ట్రంప్ గెలిచేశాడు.. 47వ అమెరికా అధ్యక్షుడిగా ఎన్నిక

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ నుంచి పోటీ చేసిన డోనాల్డ్ ట్రంప్ గెలిచేశాడు.. కమలా హారిస్ ను చిత్తు చేసి.. రెండో సారి అధ్యక్ష పీఠం ఎక్కనున్నాడు ట్రంప్. అమెరికాకు 47వ అధ్యక్షుడిగా త్వరలో బాధ్యతలు స్వీకరించనున్నాడు ట్రంప్.

అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ 277 సీట్లలో విజయం సాధించగా.. కమలా హారిస్ 226 సీట్లలో గెలుపొందారు. మ్యాజిక్ ఫిగర్ 270. మొత్తం స్థానాలు 538.. ఇంకా 35 స్థానాల్లో ఫలితాలను ప్రకటించాల్సి ఉంది. ఇప్పటి వరకు ప్రకటించిన రిజల్ట్స్ తోనే.. ట్రంప్ మ్యాజిక్ ఫిగర్ దాటి.. అదనంగా ఏడు స్థానాల్లో గెలుపొందాడు. ట్రంప్ గెలుపుతో రిపబ్లికన్ పార్టీలో సంబరాలు అంబరాన్ని అంటాయి. 

గతం కంటే భిన్నంగా ఈసారి అమెరికా అధ్యక్ష ఎన్నికలు చాలా హోరాహోరీగా సాగాయి. రెండోసారి అధ్యక్ష పీఠంపై ఎలాగైనా కూర్చోవాలన్న కసితో ట్రంప్ చేసిన ప్రచారం ఎట్టకేలకు ఫలించింది. ట్రంప్ కు ధీటుగానే అధికార డెమోక్రటిక్ పార్టీ శక్తివంచన లేకుండా ప్రయత్నించింది. ప్రస్తుత అధ్యక్షుడు బైడెన్ ను కాదని.. వైస్ ప్రెసిడెంట్ కమలా హారిన్ ను అధ్యక్షురాలిగా బరిలోకి దింపింది డెమోక్రటిక్ పార్టీ. 

కమలాహారిస్ వర్సెస్ ట్రంప్ మధ్య ప్రచారం జోరుగా సాగింది. ముఖ్యంగా వలసలు, ఫ్రీడం ఆఫ్ స్పీచ్, ఆర్థిక వ్యవస్థ, ధరల పెరుగుదల, ఆయా దేశాల్లో జరుగుతున్న యుద్ధాలకు అమెరికా జోక్యం వంటి అంశాలను ప్రధానంగా ప్రచార అస్త్రాలు అయ్యాయి.  

డెమోక్రటిక్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అమెరికాలోకి అక్రమ వలసలు భారీగా ఉన్నాయని.. దేశ భద్రతకు ఇది ముప్పు అనేది ట్రంప్ మొదటి నుంచి చెబుతూ వస్తున్నారు. ఇదే సమయంలో ధరల పెరుగుదల అంశం కీలకంగా మారింది. ఉద్యోగ, ఉపాధి అవకాశాలు, ఆర్థిక వ్యవస్థ కుదేలు వంటి అంశాలు ప్రచారంలో కీలకంగా మారాయి. 

ట్రంప్ లేవనెత్తిన ప్రతి అంశాన్ని డెమోక్రటిక్ తరపున కమలాహారిస్ తీవ్రంగా తిప్పికొట్టినా.. మెజార్టీ ప్రజలు మాత్రం మళ్లీ ట్రంప్ వైపే మొగ్గు చూపారు. ట్రంప్ వస్తేనే అన్ని సెట్ రైట్ అవుతాయని బలంగా భావించారు. అందుకు తగ్గట్టుగానే రిపబ్లికన్ పార్టీకి పట్టం కట్టారు.