ట్రంప్​ ఈజ్​ బ్యాక్​ .... అమెరికా 47వ అధ్యక్షుడిగా ఘన విజయం

  • ఏండ్ల తర్వాత రెండోసారి ప్రెసిడెంట్​గా పగ్గాలు
  • చరిత్రాత్మక తీర్పునిచ్చిన అమెరికా ఓటర్లు
  • గట్టి పోటీ ఇచ్చినా కమలా హారిస్​కు నిరాశే
  • స్వింగ్ స్టేట్స్ అన్నీ ట్రంప్ వైపే మొగ్గు 
  • 538 ఎలక్టోరల్ కాలేజీ ఓట్లలో 292 ఓట్లతో జయకేతనం
  • ఈజీగా మ్యాజిక్ ఫిగర్​ను దాటేసిన మాజీ ప్రెసిడెంట్
  • జనవరి 20న బాధ్యతల స్వీకరణ
  • ట్రంప్​292, కమల 224

ఆయనకు మళ్లా అంత సీన్​ లేదని సర్వేలు ఊదరగొట్టినయ్.. మీడియా కూడా అదే రాగం అందుకుంది! కానీ, ఆయన మాత్రం జనాన్ని నమ్ముకున్నడు.. ‘నేషన్​ ఫస్ట్’​ అంటూ 78 ఏండ్ల వయసులో 900కుపైగా ర్యాలీలు తీసిండు.. చావు అంచుల దాకా వెళ్లి ‘ఐ యామ్​ బ్యాక్​’ అంటూ జయభేరి మోగించిండు.. గోడకు విసిరిన బాల్​ లెక్క వెనక్కి తిరిగొచ్చిండు! అమెరికాకు మళ్లీ డొనాల్డ్​ ట్రంప్​ అధ్యక్షుడైండు. నాలుగేండ్ల విరామం తర్వాత వైట్​ హౌస్​లో అడుగుపెట్టిన వ్యక్తిగా రికార్డు సృష్టించిండు. వందేండ్ల చరిత్రను తిరగరాసిండు!!

వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష పీఠం మళ్లీ డొనాల్డ్ ట్రంప్ నే వరించింది. దేశానికి తొలి మహిళా ప్రెసిడెంట్ కావాలన్న కమలా హారిస్ కల చెదిరిపోయింది. నాలుగేండ్ల నాటి ఎన్నికల్లో ట్రంప్​ను ఓడించిన జనం.. ఈసారి మాత్రం ఆయనవైపే మొగ్గుచూపారు. రిపబ్లికన్ నేతకు చరిత్రాత్మక విజయాన్ని కట్టబెట్టారు. అమెరికా 47వ అధ్యక్షుడిగా రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి, మాజీ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ విజయ దుందుభి మోగించారు. అమెరికా అధ్యక్ష ఎన్నికలకు మంగళవారం తెల్లవారుజామున ప్రారంభమైన ఓటింగ్ రాత్రి దాకా కొనసాగింది. మొత్తం 24 కోట్ల మంది ఓటర్లు ఉండగా, దాదాపు16 కోట్ల మంది ఓటేశారు. పోలింగ్ ముగిసిన వెంటనే కౌంటింగ్ ప్రారంభమైంది. బుధవారం తెల్లవారుజాముకల్లా పెనిసిల్వేనియా స్టేట్ ఫలితం వెల్లడి కాగానే అధ్యక్షుడిగా ట్రంప్ విజయం ఖరారు అయిపోయింది. 

