిపించుకుంటాడు.
న్యాయార్జితమైన ధనాన్ని అర్హులకు ఇవ్వకపోవడం, అనర్హులకు ఇవ్వడం వలన కీడు కలుగుతుంది – అని విదురుడు చెప్పిన ఈ మాటలు విదురనీతిగా ప్రసిద్ధం.
ఒక్కడు మాంసమిచ్చె మఱియొక్కడు చర్మము గోసి యిచ్చె వేఱొక్కరు డస్థి నిచ్చె నిక నొక్కడు ప్రాణములిచ్చె వీరిలో నొక్కని పట్టునన్ బ్రదుక నోపక యిచ్చిరొ కీర్తి కిచ్చిరోచక్కగ జూడు మంత్రి కుల సంభవ! రాయనమంత్రి భాస్కరా!
ఒకరు శరీరంలో నుండి మాంసాన్ని కోసి ఇచ్చారు. ఒకరు చర్మం కోసి ఇచ్చారు. మరొకరు వెన్నెముక ఇచ్చారు. ఇంకొకరు ప్రాణమే ఇచ్చారు. వీళ్ళంతా బతక లేకనో, కీర్తికోసమో... ఈ పనులు చేయలేదు. ఒక పావురానికి శరణు ఇచ్చి, ఆ జీవి కోసం తన శరీరం నుండి మాంసం కోసి ఇచ్చాడు శిబి చక్రవర్తి. ఇంద్రుడు స్వయంగా వచ్చి, కర్ణుడిని తన సహజ సిద్ధమైన కవచకుండలాలను అడిగిన తడవుగానే శరీరం నుండి కోసి ఇచ్చాడు. రాక్షస సంహారానికి ఇంద్రునికి ఆయుధంగా తన వెన్నెముకను ఇచ్చిన మహానుభావుడు దధీచి. వామనుడు అడిగితే ప్రాణమే ఇచ్చినవాడు బలిచక్రవర్తి.
వీరంతా మహాదాతలుగా చరిత్రలో నిలిచిపోయారు. ఒకనాడు జగద్గురువులు ఆదిశంకరాచార్యుల వారు ఒక ఇంటికి భిక్షకు వెళ్ళారు. ఆ ఇల్లాలు నిరు పేదరాలు. ఆమెకి కట్టుకోవడానికి సరైన వస్త్రాలు కూడా లేవు. శంకరులకు ఏదో ఒకటి భిక్ష వేయాలని ఆమె మనసు తహతహలాడింది. ఇల్లంతా వెతకగా... ఆమెకు ఒకే ఒక్క ఉసిరికాయ లభించింది. ధర్మపరురాలైన ఆ ఇల్లాలు ఆ ఉసిరికాయను శంకరునికి సమర్పించింది. ఆ ధర్మాత్మురాలి పరిస్థితి తెలుసుకున్న ఆదిశంకరాచార్యుడు లక్ష్మీదేవిని స్తుతిస్తూ కనకధారా స్తవం చెప్పాడు. తక్షణమే ఆ ఇంట బంగారు ఉసిరి కాయలు వర్షించాయని పండితులు చెప్పారు. దానం చేయటానికి ఆమె పేదరికం ఆటంకం కాలేదు.
నాటి ఉభయగోదావరి జిల్లాల్లో నిరతాన్నదాతగా, అన్నపూర్ణగా ప్రసిద్ధి చెందిన మహిళామణి డొక్కా సీతమ్మ. గోదావరి మధ్యస్థంగా ఉన్న డెల్టా ప్రాంతంలోని డెల్టా గన్నవరం లేదా లంకల గన్నవరం అని పిలిచే గ్రామానికి కోడలిగా వెళ్లారు సీతమ్మ. తరచుగా వచ్చే వరదలు, అతివృష్టి, అనావృష్టి కారణంగా అనేక ఇబ్బందులకు గురయ్యే ఆ ప్రాంత పేదలను ఆదుకుంటూ, వచ్చిన వారికి లేదనకుండా నిత్యాన్నదానం జరిపిన మహాఇల్లాలు ఆమె. చదువుసంధ్యలు లేని సాధారణ స్త్రీ అయిన సీతమ్మ అన్నదానం చేసి, విశ్వమానవతకు అద్దం పట్టారు. అన్నదానానికి మించిన దానంలేదని విశ్వసించి, ఆకలిగొన్న వారికి అన్నం పెట్టడమే ధ్యేయంగా నిలిచిన వ్యక్తి డొక్కా సీతమ్మ.
ఒక ఊరిలో సక్తుప్రస్తుడు అనే ఒక నిరుపేద నివసించేవాడు. ఆయనకు భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. ఒకసారి వారికి మూడు రోజుల దాకా అన్నం దొరకలేదు. నాలుగోనాడు కొద్దిగా పేల పిండి లభించింది. దానిని నలుగురూ సమానంగా పంచుకుని తిందాం అనుకుంటున్న సమయంలో ఒక వృద్ధుడు వచ్చి, ‘‘ఆకలిగా ఉంది. ఏదైనా ఉంటే పెట్టమ’’ని అడుగుతాడు. అప్పుడు సక్తుప్రస్థుడు తన భాగం పేల పిండిని దానంగా ఇస్తాడు.
ఇంకా ఆకలిగా ఉందనటంతో ఆ కుటుంబమంతా ఒకరి తరవాత ఒకరు వారి చేతిలోని పేల పిండిని దానం చేస్తారు. ఆనందంతో ఆ వృద్ధుడు, ‘‘మీ అతిథి సత్కారం, అన్నదానం నాకు సంతృప్తిని ఇచ్చాయి. మీరందరూ ఆకలితో ఉన్నా, మీ ఆహారం అంతా నాకు ఇచ్చి, అపారమైన పుణ్యం పొందారు. ఇక నుండి అనేక లోకాలచే స్తుతింపబడతారు మీరు. ఆకలితో బాధపడుతున్న వ్యక్తి పాప కార్యం చేయటానికి సాహసిస్తాడు.
అటువంటి స్థితిలో, ఒక వ్యక్తికి ఇచ్చిన ఆహారం లోకానికి అపారమైన హితం చేస్తుంది. గొప్ప దానాలలో అన్నదానం ఒకటి. అది అనంత పుణ్యాన్ని కూడా ఇస్తుంది’’ అని అంటుండగా, ఒక దివ్య విమానం వస్తుంది. సక్తుప్రస్థుని కుటుంబం ఊర్ధ్వ లోకాలకు చేరుకుంది. ఆ ఆహారం తిని చేతులు కడిగిన నీళ్లను తాకిన ముంగిస శరీరభాగాలు బంగారంగా మారాయి. అదీ దానం యొక్క గొప్పదనం.
డా. పురాణపండ వైజయంతి ఫోన్ : 80085 51232