టీమ్ ఎంపికపై ట్రంప్ ఫోకస్.. 2.0 కేబినెట్‎లో ఇండియన్ అమెరికన్‎లకు ఛాన్స్..!

వాషింగ్టన్: అమెరికాలో అధికార మార్పిడికి సంబంధించిన ప్రక్రియ ప్రారంభమైంది. దీనిపై చర్చించేందుకు వైట్ హౌస్‎కు రావాలని కాబోయే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‎ను ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్ ఆహ్వానించారు. త్వరలోనే వైట్ హౌస్‎లో సమావేశం జరగనున్నట్టు ట్రంప్ అధికార ప్రతినిధి స్టీవెన్ చియూంగ్ తెలిపారు. జనవరిలో అధ్యక్ష పగ్గాలు చేపట్టనున్న ట్రంప్.. తన టీమ్ ను రెడీ చేసుకుంటున్నారు. కేబినెట్‎లోకి ఎవరెవరిని తీసుకోవాలనే దానిపై కసరత్తు చేస్తున్నారు. ఏయే మంత్రిత్వ శాఖకు ఎవరెవరైతే బాగుంటుందనే దానిపై ట్రంప్ టీమ్ షార్ట్ లిస్టు తయారు చేస్తున్నది. 

ఆర్థిక శాఖ మంత్రి పదవికి బిలియనీర్ జాన్ పాల్సన్, ఆర్థిక సలహాదారు స్కాట్ బెసెంట్.. విదేశాంగ శాఖ మంత్రి పదవికి సెనేటర్ మార్కో రూబియో, నేషనల్ ఇంటెలిజెన్స్ మాజీ డైరెక్టర్ రిచర్డ్ గ్రెనెల్ పేర్లను పరిశీలిస్తున్నారు. డిఫెన్స్ మినిస్టర్ పోస్టును సెనేటర్ టిమ్ కాటన్‎కు, హెల్త్ అండ్ ఫుడ్ సేఫ్టీ ఏజెన్సీలను రాబర్ట్ ఎఫ్ కెన్నెడీ జూనియర్‎కు అప్పగించే అవకాశం ఉంది.  నార్త్ డకోటా గవర్నర్ డౌగ్ బుర్గమ్ కూ కేబినెట్ లో చోటు దక్కే చాన్స్ ఉంది. 

కేబినెట్‎లో ఇండియన్ అమెరికన్‎లకూ చాన్స్ 

ట్రంప్ 2.0 కేబినెట్‎లో ఇండియన్ అమెరికన్ నేతలు వివేక్ రామస్వామి, తులసీ గబ్బార్డ్, కశ్యప్ పటేల్, బాబీ జిందాల్, నిక్కీ హేలీకి కూడా చాన్స్ దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక వైట్ హౌస్ చీఫ్ ఆఫ్ స్టాఫ్ పోస్టుకు ట్రంప్ అడ్వైజర్ సూసీ వైల్స్ ముందంజలో ఉన్నారు. కాగా, ట్రంప్ కు ప్రెసిడెంట్ జో బైడెన్ గురువారం ఫోన్ చేసి శుభాకాంక్షలు తెలిపారు.  అధికార మార్పిడి ప్రశాంతంగా జరిగేలా చూస్తానని హామీ ఇచ్చారు. దీనిపై చర్చించేందుకు వైట్ హౌస్ కు రావాలని ఆహ్వానించారు. అలాగే ప్రజలను ఉద్దేశించి బైడెన్ శుక్రవారం మాట్లాడనున్నారు.