దేశవ్యాప్తంగా మొత్తం 538 ఎలక్టోరల్ కాలేజీ ఓట్లు ఉండగా.. మధ్యాహ్నంకల్లా ట్రంప్ 292(మ్యాజిక్ ఫిగర్ కంటే 22 ఎక్కువ) సీట్లతో ఘన విజయం సాధించారు. డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి, వైస్ ప్రెసిడెంట్ కమలా హారిస్(60) 224 సీట్లకు పరిమితమై ఓటమిపాలయ్యారు. డొనాల్డ్ ట్రంప్ నాలుగు ఏండ్ల విరామం తర్వాత రెండోసారి అమెరికా అధ్యక్షుడిగా గెలిచారు. దేశ చరిత్రలోనే ఈ ఘనత సాధించిన రెండో నేతగా ఆయన రికార్డ్ సృష్టించారు.  భారత కాలమానం ప్రకారం.. బుధవారం రాత్రి 12 గంటల సమయానికి ట్రంప్ 292 ఎలక్టోరల్ కాలేజీ ఓట్లు గెలుపొందగా, మరో మూడు  రాష్ట్రాల్లో (20 ఎలక్టోరల్ ఓట్లు) ముందంజలో ఉన్నారు. కమలా హారిస్ 224 ఎలక్టోరల్ కాలేజీ ఓట్లను గెలుచుకోగా, ఒక్క మైన్ రాష్ట్రంలోని 2 ఎలక్టోరల్ కాలేజీ స్థానాల్లో మాత్రమే ఆధిక్యంలో ఉన్నారు. ఇక ట్రంప్ మొత్తంగా 7,18,93,987 పాపులర్ ఓట్లు  (51.0%) గెలుపొందగా.. కమలకు 6,70,39,246 పాపులర్ ఓట్లు(47.5%) వచ్చాయి.  మిగతా రాష్ట్రాల్లోనూ ఫలితాలు వెల్లడైతే.. ట్రంప్ మొత్తం 300కుపైగా ఎలక్టోరల్ కాలేజీ ఓట్లను సాధించే అవకాశాలు ఉన్నాయి. కాగా, అమెరికా చరిత్రలోనే అత్యధిక వయస్సులో (78 ఏండ్లు) ప్రెసిడెంట్ గా గెలిచిన తొలి నేతగా ట్రంప్ రికార్డ్ సృష్టించారు. విజయం ఖరారు కాగానే ట్రంప్ ఫ్లోరిడాలోని పామ్ బీచ్ లో తన మద్దతుదారులను ఉద్దేశించి విక్టరీ స్పీచ్ ఇచ్చారు. సరదాగా డ్యాన్స్ చేస్తూ విజయాన్ని సెలబ్రేట్ చేసుకున్నారు. ఇంతటి ఘన విజయం అందించిన దేశ ప్రజలకు థ్యాంక్స్ చెప్పారు. తన భార్య మెలానియా, కాబోయే వైస్ ప్రెసిడెంట్ జేడీ వాన్స్, ఆయన భార్య ఉషా వాన్స్, బిలియనీర్ ఎలాన్ మస్క్ ఈ విజయానికి ఎంతో శ్రమించారని కొనియాడారు.  

అధ్యక్షుడిగా రెండోసారి.. 

ట్రంప్ 2017 జనవరి నుంచి 2021 జనవరి వరకూ అమెరికా 45వ ప్రెసిడెంట్​గా బాధ్యతలు నిర్వర్తించారు. 2020 ఎన్నికల్లో డెమోక్రటిక్ నేత జో బైడెన్ చేతిలో ఓడిపోయారు. ఇప్పుడు నాలుగేండ్ల తర్వాత అమెరికా 47వ అధ్యక్షుడిగా (రెండోసారి) బాధ్యతలు చేపట్టనున్నారు. కాగా, ట్రంప్​కు భారత ప్రధాని మోదీ, ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు, బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్, ఫ్రెంచ్ ప్రెసిడెంట్ ఇమాన్యుయెల్ మాక్రన్, ఇతర దేశాల అధినేతలు శుభాకాంక్షలు తెలిపారు.  

సెనేట్, ప్రతినిధుల సభలోనూ హవా.. 

అమెరికాలో అధ్యక్ష ఎన్నికలతోపాటు సెనేట్, ప్రతినిధుల సభకు, పలు రాష్ట్రాల గవర్నర్ పదవులకు కూడా ఒకేసారి ఎన్నికలు జరిగాయి. అమెరికన్ కాంగ్రెస్ ఎగువ సభ సెనేట్ లో 100 స్థానాలు ఉండగా 34 స్థానాలకు, దిగువ సభ అయిన ప్రతినిధుల సభలోని మొత్తం 435 స్థానాలకు, 11 రాష్ట్రాల గవర్నర్ పదవులకు కూడా సమాంతరంగా పోలింగ్ నిర్వహించారు. అయితే, ఈ మూడు ఎన్నికల్లోనూ రిపబ్లికన్ పార్టీ ఆధిక్యం కొనసాగింది. ప్రతినిధుల సభ ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ 201 స్థానాలు గెలుచుకుని మ్యాజిక్ ఫిగర్(218)కి చేరువలో ఉంది. డెమోక్రటిక్ పార్టీ 182 సీట్లతో వెనకంజలో కొనసాగుతోంది. ఇంకా 52 స్థానాల్లో ఫలితాలు వెల్లడికావాల్సి ఉంది. సెనేట్ లోని 34 సీట్లలో రిపబ్లికన్లు 14 , డెమోక్రాట్లు 20 సీట్లు గెలుచుకున్నారు. అయితే, డెమోక్రటిక్ పార్టీకి ఇదివరకే ఎక్కువ సీట్లు ఉండటంతో తాజా సీట్లతో కలిపి సెనేట్ లో మ్యాజిక్ ఫిగర్ (50)ని దాటి ఒక సీటు ఎక్కువగా గెలుచుకున్నట్టయింది. ఇక 11 గవర్నర్ పదవుల్లో రిపబ్లికన్ పార్టీ 8 గవర్నర్ పదవులను గెలుచుకోగా, డెమోక్రటిక్ పార్టీకి 3 పదవులు దక్కాయి.

ఓటమిపై స్పందించని కమల

ఎన్నికల్లో ట్రంప్ విజయం ఖరారు కావడంతో కమలా హారిస్ తన ఎలక్షన్ వాచ్ పార్టీని అర్ధంతరంగా క్యాన్సిల్ చేసుకున్నారు. ఒకప్పుడు తాను చదువుకున్న వాషింగ్టన్ లోని హోవార్డ్ యూనివర్సిటీలో కమల ఎలక్షన్ వాచ్ పార్టీకి సిద్ధమయ్యారు. అయితే, ఎన్నికల ఫలితాలు క్రమంగా ట్రంప్ కు అనుకూలంగా వస్తుండటంతో ఆమె తీవ్ర నిరాశకు గురయ్యారు. చివరకు ట్రంప్ విజయం ఖాయమని తేలిపోవడంతో ఆమె మద్దతుదారులు, యూనివర్సిటీ స్టూడెంట్లు కన్నీటిపర్యంతం అయ్యారు. కమల ఏమీ మాట్లాడకుండానే వెళ్లిపోయారు. సాధారణంగా అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాల తర్వాత విజేత విక్టరీ స్పీచ్ ను ఇవ్వడం, ఓడిపోయిన నేత ఓటమిని అంగీకరిస్తూ స్పీచ్ ఇవ్వడం ఆనవాయితీగా వస్తోంది. అయితే, ఎన్నికల ఫలితాలపై కమల తర్వాత స్పందిస్తారని ఆమె టీమ్ బుధవారం ఉదయం ఒక ప్రకటనలో తెలిపింది.

కంగ్రాట్స్ మై ఫ్రెండ్

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో చరిత్రాత్మక విజయం సాధించిన నా మిత్రుడు డొనాల్డ్ ట్రంప్‌కు అభినందనలు. మీ గత పదవీకాల విజయాలకు తగ్గట్టుగా.. ఇండియా, యూఎస్ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడానికి, ఇరు దేశాల మధ్య సహకార సంబంధాల్ని మరింత పెంపొందించడానికి ఎదురుచూస్తున్నా. ప్రపంచ శాంతి, మన ప్రజల అభివృద్ధి,  స్థిరత్వం, శ్రేయస్సు కోసం కలిసి పని చేద్దాం.      - ప్రధాని నరేంద్ర మోదీ

యుద్ధాలు చేయను.. ఆపుత

అమెరికా ప్రజలు ఎన్నడూ ఊహించనంతటి అద్భుత తీర్పు చెప్పారు. అమెరికాను మళ్లీ గొప్ప దేశంగా నిలబెడతా. స్వర్ణ యుగాన్ని తెస్తా. దేశాన్ని రక్షించడం కోసమే, మళ్లీ గొప్పగా నిలబెట్టడం కోసమే ఆ దేవుడు నన్ను బతికించాడు. నేను యుద్ధాలు చేయను.. ఆపుతా. డొనాల్డ్ ట్రంప్